పొరుగింటి వాళ్లతో గొడవలు.. యూట్యూబ్‌లో చూసి బాంబు తయారుచేసి ప్రతీకారం

ABN , First Publish Date - 2022-06-04T03:03:23+05:30 IST

పక్కింటి వాళ్లతో తరచూ గొడవలు జరుగుతుండడంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో చూసి బాంబు

పొరుగింటి వాళ్లతో గొడవలు.. యూట్యూబ్‌లో చూసి బాంబు తయారుచేసి ప్రతీకారం

మీరట్: పక్కింటి వాళ్లతో తరచూ గొడవలు జరుగుతుండడంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో చూసి బాంబు తయారుచేయడం నేర్చుకున్నాడు. ఆపై అది పనిచేస్తుందో, లేదో పరీక్షించి కూడా చూశాడు. ఓకే అనుకున్న తర్వాత దానిని పక్కింటి వారిపై ప్రయోగించాడు. ఉత్తరప్రదేశ్‌లో భాగ్‌పట్‌లో జరిగిన ఈ ఘటన పోలీసులనే విస్తుపోయేలా చేసింది.


పక్కింటి వాళ్లతో తరచూ గొడవలు జరుగుతుండడంతో విసిగిపోయిన 45 ఏళ్ల రణవీర్ సింగ్ ప్రతీకారం కోసం పరిపరి విధాల ఆలోచించాడు. చివరికి యూట్యూబ్‌లో చూసి బాంబు తయారు చేయడం నేర్చుకున్నాడు. బాంబు తయారీ పూర్తయిన తర్వాత దానిని పొలాల్లోకి తీసుకెళ్లి పలుమార్లు పరీక్షించి చూశాడు. పని చేస్తుందని నిర్ధారించుకున్న తర్వాత తాను ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న పొరుగింటి వ్యక్తి ఇంటి ప్రధాన ద్వారానికి బాంబును అమర్చాడు. 


విషయం తెలియని ఆ ఇంటి యజమాని 17 ఏళ్ల కుమారుడు గౌతంసింగ్ డోర్ తెవరడంతో బాంబు పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆ కుర్రాడి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, ఈ ఘాతుకానికి పాల్పడింది రణవీర్ సింగేనంటూ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 


యూట్యూబ్‌లో చూసి రణవీర్ సింగ్ బాంబులు తయారుచేయడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని భాగ్‌పట్ ఎస్పీ నీరజ్ జాదౌన్ పేర్కొన్నారు. తమ ఎదుట బాంబును తయారుచేయమని కోరగానే వెంటనే తయారుచేసి చూపించాడన్నారు. దానికి మరికొన్ని అదనపు ఏర్పాట్లు చేసి బాంబును మరింత శక్తిమంతంగా తయారుచేశాడని తెలిపారు. సమాజానికి హాని చేసే ఇలాంటి వీడియోలను తొలగించాలంటూ యూట్యూబ్‌కు లేఖ రాసినట్టు ఎస్పీ తెలిపారు. 

Updated Date - 2022-06-04T03:03:23+05:30 IST