Abn logo
Oct 30 2020 @ 12:02PM

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా ఊర్మిళ గజపతి..

Kaakateeya

విజయనగరం: కోటబురుజుపై కూర్చుని సిరిమానోత్సవాన్ని చూస్తున్నప్పుడు ఆమెవ్వరో పెద్దగా ప్రపంచానికి తెలియదు. తన తండ్రికే పుట్టిన తన సోదరి వీళ్లని కోట నుంచి దించేయండంటూ పోలీసులకు ఆజ్ఞాపించినప్పుడు మొదటిసారి ఆమె వార్తల్లోకొచ్చారు. మా ఊరి ఆడపడుచుకు పుట్టిన వారసురాల్ని కళ్లారా చూడాలని అనుకుంటే ఆమెనే అవమానిస్తారా..? అంటూ ఊరు ఊరంతా ఒక్కటై తిరగబడి తిట్టిపోసింది. చూశారా... అప్పుడే ఆమె ఆమె వార్తల్లో నిలిచింది. ఆమె ఎవరో కాదు. ఊర్మిళ గజపతి.. విజయనగరం రాజవంశీయుడు ఆనందగజపతి గారాల పుత్రిక. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఓ టాపిక్..


విజయనగరం వారసుల వివాదమే ఇప్పుడు తెలుగునాట పెద్ద చర్చనీయాంశం. ఈ వివాదంలో పినతండ్రిని ఎదిరించిన సంచయితపై ఇప్పటివరకు అందరికీ ఫోకస్ ఉండేది. ఇప్పుడు అదే సంచయిత వల్ల ప్రపంచానికి పరిచయమైన ఊర్మిళ అందరి దృష్టిలో పడి ఓ రేంజ్ ఇమేజ్‌తో హాట్ టాపిక్‌గా నిలిచింది. విజయనగరం రాజవంశానికి చెందిన ఆనంద్ గజపతిరాజు గారాల పుత్రికే ఈ ఊర్మిళ.. పూర్తిపేరు పూసపాటి ఊర్మిళ గజపతి.. ఉమాగజపతి రాజుతో విడాకుల తర్వాత క్షత్రియ కులానికే చెందిన సుధను ఆనంద్ గజపతిరాజు పెళ్లిచేసుకున్నారు. ఆమె ద్వారా కలిగిన సంతానమే ఊర్మిళ గజపతి. ఆనంద్ గజపతిరాజు మొదటి భార్య ఉమా ద్వారా సంచయిత పుట్టినప్పటికీ.. ఆమె పుట్టిన ఏడాదికే వారి మధ్య  వివాహబంధానికి తెరపడటంతో ఆనంద్ గజపతికి పుత్రికోత్సాహమంతా ఈ ఊర్మిళ వల్లేనని చెప్పాలి. 


1999 నవంబర్ 30వ తేదీన పుట్టిన ఊర్మిళ.. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది. ఓ తండ్రిగా ఆనంద గజపతిరాజే ఊర్మిళకి రోల్ మోడల్. ప్రాథమిక విద్యాభ్యాసమంతా సొంతగడ్డపైనే.. ఓగ్రిడ్జ్ విశాఖ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. అమెరికాలో బ్యాచ్ లర్ ఆఫ్ మేనేజ్ మెంట్ కోర్స్ పూర్తి చేసింది. పీజీ కూడా అక్కడే చేయాలని నిర్ణయించుకుని అందుకు తగినట్టుగా కెరియర్ ప్లాన్ చేసుకుంది. రాజకీయాలంటే ఆసక్తి ఉంది. కాకపోతే... విద్యాభ్యాసం మొత్తం పూర్తయిన తరువాత రాజకీయాలలోకి వస్తామని ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చెప్పింది. 


ఊర్మిళ వల్లే ఆనంద గజపతి రాజుకు పుత్రికోత్సాహం!
తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఊర్మిళకి తన తాత పీవీజీ రాజు అంటే ఎంతో గౌరవం. ఆ వంశంలో పుట్టినందుకు గర్వపడుతుంటానని చెప్పింది. తన చిన్నాన్న అశోక్ గజపతిరాజుపైన, సోదరి అదితీ గజపతిపైన తనకు అపారమైన గౌరవభావం ఉందని ఊర్మిళ  చెప్పుకొచ్చింది. తండ్రి, తాతగార్ల వారసత్వాన్ని నిలబెట్టాల్సిన అవసరం మా కుటుంబసభ్యులందరిపైనా ఉందని ఊర్మిళ అన్నారు. తమ రాజకుటుంబ వారసత్వాన్ని సగర్వంగా నిలబెట్టేందుకు తాను నడుంబిగిస్తానని ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పింది.


వివాదాలకు, రాజకీయ విమర్శలకు దూరంగా ఉండే ఊర్మిళ ప్రస్తుత వివాదంపై చాలా మనస్థాపం చెందినట్టు కనిపించింది. మాన్సాస్ ఛైర్ పర్శన్‌గా తమ బాబాయ్‌ని తొలగించి, సంచయిత అనే మరొకరిని ఆ స్ధానంలో నియమించినపుడే ఆమెని చూశానని.. అంతకు ముందెప్పుడు ఆ పేరు కూడా తాను వినలేదని ఊర్మిళ కుండబద్దలుకొట్టినట్టు చెప్పింది. 


నిజానికి ఆనంద గజపతి రాజు, ఆశోక్ గజపతి రాజు మధ్య ఎటువంటి పొరపచ్ఛాలు ఉన్నా ఎప్పుడూ వారిద్దరూ ఒకర్ని ఒకరు అవమానించుకోలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ పరస్పరం దూషించుకోలేదు. ఎంతో హుందాగా ఉండేవారు. అమ్మవారి పండుగ సమయంలో కోట మీద రెండు కుటుంబాలు ఎంతో హుందాగా కూర్చొని ఉత్సవాన్ని తిలకించేవి. ఇప్పుడు సంచయిత కారణంగా హుందాగా వుండే విజయనగర రాజవంశం పరువు వీధిన పడిందని విజయనగర వాసులు అంటున్నారు. 


గత ఇరవై ఏళ్లుగా ప్రతి సంవత్సరం విజయనగరం కోట నుంచి సిరిమానోత్సవం కలిసి చూడటం ఊర్మిళకు ఓ సంప్రదాయం. నిజానికి ఈసారి ఈ గొడవల వల్ల తన తల్లితో కలిసి ఉత్సవానికి హాజరవడానికి కాస్త సంశయించానని, కానీ.. సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయడం ఇష్టంలేక వస్తే.. అక్కడ అలా జరిగిందని ఊర్మిళ బాధ వ్యక్తం చేసింది.  

ఇవి కూడా చదవండిImage Caption

‘సంచయిత చేష్టలు ఆనందగజపతికి అవమానకరం’పీవీజీ రాజు విగ్రహం వద్ద బీశెట్టి మౌనదీక్షహాట్‌టాపిక్‌గా పూసపాటి వంశీయుల పంచాయితీపీవీజీ విగ్రహం దగ్గర మౌనం పాటించిన ఊర్మిళ గజపతి

Advertisement
Advertisement