FCRA రూల్స్‌లో కీలక మార్పులు.. రూ.10లక్షలకు పెరిగిన ఆ పరిమితి..

ABN , First Publish Date - 2022-07-03T16:07:44+05:30 IST

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ(Home Ministry) విదేశీ విరాళాల నియంత్రణ(Regulation) చట్టం (FCRA)కి సంబంధించిన కొన్ని నిబంధనలను సవరించింది.

FCRA రూల్స్‌లో కీలక మార్పులు.. రూ.10లక్షలకు పెరిగిన ఆ పరిమితి..

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ(Home Ministry) విదేశీ విరాళాల నియంత్రణ(Regulation) చట్టం (FCRA)కి సంబంధించిన కొన్ని నిబంధనలను సవరించింది. తాజా సవరణల ప్రకారం అధికారులకు తెలియజేయకుండా విదేశాలలో ఉంటున్న బంధువుల నుంచి భారతీయులు సంవత్సరానికి రూ.10 లక్షల వరకు స్వీకరించవచ్చు. అలాగే హోంమంత్రిత్వ శాఖ మరో వెసులుబాటు కూడా కల్పించింది. ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇంతకుముందు ఉన్న 30 రోజుల గడువును 90 రోజులకు పెంచింది. ఈ కొత్త నిబంధనలను ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) సవరణ నిబంధనలు-2022 కింద తీసుకువచ్చినట్లు హోంమంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి ఓ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది. 


విదేశీ సహకారం (నియంత్రణ) నియమాలు 2011లోని నిబంధన 6లో 'ఒక లక్ష రూపాయలు' పదాల స్థానంలో 'పది లక్షల రూపాయలు' అని, 'ముప్పై రోజులు' అనే పదాల స్థానంలో 'మూడు నెలలు' అనే పదాలు చేర్చబడతాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా, రూల్ 6 అనేది బంధువుల నుండి విదేశీ నిధులను స్వీకరించడానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. దీనికి ప్రకారం "ఏ వ్యక్తి అయినా తన బంధువుల నుండి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ లేదా దానికి సమానమైన విదేశీ విరాళాన్ని స్వీకరించినట్లయితే, అటువంటి సహకారం అందిన 30 రోజులలోపు కేంద్ర ప్రభుత్వానికి (నిధుల వివరాలు) తెలియజేయాలి" అని ఇందులో ఉంటుంది. 


అదేవిధంగా నిధులను స్వీకరించడానికి ఎఫ్‌సీఆర్ఏ (FCRA) కింద 'రిజిస్ట్రేషన్' లేదా 'ముందస్తు అనుమతి'  పొందే దరఖాస్తుతో వ్యవహరించే నియమం 9లో మార్పులు చేయడం, సవరించిన నియమాలు వ్యక్తులు, సంస్థలు లేదా NGOలకు బ్యాంక్ ఖాతా గురించి హోంమంత్రిత్వ శాఖకు తెలియజేయడానికి 45 రోజుల సమయం ఇచ్చింది. ఒక ఎన్‌జీఓ (NGO) లేదా విదేశీ నిధులను స్వీకరించే వ్యక్తి తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రతి త్రైమాసికంలో అలాంటి విరాళాలను ప్రకటించాలనే నిబంధనను కూడా తాజాగా తొలగించింది. ఒకవేళ బ్యాంకు ఖాతా, పేరు, చిరునామా మార్చినా.. అలాగే సంస్థలలోని ముఖ్య సభ్యులు విదేశీ నిధులను స్వీకరిస్తే దానిని తెలియజేయడానికి హోం మంత్రిత్వ శాఖ మునుపటి 15 రోజులకు బదులుగా ఇప్పుడు 45 రోజుల సమయాన్ని ఇచ్చింది.


 ఇక హోంమంత్రిత్వ శాఖ నవంబర్ 2020లో ఎఫ్‌సీఆర్ఏ (FCRA) నిబంధనలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీతో నేరుగా సంబంధంలేని NGOలు బంద్‌లు, సమ్మెలు, రోడ్‌ దిగ్బంధనాలు వంటి రాజకీయ చర్యల్లో పాల్గొంటే వాటిని కూడా రాజకీయ స్వభావంగా పరిగణించబడుతుందని స్పష్టం చేసింది. ఈ కేటగిరీ కింద వచ్చే సంస్థలలో రైతు సంస్థలు, విద్యార్థులు, కార్మికుల సంస్థలు, కుల ఆధారిత సంస్థలు ఉన్నాయి. సవరించిన ఎఫ్‌సీఆర్ఏ (FCRA)లో ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులు విదేశీ నిధులను స్వీకరించకుండా నిరోధించింది. అలాగే NGOల ప్రతి ఆఫీస్ బేరర్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేసింది. విదేశీ నిధులను స్వీకరించే సంస్థలు అలాంటి నిధుల్లో 20 శాతానికి మించి పరిపాలనా ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని కొత్త చట్టం చెబుతోంది. ఈ పరిమితి 2020కి ముందు 50 శాతంగా ఉంది. ఇక చట్టం ప్రకారం నిధులను స్వీకరించే అన్ని NGO లు ఎఫ్‌సీఆర్ఏ (FCRA) కింద నమోదు చేసుకోవాలి.


Updated Date - 2022-07-03T16:07:44+05:30 IST