భారతీయ దంపతుల అనుమానాస్పద మృతి.. దర్యాప్తు ముమ్మరం!

ABN , First Publish Date - 2021-04-10T14:25:37+05:30 IST

అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ దంపతులు బాలాజీ భరత్‌ రుద్రవర్‌(32), ఆర్తి బాలాజీ(30) బుధవారం వారి నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. న్యూజెర్సీలోని నార్త్‌ ఆర్లింగ్టన్‌లో గల రివర్వ్యూ గార్డెన్స్ కాంప్లెక్స్‌లో నివాసముండే ఈ దంపతులిద్దరూ బుధవారం ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవులుగా కనిపించారు.

భారతీయ దంపతుల అనుమానాస్పద మృతి.. దర్యాప్తు ముమ్మరం!

న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ దంపతులు బాలాజీ భరత్‌ రుద్రవర్‌(32), ఆర్తి బాలాజీ(30) బుధవారం వారి నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. న్యూజెర్సీలోని నార్త్‌ ఆర్లింగ్టన్‌లో గల రివర్వ్యూ గార్డెన్స్ కాంప్లెక్స్‌లో నివాసముండే ఈ దంపతులిద్దరూ బుధవారం ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవులుగా కనిపించారు. వారి నాలుగేళ్ల చిన్నారి ఇంటి బాల్కనీలో నిలబడి ఏడుస్తుండడంతో.. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి, లోనికి వెళ్లి చూడగా.. దంపతులిద్దరూ రక్తపు మడుగులో చనిపోయి కనిపించారు. వారు కత్తిపోట్లకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. దంపతుల ఒంటిపై బలమైన కత్తిపోట్లు ఉండడంతో ఈ ఘటనపై యూఎస్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


బెర్గెన్ కౌంటీ ప్రాసిక్యూటర్ మార్క్ ముసెల్లా మాట్లాడుతూ.. నార్త్ ఆర్లింగ్టన్ పోలీసులు, బెర్గెన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం మేజర్ క్రైమ్స్ యూనిట్ సంయుక్తంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం సాయంత్రం 5.40 గంటల(అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో నార్త్ ఆర్లింగ్టన్ పోలీసులకు బాలాజీ పొరుగింటి వారి నుంచి 911కు ఫోన్ వచ్చిందని, దాంతో వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలికి వెళ్లినట్లు ముసెల్లా తెలిపారు. ఇంటి తలుపు మూసి ఉండడంతో బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా.. దంపతులు చనిపోయి ఉన్నారని చెప్పారు. దంపతులిద్దరి శరీరాలపై బలమైన కత్తిపోట్లు ఉండడంతో పలు అనుమానాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై బెర్గెన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం మేజర్ క్రైమ్స్ యూనిట్ చీఫ్ రాబర్ట్ అంజిలోట్టి, నార్త్ ఆర్లింగ్టన్ పోలీసు విభాగం చీఫ్ స్కాట్ హెడెన్‌బర్గ్ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ముసెల్లా వెల్లడించారు.  


కాగా, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ అధికారులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులతో తాము మాట్లాడామని, వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మహారాష్ట్ర బీడ్‌ జిల్లాలోని అంబాజోగాయ్‌కి చెందిన బాలాజీ భరత్‌ రుద్రవర్‌(32) ఐటీ నిపుణుడు. 2015లో తన భార్య ఆర్తి బాలాజీ(30)తో కలిసి అమెరికా వచ్చారు. ఆర్తి ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. దేశం కాని దేశంలో దంపతుల మృతితో వారి 4 ఏళ్ల చిన్నారి అనాథగా మారిపోయింది. ప్రస్తుతం చిన్నారి మృతుల స్నేహితుల సంరక్షణలో ఉన్నట్లు తెలిసింది. బాలాజీ, ఆర్తిల మృతితో వారి స్వస్థలం అంబాజోగాయ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.   

Updated Date - 2021-04-10T14:25:37+05:30 IST