అమెరికాలో మళ్లీ పూర్తిస్థాయి ఆంక్షలు!

ABN , First Publish Date - 2020-07-08T22:10:10+05:30 IST

అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. ఫోర్త్ ఆఫ్ జులై(స్వాతంత్ర్య దినోత్సవం)

అమెరికాలో మళ్లీ పూర్తిస్థాయి ఆంక్షలు!

వాషింగ్టన్: అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. ఫోర్త్ ఆఫ్ జులై(స్వాతంత్ర్య దినోత్సవం) వీకెండ్ సందర్భంగా అమెరికన్లు విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చి పార్టీలు చేసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెంది కేసులు భారీగా పెరిగిపోయాయి. ఇక చేసేదేం లేక అమెరికాలోని అనేక రాష్ట్రాలు తిరిగి పూర్తిస్థాయి ఆంక్షలను విధించేందుకు సిద్దమయ్యాయి. అమెరికాలోని అరిజోనా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాలు కరోనాకు కేంద్రంగా మారిపోయాయి. ఫ్లోరిడాలోని అనేక నగరాలు కరోనాకు కేంద్రంగా మారడంతో రెస్టారెంట్లు, జిమ్‌లు, ఫంక్షన్ హాళ్లను మూసివేస్తున్నట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. అరిజోనా రాష్ట్రంలో 89 శాతం ఐసీయూ బెడ్లు ఫుల్ అయిపోయాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. ఆసుపత్రులు మొత్తం పేషంట్లతో నిండిపోతే పరిస్థితి ఎలా ఉంటుందోనని అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. మరోపక్క ఫేస్‌మాస్క్ ధరించడం తప్పనిసరంటూ అనేక రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. ట్రంప్ కారణంగా అమెరికాలో మెజారిటీ ప్రజలు ఫేస్ మాస్క్ కూడా ధరించడం లేదని అనేక వార్తా సంస్థలు చెబుతున్నాయి. 


ట్రంప్ ఇప్పటివరకు ఎక్కడా ఫేస్‌మాస్క్ ధరించి కనిపించలేదు. పైగా ఫేస్‌మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 99 శాతం కరోనా కేసులు ప్రమాదరహితమైనవి అంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం జులై నెలలోని మొదటి ఆరు రోజుల్లోనే అమెరికా వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల కేసులు నమోదయ్యాయి. మరోపక్క గత వారం రోజుల్లో వెస్ట్ వర్జీనియా, టెన్నెస్సీ, మోంటానాలలో భారీగా కేసులు నమోదయ్యాయి. కేసులు ఇలాగే నమోదవుతూ వెళ్తే.. మరికొద్ది రోజుల్లో ఆసుపత్రులు మొత్తం నిండిపోతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరప్‌లో కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిందని.. అమెరికాలో మాత్రం పరిస్థితి ఇంకా గతంలో మాదిరిగానే ఉందంటూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌‌ఫెక్షస్ డిసీజెస్ డైరెక్టర్ ఆంటనీ ఫాసీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు 30,97,538 కేసులు నమోదు కాగా.. కరోనా బారిన పడి 1,33,91 మంది మృత్యువాతపడ్డారు. 

Updated Date - 2020-07-08T22:10:10+05:30 IST