ఇదేం తీరు జగన్‌!?

ABN , First Publish Date - 2020-06-25T07:31:13+05:30 IST

స్థానిక ఎన్నికల వాయిదాపై నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ప్రభుత్వ సలహా తీసుకోలేదు. ఇది అందరికీ తెలుసు. దానికి సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడటమేమిటి? కరోనా ..

ఇదేం తీరు జగన్‌!?

ప్రత్యర్థుల అణచివేతకేనా అధికారం?

పనికిరాని ఆవ భూముల్లో ఇళ్ల స్థలాలా?

ఎకరాకు రూ.43 లక్షలు చెల్లించడమా?

అవినీతిరహిత పాలన అంటే ఇదేనా?

వ్యవస్థలతో ఏమిటీ శత్రుత్వం?

న్యాయమూర్తులను కూడా నరికేస్తారా?

ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోవాలి!

వీవీ గిరి నుంచి పాఠాలు నేర్చుకోవాలి!

కోర్టులు, ఎన్నికల కమిషన్‌తో గొడవలా?

ఆన్‌లైన్‌లో రాని ఇసుక.. మేస్త్రీ కి చెబితే వస్తుంది

ధరలు పెంచితే తాగడం మానేయరు

సీఎంపై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ధ్వజం


జడ్జీలను ముక్కలుగా నరికేస్తారా!

స్థానిక ఎన్నికల వాయిదాపై నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ప్రభుత్వ సలహా తీసుకోలేదు. ఇది అందరికీ తెలుసు. దానికి సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడటమేమిటి? కరోనా విషయంలో ఇవాళ నిమ్మగడ్డ చెప్పిందే నిజం అయింది. స్కూళ్లు లేవు. సినిమాలూ లేవు. ఇవాళ నిమ్మగడ్డ చేసింది చిన్నదైపోయింది. ఎన్నికల సంఘం కమిషనర్‌ను మార్చడం, కోర్టులను ధిక్కరించడం వంటివి పెద్ద తప్పులైపోయాయి. జడ్జీలను ముక్కలుగా నరికేస్తామనడం, కరోనా పేషెంట్ల మధ్యలో పడేయాలని పోస్టింగ్‌లు పెట్టడమేమిటి?పోస్టింగ్‌లు పెడితే జడ్జీలు ఊరుకుంటారా, వాళ్లూ మనుషులే! వారికీ ఇగోలు, హక్కులు ఉంటాయి.  వీలైనంతవరకూ  జడ్జీలు కరెక్ట్‌గానే తీర్పు చెబుతారు..


రూ. 84వేల కోట్లు ఎలా తెస్తారు?

జగనన్న, వైఎస్‌ అంటూ పథకాలు పెట్టేస్తే సరిపోదు. నవ రత్నాల పథకాలకు రూ.80,656కోట్లు అవసరం. సచివాలయ ఉద్యోగులకు రూ.180 కోట్లు అవసరం. వలంటీర్ల జీతాలతో కలుపుకొని మొత్తం 84వేల కోట్లకు పైగా ఖర్చు! ఇది ఎలా ఫుల్‌ఫిల్‌ చేస్తారు. కేంద్రం మనకంటే దరిద్రం. వచ్చేది ఏమీ లేదు. రాష్ట్రంలో ఆదాయం లేదు. రెవెన్యూ లాస్‌ 22వేల కోట్లు చూపిస్తున్నారు. రెవెన్యూ డెఫిసిట్‌లో రాష్ట్రం నడవదు. అప్పుకూడా ఎవరూ ఇవ్వరు. బడ్జెట్‌లో డబ్బు వచ్చే మార్గం చెప్పలేదు. ఇస్తే జేజేలు పలుకుతారు. జనంతో అబద్ధాలు చెప్పొద్దు. 


రాజమహేంద్రవరం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ‘ఓ సీఎం జగన్మోహన్‌ రెడ్డీ... మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రత్యర్థులను నిర్మూలించడానికి, అణచివేయడానికి, వారిని లేకుండా  చేయడానికి కాదు.  ప్రజల తరఫున ఉండడానికి అధికారం ఇచ్చారు. చరిత్రలో ఎవరికీ ఇవ్వనంత ఓట్లతో అధికారం ఇచ్చారు. మరి మీరేం చేస్తున్నారు? చిల్లర విషయాలపై దృష్టి పెట్టకండి. వ్యవస్థలపై, ప్రత్యర్థులపై శత్రుత్వం మంచిది కాదు. వ్యవస్థను మెరుగుపరే విధంగా వ్యవహరించాలి’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు.


