భారత్‌కు అగ్ర‌రాజ్యం మరోసారి భారీ సాయం!

ABN , First Publish Date - 2021-06-29T20:57:06+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనాతో స‌త‌మ‌త‌మ‌వుతున్న భార‌త్‌కు అగ్ర‌రాజ్యం మ‌రోసారి భారీ సాయం ప్ర‌క‌టించింది. భవిష్యత్​లో ఎమ‌ర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత్‌కు 41 మిలియన్‌ డాలర్లు(రూ.304.50కోట్లు) సాయం చేయనున్నట్లు యూఎస్‌ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్​ఏఐడీ) సోమ‌వారం వెల్ల‌డించింది.

భారత్‌కు అగ్ర‌రాజ్యం మరోసారి భారీ సాయం!

వాషింగ్ట‌న్‌: మ‌హ‌మ్మారి క‌రోనాతో స‌త‌మ‌త‌మ‌వుతున్న భార‌త్‌కు అగ్ర‌రాజ్యం మ‌రోసారి భారీ సాయం ప్ర‌క‌టించింది. భవిష్యత్​లో ఎమ‌ర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత్‌కు 41 మిలియన్‌ డాలర్లు(రూ.304.50కోట్లు) సాయం చేయనున్నట్లు యూఎస్‌ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్​ఏఐడీ) సోమ‌వారం వెల్ల‌డించింది. ఈ 41 మిలియన్లతో కలిపి భారత్‌కు అందే మొత్తం సాయం 200 మిలియన్‌ డాలర్లు దాటుతుందని ఈ సంద‌ర్భంగా యూఎస్​ఏఐడీ పేర్కొంది. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో యూఎస్‌ ఆపదలో ఉన్నప్పుడు ఇండియా ఆదుకుంద‌ని, అందుకే ఇప్పుడు మ‌హ‌మ్మారితో పోరాడుతున్న భార‌త ప్ర‌జ‌ల‌కు అగ్రరాజ్యం అండగా నిలుస్తుందని తెలిపింది. భారత్‌లో క‌రోనా టెస్టులు, వైర‌స్‌ సంబంధిత మానసిక సమస్యలు, వైద్య సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల కోసం ఈ సాయం చేస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. 


ఇక క‌రోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న స‌మ‌యంలో మే నెల‌లో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ భార‌త్‌కు 100 మిలియ‌న్ డాల‌ర్ల సాయం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అలాగే అంత‌కుముందు 50 మిలియ‌న్ల డాల‌ర్ల విలువ చేసే అత్యవ‌స‌ర వైద్య ప‌రిక‌రాల‌ను భార‌త్‌కు పంపింది అగ్ర‌రాజ్యం. అంతేగాక భార‌త్‌కు 25 మిలియ‌న్ డోసుల క‌రోనా వ్యాక్సిన్లు పంపుతామ‌ని బైడెన్ ప్ర‌క‌టించారు. అటు యూఎస్‌-ఇండియా ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఫౌండేష‌న్ కూడా ఏకంగా 1.2 మిలియ‌న్ డాల‌ర్ల విరాళాలు సేక‌రించి, క‌రోనాతో పోరాడుతున్న భార‌త్‌కు చేదోడుగా నిలిచింది. అలాగే సుమారు 120 వెంటిలేట‌ర్లు, 1000 ఆక్సిజ‌న్ కాన్స‌ట్రేట‌ర్లను ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేసింది. 

Updated Date - 2021-06-29T20:57:06+05:30 IST