'హెచ్1బీ వన్ వర్క్‌ఫోర్స్'కు.. రూ.1100 కోట్లు కేటాయించిన యూఎస్!

ABN , First Publish Date - 2020-09-27T16:56:38+05:30 IST

కరోనా దెబ్బతో అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ సైతం అతలాకుతలమైన విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ట్రంప్ సర్కార్ చర్యలు చేపడుతోంది.

'హెచ్1బీ వన్ వర్క్‌ఫోర్స్'కు.. రూ.1100 కోట్లు కేటాయించిన యూఎస్!

వాషింగ్టన్ డీసీ: కరోనా దెబ్బతో అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ సైతం అతలాకుతలమైన విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ట్రంప్ సర్కార్ చర్యలు చేపడుతోంది. అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలలో మధ్య స్థాయి నుంచి ఉన్నత స్థాయి నైపుణ్యం అవసరమయ్యే హెచ్1బీ ఉద్యోగాలలో శిక్షణ కోసం అగ్రరాజ్యం గురువారం 150 మిలియన్ డాలర్లు (రూ .1,100 కోట్లకు పైగా) ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ తదితర రంగాలలో ప్రస్తుత, భవిష్యత్ మానవ వనరుల నైపుణ్యాల పెంపుదలకై ఇచ్చే శిక్షణ కోసం ఈ 'హెచ్1బీ వన్ వర్క్‌ఫోర్స్' నిధులను వినియోగిస్తామని అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. 


కాగా, మహమ్మారి కొవిడ్ ప్రభావానికి కేవలం కార్మిక శాఖ మాత్రమే ప్రభావితం కాలేదని అనేక విద్య, శిక్షణ సంస్థలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ, విద్య రంగాలకు చెందిన యజమానులు శిక్షణ విషయమై పునరాలోచించవలసి వచ్చిందని యూఎస్ తెలిపింది. అందుకే ఆయా రంగాలలో అర్హులైన అభ్యర్థులకు వారి ప్రాంతాలలోనే ఆన్‌లైన్, దూర విద్య తదితర సాంకేతిక విధానాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో హెచ్1బీ ఉద్యోగాలకు అవసరమయ్యే నైపుణ్యాల కోసం శిక్షణ ఇప్పిస్తామని అమెరికా కార్మిక శాఖ వెల్లడించింది. దీని కోసమే 'హెచ్1బీ వన్ వర్క్‌ఫోర్స్'కు 150 మిలియన్ డాలర్లు కేటాయించినట్లు పేర్కొంది. 

Updated Date - 2020-09-27T16:56:38+05:30 IST