మద్యంలో ‘కమీషన్ల’ నుంచి ఆవ భూముల అక్రమాల దాకా అనేక అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి సూటి ప్రశ్నలు సంధించారు. ‘జగన్మోహన్‌రెడ్డి అవినీతి రహిత పాలన ఇస్తామన్నారు. ఇదేనా?’ అని నిలదీశారు. ‘అధికారం శాశ్వతం అనుకోవద్దు. బాబు అలా అనుకున్నారు. మీరూ అనుకుంటే పేలిపోతుంది’ అని హెచ్చరించారు. వైఎస్‌ ఫొటో పక్కన పెట్టుకోవడంతోపాటు... అవినీతిని అరికట్టడమంటే ఏమిటో, ఏం చేయాలో కూడా తెలుసుకోవాలన్నారు. ఇంకా ఉండవల్లి ఏమన్నారో... ఆయన మాటల్లోనే...


ఆవ భూములకు అంత ధరా?: పనికి రాని ఆవ భూములను ఇళ్ల పట్టాలుగా ఇస్తారా? పైగా ఎకరానికి రూ.43 లక్షలు చెల్లిస్తారా? దీనిపై విచారణ చేయాలని సీఎంకు లేఖ రాశాను. ఆర్థిక మంత్రి  కేవలం 3శాతం ఎక్కువ ధర మాత్రమే ఇచ్చినట్టు చెప్పారు.  కలెక్టర్‌ను ఆర్టీఏ ద్వారా వివరాలు కోరితే సబ్‌ కలెక్టర్‌ను అడగమన్నారు. అడిగాను. త్వరలో వివరాలు వస్తాయి. ఇదే రేటుకు ఎక్కడ భూములు ఇచ్చినా తీసుకుంటామని సబ్‌ కలెక్టర్‌ చెబుతారు. దీనివల్ల ఇంకెక్కడా రూ.70లక్షలకు కూడా ఎకరం భూమి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ...ఇందులో అవినీతి జరగకపోతే  ప్రభుత్వ అసమర్థత బయటపడినట్లే. జరిగిందంటే కమీషన్లు తీసుకున్నట్టే.  ఒకే సర్వే నంబర్‌లో ఒక ఎకరం భూమి విలువ  రూ.24 లక్షలుగా అధికారులు ఒక ఆర్డర్‌ ఇచ్చారు. అదే భూమికి మరో ఆర్డర్‌లో మట్టి ఫిల్లింగ్‌కు కలిపి రూ.64లక్షలుగా ఆర్డర్‌ ఇచ్చారు. ఇది ఎలా జరిగింది?   


సారా, పొరుగు మద్యం...

లిక్కర్‌కు సంబంధించి భయానక నిజాలు బయటపడుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో చీప్‌ లిక్కర్‌ కొని కేసుకు ఇంతని పర్సంటేజీ తీసుకుంటున్నారు. గతంలో లిక్కర్‌ ప్రభుత్వానిదైనా ప్రైవేట్‌ వాళ్లు అమ్మేవారు. ఇవాళ ప్రభుత్వమే అమ్ముతోంది. కొనుగోలు తగ్గిపోయిందని, జనం తాగడం మానేస్తున్నారని జగన్‌ చెప్పడంలో నిజం లేదు. గతంలో ఉన్న మెక్‌డోవల్‌ వంటి కంపెనీలు ఇవాళ లేవు. వాళ్లను ఎందుకు అనుమతించడం లేదు? మద్య నిషేధం అంటే ధరలు పెంచడం కాదని... దానివల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రజలకు తెలపాలని ఆ కమిటీ చైర్మన్‌ లక్ష్మారెడ్డికి మొదట్లోనే చెప్పాను.


సీఎం మాస్క్‌ పెట్టుకోరా?

అందరూ మాస్కులు వేసుకోవాలని నిబంధన పెట్టారు. కానీ...జగన్‌ మాస్కు పెట్టుకోకపోతే ఎలా? సీఎం ఎందుకు మాస్కు పెట్టుకోరో ప్రెస్‌మీట్లలో అడగండి. నేను ఇక్కడకు వస్తుంటే చూశాను. వంద మందిలో 10మందే మాస్కులు ధరించారు. హైదరాబాద్‌లో జర్నలిస్ట్‌ మనోజ్‌ మరణించడం బాధాకరం. 


 ఆ క్లిప్పింగ్‌ ఎలా లీకయింది?

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ బాధితుల పరామర్శకు వెళ్తున్నప్పుడు విజయసాయిరెడ్డిని సీఎం కారు నుంచి దింపేశారు. సీఎం ఆంతరంగిక కెమెరా నుంచి ఎవరు లీక్‌ చేస్తారు? నిమ్మగడ్డ, బీజేపీ నేతలంతా ఒకటే. వారిని వైసీపీ వాళ్లు కలిస్తే న్యూస్‌. ప్రభుత్వాన్ని ఎవరైనా నడపొచ్చు. ఎందుకంటే... ప్రభుత్వానికి ఒక యంత్రాంగం ఉంటుంది. కానీ, పార్టీని నడపడం కష్టం.  పార్టీలో అందరూ ఉండిపోరు. నిన్న పొగిడిన వారు... ఇవాళ తిడతారు. 


మేస్త్రీకి చెబితే ఇసుక...


