భూములకు విశిష్ట సంఖ్య

ABN , First Publish Date - 2021-12-22T08:34:57+05:30 IST

భూములకు విశిష్ట సంఖ్య

భూములకు విశిష్ట సంఖ్య

కొత్తగా ల్యాండ్‌ పార్సిల్‌ నంబర్లు

ఆర్‌ఓఆర్‌ చట్టం రూల్స్‌కు సవరణ

వ్యవసాయేతర భూములకు యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు

రెవెన్యూ శాఖ ఉత్తర్వులు


అమరావతి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కుల చట్టం (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌-ఆర్‌ఓఆర్‌)-1971 రూల్స్‌ (1989)లో కీలక సవరణలు చేస్తూ, కొత్తగా దాని పరిధిలోకి వ్యవసాయేతర భూములను తీసుకొస్తూ రెవెన్యూశాఖ రెండు తుది గజిట్‌ నోటిఫికేషన్లు జారీచేసింది. ఈ రెండు అంశాలపై రెవెన్యూశాఖ గతనెల 29నే ప్రాథమిక నోటిఫికేషన్లు విడుదల చేసి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు కోరింది. గడువు తీరడంతో తాజాగా ఆ ఉత్తర్వుల అమలుకు ఫైనల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్‌ఓఆర్‌ చట్టం రూల్స్‌లో సవరణలపై తుది నోటిఫికేషన్‌ కు జీవో 367, ఆర్‌ఓఆర్‌ పరిధిలోకి వ్యవసాయేతర భూములను తీసుకొస్తూ వాటికి ప్రత్యేకంగా రిజిస్టర్‌ ను నిర్వహించడంతోపాటు యాజమాన్య ధృవీకరణ పత్రాల జారీకి నిబంధనలు పొందుపర్చుతూ జీవో 365ను జారీచేసింది. 


అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా నంబరు..

ఆర్‌ఓఆర్‌ చట్టంలో చేసిన సవరణల ప్రకారం ఇక గ్రామం వారీగా సాగు భూములకు, సాగేతర భూములకు కొత్తగా ల్యాండ్‌ పార్సిల్‌ నంబర్‌ (ఎల్‌పీనెం)ను కేటాయించనున్నారు. అలాగే, ప్రతీ ల్యాండ్‌ పార్సిల్‌కు 12 లేదా 14 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. భూమి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ఈ నంబరు ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు 1-బీ రిజిస్టర్‌లో నాలుగో కాలమ్‌లో ల్యాండ్‌ పార్సిల్‌ నంబర్‌ నమోదు చేస్తారు. ఆరో కాలమ్‌లో భూమికి కేటాయించిన విశిష్ట సంఖ్యను న మోదు చేస్తారు. వీటితో కలిపి మొత్తం 14 అంశాలు 1-బీ ఫామ్‌లో ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో భూముల సర్వే సాగుతోంది కాబట్టి రికార్డుల అప్‌డేషన్‌ ప్రక్రియలో వీటిని చేపట్టనున్నారు. 


సాగేతర భూములకు ప్రత్యేక రిజిస్టర్లు

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ భూమి హక్కుల చట్టం (ఆర్‌ఓఆర్‌)-1971లో సాగు భూములతోపాటు, వ్యవసాయేతర భూముల వివరాలనూ పొందుపరచనున్నారు. సాగు భూములకు 1ఏ, 1బీ రిజిస్టర్లను నిర్వహిస్తున్నట్లుగా, సాగేతర భూముల (నాన్‌అగ్రికల్చర్‌)కు ఎన్‌ఏ-1ఏ, ఎన్‌ఏ-1బీ రిజిస్టర్లను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. గ్రామం వారీగా వ్యవసాయేతర అవసరాలకు మళ్లించిన భూములను ధ్రువీకరణ చేసి వాటిని ఎన్‌ఏ రికార్డుల్లో పొందుపరుస్తారు. ఎన్‌ఏ-1ఏ, ఎన్‌ఏ-1బీ రిజిస్టర్లలో నమోదైన భూముల వివరాల ఆధారంగా మండల తహసీల్దార్‌ యాజమాన్య హక్కు ధృవీకరణ పత్రాలు జారీచేస్తారు. ఈ సర్టిఫికెట్ల ఆధారంగా ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ యాక్ట్‌-1882 కింద ఆస్తులను తాకట్టు పెట్టుకోవచ్చని రూల్స్‌లో పొందుపరిచారు. వ్యవసాయేతర  భూములకు యాజమాన్య ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ లేదా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. శాశ్వత యాజమాన్య దృవీకరణ పత్రాన్ని ఒకేసారి జారీ చేస్తారు. అది పోతే డూప్లికేట్‌ పొందవచ్చు.

Updated Date - 2021-12-22T08:34:57+05:30 IST