అమెరికాలో గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాప్తి చెందిన మహమ్మారి

ABN , First Publish Date - 2020-08-03T23:13:05+05:30 IST

అమెరికాలో కరోనా మహమ్మారి గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలకు కూడా వ్యాప్తి చెందినట్టు

అమెరికాలో గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాప్తి చెందిన మహమ్మారి

వాషింగ్టన్: అమెరికాలో కరోనా మహమ్మారి గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలకు కూడా వ్యాప్తి చెందినట్టు వైట్ హౌస్ కరోనా వైరస్ నిపుణులు ఆదివారం వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని.. గవర్నర్లతో కలిసి పనిచేసేందుకు ప్రజారోగ్య అధికారులు ప్రయత్నిస్తున్నట్టు వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ డెబోరా బిక్స్ తెలిపారు. ప్రస్తుతం అమెరికన్లు కరోనాకు సంబంధించి కొత్త ఫేస్‌లో ఉన్నట్టు డెబోరా చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో కంటే ఇప్పుడు కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారంతా ఇళ్లలో కూడా తప్పకుండా ఫేస్‌మాస్క్ ధరించాలని.. వయసు పైబడిన వారిని కాపాడాలని డెబోరా తెలిపారు. ఒకవేళ ఫేస్‌మాస్క్‌లు ధరించకపోతే కరోనా వైరస్ ఇదే విధంగా వ్యాప్తి చెందుతూ పోతుందన్నారు. గడిచిన మూడు వారాల్లో తాను 14 రాష్ట్రాలను సందర్శించానని.. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుసుకున్నానని డెబోరా అన్నారు. ‘కరోనాకు హాట్‌స్పాట్‌గా ఉన్న ప్రాంతానికి వెకేషన్‌కు వెళ్లాలనుకుంటే.. మీరు కరోనా బారిన పడ్డారని అనుకోవాలి’ అని డెబోరా చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో అనారోగ్యంతో, ఇతర వ్యాధులతో బాధపడేవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా డెబోరా చెప్పారు.

Updated Date - 2020-08-03T23:13:05+05:30 IST