ఇసుక విధానం గాడిన పడలేదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెడితే ఎంతకాలంలో వస్తుందో తెలియదు. కానీ... తాపీ మేస్త్రీకి చెబితే బయట నుంచే ఎలా తేవాలో సులభంగా చెప్పేస్తాడు. గతంలో  వరద అన్నారు. ఇటీవల కరోనా అన్నారు.  ఇక్కడ గోదావరంతా ఇసుకే. అయినా రాజమహేంద్రవరంలోనే ఇసుక కొరత ఉంటే, ఇతర ప్రాంతాల్లో ఎలా ఉంటుంది? 


మండేలాను ఆదర్శంగా తీసుకున్నారా?

‘నెల్సన్‌ మండేలా కమిటిమెంట్‌ ఉన్నవాడు. ఆయనను గుర్తు చేసుకోవాలని సీఎం జగన్‌ చెప్పారు’ అని బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో  ఆర్థిక మంత్రి  తెలిపారు. కానీ, మండేలాను  జగన్‌ ఆదర్శంగా తీసుకున్నట్టు లేదు. మండే లా జైలులో ఉన్నప్పుడు రోజూ కొట్టేవారు. ఆయనపైన పోలీసు అధికారులు మూత్రం పోసేవారు. ఆ తర్వాత మండేలా అధ్యక్షుడైనప్పుడు... ఓ సమావేశానికి తనపై మూత్రం పోసిన పోలీసు అధికారే వచ్చారు. భయంతో వణికిపోతుంటే... సిబ్బందిని ఇచ్చి బయటికి పంపించారు. ‘‘నేను అధికారంలోకి వచ్చింది నన్ను ఇబ్బంది పెట్టినవారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు.


ఇవాళ తెల్ల, నల్ల అంతా సమానం’’ అని చెప్పారు. జగన్‌కు ఒకటే చెబుతున్నాను! అధికారం ఉన్నది ప్రత్యర్థులను అణచివేయడానికి కాదు. ముఖ్యమంత్రితో నాకు సంబంధం లేదు. ఉన్నది ఉన్నట్టే నాకు చెప్పడం అలవాటు. గతంలోనూ ఇంతే. ఇవాళా అంతే. చంద్రబాబు పాలనలోని లోపాలను కూడా ఇలానే చెప్పాను. ఇవాళ ఇంకా ఎక్కువగా చెబుతాను.


తగవులు ఎందుకు?

‘అందరూ  ఎల్వీ సుబ్రహ్మణ్యంలా ఉండరు. నిమ్మగడ్డ, ఏబీ వెంకటేశ్వరరావులాంటి వారూ ఉంటారు. వ్యవస్థలపై శత్రుత్వం మంచిది కాదు’  అని జగన్‌కు ఉండవల్లి హితవు పలికారు.  కోర్టులు, ఎన్నికల కమిషన్‌తో గొడవేమిటని ప్రశ్నించారు. ప్రాక్టికల్‌గా ఎవరితో ఎవరు ఎలా బిహేవ్‌ చేయాలనేందుకు ఇవి నిదర్శనాలంటూ కొన్ని పాత విషయాలు చెప్పారు. అవేమిటంటే...


వీవీ గిరి ప్రెసిడెంట్‌గా నెగ్గినప్పుడు, మరో వ్యక్తి అది చెల్లదని కోర్టుకెళ్లారు. రాష్ట్రపతిని కోర్టుకు రప్పించడం బాగోదని, ఆయన దగ్గరికే ఒక కమిషన్‌ను పంపాలని న్యాయస్థానం నిర్ణయించింది. ఇది తెలిసి ఓరోజు వీవీ గిరి సొంత కారులో కోర్టుకు వచ్చారు. ఆయన నమస్కారం పెట్టారు. కానీ, జడ్జీలు ఎవరూ లేవలేదు. ఆయన నమస్కారం పెట్టింది జడ్జికి కాదు. అక్కడి న్యాయ పీఠానికి!


పీవీ నరసింహారావుకు ఒక కేసులో బెయిల్‌ కోసం అనేక వాదనలు చేస్తుండగా... బెయిల్‌ అడగకుండా వాదన చేయడం జడ్జికి నచ్చక రిమాండ్‌కు పంపిచేస్తామన్నారు. కానీ, పీవీ ఒక లాయర్‌ను పంపించారు. ‘‘పీవీ ప్రధానిగా చేశారు. ఆయన ఆరోగ్యం బాగా లేదు. జైలుకు  పంపకండి. పిలిచినప్పుడు వస్తారు’’ అని ఆ లాయరు చెప్పగానే జడ్జి బెయిల్‌ ఇచ్చారు. 


వంగవీటి రంగా ఒక కేసులో కోర్టుకెళ్లి చేతులు కట్టుకుని నిలబడ్డారు. అంత వినయం ఎందుకని నేను అడిగాను. ‘ఎవడీ రంగా అని జడ్జి అనుకుంటే...సాయంకాలం వరకు అలాగే నిలబెట్టేస్తారు’ అని రంగా బదులిచ్చారు.

Updated Date - 2020-06-25T07:31:13+05:30 IST