‘ఉపాధి’ భేష్‌..

ABN , First Publish Date - 2022-08-03T05:30:00+05:30 IST

‘ఉపాధి’ భేష్‌..

‘ఉపాధి’ భేష్‌..
కేసముద్రం మండలం కోమటిపల్లిలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌)

ఎన్‌ఆర్‌ఈజీఎ్‌సలో రాష్ట్రస్థాయిలో మానుకోటకు రెండోస్థానం

జిల్లా వ్యాప్తంగా 2,32,000 జాబ్‌కార్డులు  

కూలీలకు పనులు కల్పించడంలో కలెక్టర్‌ చొరవ


మహబూబాబాద్‌ రూరల్‌, ఆగస్టు 3 : ‘ఉపాధి హామీ’ పనుల్లో రాష్ట్రస్థాయిలోనే జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. అధికారులు కూలీలకు పని కల్పించడంతో ఈ ర్యాంక్‌ దక్కింది. తెలంగాణలో జయశంకర్‌ భూపాలపల్లి మొదటి ప్రథమ స్థానంలో నిలువగా, మహబూబాబాద్‌ జిల్లాకు రెండోస్థానం దక్కినట్లు డీఆర్‌డీఏ పీడీ వెల్లడించారు.


 జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు సరిపడా పనులు లేకపోవడంతో హైదరాబాద్‌, వరంగల్‌ తదితర నగరాలకు వలస పోయి అక్కడ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ వలసలను నివారించేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఏడాదిలో కనీసం వందరోజులు పనికి హామీ ఇస్తూ 2006 ఫిబ్రవరి 2న అప్పటి యూపీఏ ప్రభుత్వం, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని (ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స) ప్రవేశపెట్టింది. అప్పట్నుంచి ఉన్న ఊరులో పనులు లభిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు తగ్గుముఖం పట్టాయి. క్రమక్రమంగా పనులు కల్పిస్తుండడంతో ఉపాధిహామీ పథకంలో కూలీలు ఎక్కువగా పాల్గొంటూ పనులు చేస్తూ వచ్చారు. దీంతో మహబూబాబాద్‌ జిల్లాకు రెండో స్థానం దక్కింది. 


కలెక్టర్‌ శశాంక ప్రత్యేక చొరవతో..

రాష్ట్రప్రభుత్వం 1 ఏప్రిల్‌ 2022 నుంచి 30 మార్చి 2023 ఆర్థిక సంవత్సరానికి మహబూబాబాద్‌ జిల్లాకు 55,39,309 పనిదినాలు లక్ష్యంగా కేటాయించింది. అందులో జూలై 31 తేదీ వరకు వరకు 44,80,779 పని దినాలను పూర్తి చేసి చేసింది. ప్రభుత్వం విధించిన టార్గెట్‌ను 80.89 శాతంకు చేరుకుని తెలంగాణలోనే మానుకోట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 


గతంలో మహబూబాబాద్‌ జిల్లా చిట్టచివరి స్థానంలో ఉండగా కలెక్టర్‌ శశాంక, అదనపు కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌లు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రతిరోజు జిల్లా అధికారులతో సమీక్షలు చేస్తూ మండలానికో అధికారిని నియమించి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి, ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి సన్యాసయ్య శ్రద్ధ వహించారు. ప్రతిరోజు మండలాల వారీగా నివేదికలు తెప్పించుకుని, తక్కువ పని కల్పించిన మండలాలపై దృష్టిసారించి కూలీల హాజరుశాతం పెంచే విధంగా చర్యలు తీసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్‌ ఆస్టిస్టెంట్‌లు (టీఏ) కలిసి గ్రామాల్లో రోజూ 100 నుంచి 150 మందికి కూలీలు తగ్గకుండ చర్యలు చేపట్టారు. 


మండలాల వారీగా ఇలా...

మహబూబాబాద్‌ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 461 గ్రామపంచాయతీలో మొత్తం 2,32,000 జాబ్‌కార్డులు ఉన్నాయి. జిల్లాలో గరిష్టంగా 95 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. కూలీలకు రోజువారీగా అత్యధికంగా రూ.257, అత్యల్పంగా రూ.144లు చెల్లించారు. మహబూబాబాద్‌ మండలానికి 397197 పనిదినాలు టార్గెట్‌ విధించగా 274437 పనులు పూర్తి చేసి 60.09 శాతంతో జిల్లాలో 11వ స్థానంలో నిలిచింది. కాగా, గార్ల మండలానికి 263984 పనిదినాలకు గాను 303315 పనిదినాలను పూర్తి చేసి 114.90 శాతంతో జిల్లాలో మొదటిస్థానంలో నిలిచింది. 


బయ్యారం మండలానికి 408217 పనిదినాలకు గాను 202181 పనిదినాలు పూర్తిచేసి 49.53 శాతంతో జిల్లాలో చివరిస్థానంలో నిలిచింది. కాగా, పనిదినాలు చేధించని మండలాకు జిల్లా అధికారులు ప్రతిరోజు ప్రత్యేకంగా పనిజరిగే ప్రాంతానికి వెళ్లి స్వయంగా పరిశీలించినప్పటికి ఎన్‌ఆర్‌ఈజీఎ్‌సలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది మండల అధికారుల్లో చలనం మాత్రం రావడం లేదని ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి పని కల్పించాలని కోరుతున్నారు. అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. 


మూడు నెలలుగా అందని వేతనాలు..

ఉపాధి కూలీలకు అధికారులు పని కల్పించి, వారికి చేసిన పనికి వేతనాలు సరైన సమయంలో అందించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మండుటెండల్లో కూలీలు పనిచేస్తే ఇప్పటి వరకు గత మే, జూన్‌, జూలై నెలలకు సంబంధించిన బకాయి మొత్తం రూ.29,76,998లు ఉంది. పనికి వచ్చే కూలీలకు తక్కువగా వస్తుంటే అధికారులు మాత్రం మూడు నుంచి ఆరు నెలలకొకసారి డబ్బులు చెలిస్తున్నారని కూలీలు వాపోతున్నారు. సిబ్బంది రోజూ కూలీల హాజరుశాతం ఆన్‌లైన్‌లో నమోదు చేసినప్పటికి కేంద్రప్రభుత్వం వద్దనే కూలీలు డబ్బులు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వారం.. వారం డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు. 


అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే : సన్యాసయ్య డీఆర్‌డీవో పీడీ, మహబూబాబాద్‌  

అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో జాతీయ ఉపాధిహామీ పథకంలో  జిల్లాను రాష్ట్రంలో రెండోస్థానంలో నిలుపుకోగలిగాం. ఇంకా కొన్ని మండలాల్లో ఉపాధి కూలీలు పనులకు తక్కువగా హాజరవుతున్నారు. వారికి సైతం అవగాహన కల్పించి, ఉపాధి కూలీకి వందశాతం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ ఒక్క కూలీకి వందరోజుల పనిదినాలు తప్పకుండా కల్పిస్తాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే కూలీలకు డబ్బులు చెల్లిస్తాం. 

Updated Date - 2022-08-03T05:30:00+05:30 IST