యూపీలో కరోనా మాత ఆలయం.. భక్తిశ్రద్ధలతో పూజిస్తున్న గ్రామస్థులు

ABN , First Publish Date - 2021-06-13T00:40:38+05:30 IST

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ తమను ఈ మహమ్మారి బారినుంచి బయటపడేయాలంటూ కరోనాకు ఏకంగా

యూపీలో కరోనా మాత ఆలయం.. భక్తిశ్రద్ధలతో పూజిస్తున్న గ్రామస్థులు

లక్నో: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ తమను ఈ మహమ్మారి బారినుంచి బయటపడేయాలంటూ కరోనాకు ఏకంగా గుడి కట్టేసి పూజిస్తున్నారు ఉత్తరప్రదేశ్‌లోని శుక్లాపూర్ గ్రామ ప్రజలు. ఈ విలయాన్ని ఎదుర్కొనే శక్తి తమకు ఇక లేదని, తమను రక్షించి చల్లగా చూడాలంటూ కరోనామాత పేరుతో ఓ ఆలయాన్ని నిర్మించేసి పూజలు చేస్తున్నారు. విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తండోపతండాలుగా తరలివచ్చి పెద్ద ఎత్తున ‘కరోనామాత’కు పూజలు చేసి యథాశక్తి సమర్పించుకుంటున్నారు. కరోనా మాతను దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు కూడా పంచిపెడుతున్నారు. శుక్లాపూర్ గ్రామస్థులు చందాలు వేసుకుని ఓ వేప చెట్టుకింద ఈ నెల 7 ఈ మందిరాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని కరోనా మాతకు పచ్చరంగు మాస్కు ధరించడం విశేషం.




ప్రస్తుత కరోనా కాలంతో తమను రక్షించేది కరోనామాత తప్ప మరెవరూ కాదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి వేలాదిమందిని పొట్టనపెట్టుకుందని, ఇక శాంతించాలని కోరుతూ ఈ ఆలయాన్ని నిర్మించామని పేర్కొన్నారు. తమ ప్రార్థనను అమ్మవారు ఆలకిస్తుందని, తమను మహమ్మారి బారి నుంచి తప్పక రక్షిస్తుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, కరోనా మాత ఆలయాలు ఇప్పటికే తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని మధువనహళ్లి గ్రామంలో నిర్మించి కరోనా మాతకు పూజలు చేస్తున్నారు.

 

మరోవైపు, ఈ మందిర నిర్మాణంపై ఆరోపణలు వచ్చాయి. అక్కడి భూమిని ఆక్రమించుకునేందుకే ఈ ఆలయాన్ని నిర్మించారన్న ఆరోపణలు వచ్చాయి. వివాదాస్పద భూమిలో ఈ మందిరాన్ని నిర్మించారంటూ శుక్రవారం రాత్రి పోలీసులు కరోనామాత ఆలయాన్ని కూల్చివేశారు. ఆలయం నిర్మించిన భూమికి నోయిడాలో ఉండే లోకేశ్ సహా నాగేశ్ కుమార్ శ్రీవాస్తవ, జై ప్రకాశ్ శ్రీవాస్తవ హక్కుదారులు. వీరి మధ్య వివాదం నడుస్తోంది.


భూమి హక్కుదారుల్లో ఒకరైన లోకేశ్ కుమారే గ్రామంలో చందాలు వేసుకుని ఆలయాన్ని నిర్మించారని గ్రామస్థులు చెబుతున్నారు. సహ హక్కుదారుడైన నాగేశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ భూమిని ఆయన కబ్జా చేసుకునేందుకే నిర్మాణం చేపట్టాడని ఆరోపించారు. ఆలయాన్ని కూల్చివేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-06-13T00:40:38+05:30 IST