ఉష్‌..దావోస్‌!

ABN , First Publish Date - 2022-07-08T07:54:36+05:30 IST

ఉష్‌..దావోస్‌!

ఉష్‌..దావోస్‌!

జగన్‌ విదేశీ పర్యటనపై ఏమడిగినా... తెలియదు.. సమాచారం మావద్ద లేదు

సతీసమేతంగా దావో్‌సకు అధికారిక పర్యటన.. అయినా వివరాలు గోప్యంగా ఉంచిన వైనం

షెడ్యూల్‌, ఖర్చులపై గోప్యత.. పైగా, ఆయన ఎక్కడెక్కడ తిరిగారో మాకేం తెలుసంటూ వ్యాఖ్య

దావోస్‌  టూర్‌పై తొలినుంచీ అనుమానాలు.. ఆర్టీఐ పిటిషన్‌కు స్పందించిన తీరుతో మరిన్ని సందేహాలు


(ఆంధ్రజ్యోతి-అమరావతి) 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఇటీవల దావో్‌సకు ఏ విమానంలో వెళ్లారు? ఏమో.. మాకు తెలియదు ఆ విమాన ఖర్చులను ఎవరు భరించారు? 

ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనకు సంబంధించిన ఖర్చుల చెల్లింపు కోసం ఇప్పటివరకు ఎలాంటి బిల్లులు, ఇన్వాయీ్‌సలు అందలేదు. కాబట్టి మా దగ్గర సమాధానం లేదు. 

సీఎం దావోస్‌ పర్యటనలో భాగంగా లండన్‌ వెళ్లారు. అక్కడ ఏఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు? 

మాకేం తెలుసు? ఆ వివరాలేమీ మాకు తెలియవు.

మే 26న ప్రపంచ ఆర్థిక సదస్సు ముగిస్తే,  జగన్‌ 31వ తేదీన రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఈ మధ్యకాలంలో, అంటే నాలుగు రోజులపాటు సీఎం అక్కడ ఏం చేశారు? ఎక్కడెక్కడ ఏఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు?

ఏమో.. ఆయన ఎక్కడెక్కడ తిరిగారో మాకేం తెలుసు? ఆ వివరాలు మా కార్యాలయంలో అందుబాటులో లేవు.  

.....ఇదీ ప్రభుత్వ ఉన్నతాధికారుల వరుస. ముఖ్యమంత్రి జరిపిన ఒక అధికారిక పర్యటనపై నోరు విప్పేందుకు ఎందుకనో సమాచార శాఖ ఇష్టపడటం లేదు. పర్యటనకు అయిన ఖర్చులపై లెక్కలు ఇచ్చేందుకు ససేమిరా అంది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఏ వివరమూ బయటపెట్టడానికి అధికారులు నిరాకరించారు. నిజానికి, ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు గత మే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావో్‌సకు సతీసమేతంగా జగన్‌ చేసిన అధికారిక పర్యటనపై ఇప్పటికీ అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆగుతూ..ఆగుతూ..ముఖ్యమంత్రి పర్యటన సాగడంతోపాటు దావోస్‌ వేదికపై సీఎంను కలిసి కొత్త కంపెనీలేవీ ఒప్పందాలు చేసుకోకపోవడం.. రాష్ట్రంలో కలిసి మాట్లాడిన పారిశ్రామికవేత్తలు, కంపెనీలే ప్రపంచ ఆర్థిక వేదికపైనా సీఎంతో ఎంవోయూలు కుదుర్చుకోవడం అప్పట్లో సందేహాలను, విమర్శలను రేకెత్తించాయి. ఆర్టీఐ పిటిషన్‌పై అధికారుల స్పందన ఈ సందేహాలను మరింత బలపరిచేలా ఉండటం గమనార్హం. సాధారణంగా ముఖ్యమంత్రి అధికారిక విదేశీ పర్యటనలకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారుల వద్ద ఉంటుంది. అలాంటి పర్యటనలకోసం సీఎం బయలుదేరడానికి రెండు రోజుల ముందే అక్కడకు చేరుకుని ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తారు. తర్వాత ముఖ్యమంత్రితోపాటు అధికారిక పర్యటనలో సంబంధిత ప్రభుత్వ ఉన్నతాధికారులూ పాల్గొంటారు. కాబట్టి సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులకు ముందే తెలుస్తాయి. కానీ సీఎం జగన్‌ దావోస్‌ పర్యటన వివరాలు ప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా తెలియనివ్వకుండా అత్యంత గుట్టుగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? అధికారులు రూపొందించిన ముందస్తు పర్యటన షెడ్యూలు ప్రకారం.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి నేరుగా వెళ్లి దావో్‌సలో ల్యాండ్‌ కావాల్సిన ప్రత్యేక విమానం.. అధికారులకు కూడా తెలియకుండా లండన్‌ ఎయిర్‌పోర్టులో దిగడం.. అక్కడి నుంచి తిరిగి దావో్‌సకు చేరుకోవడంపై ఇప్పటికీ అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. పైగా సీఎం అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రత్యేక విమానంలో అధికారులను తీసుకువెళ్లకుండా సతీమణితో కలిసి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు సూటిగా సరైన సమాధానాలివ్వలేక..’మాకు తెలీదు.. సమాచారం లేదు’ అంటూ తప్పించుకునే ధోరణిని అవలంభించారు. 


పాత ఒప్పందాలకే కొత్త కలరింగ్‌  

జగన్‌ దావోస్‌ వెళ్లి కొత్తగా రాష్ట్రానికి సాధించుకొచ్చిన పెట్టుబడులు ఏమీ లేవు. అదానీ, అరబిందో, ఏస్‌, గ్రీన్‌కో సంస్థలతో గతంలో చేసుకున్న ఒప్పందాలనే దావో్‌సలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో అదే సంస్థలతో మళ్లీ కుదుర్చుకుని..కొత్త కలరింగ్‌ ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం దావో్‌సకు వెళ్లిన సీఎం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏఏ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు? దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఒప్పందాల ప్రతులను ఇవ్వాలని సమాచార హక్కుచట్టం కింద అధికారులను కోరినప్పుడు.. అధికారులు ఇచ్చిన సమాధానాలను చూస్తే.. జగన్‌ కొత్తగా సాధించిందేమీ లేదని స్పష్టమవుతోంది. దావో్‌సలో నాలుగు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయం టూ ఆ ఒప్పందాల ప్రతులను అధికారులు అందజేశారు. వాటిని పరిశీలించగా.. అవన్నీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రీన్‌ఎనర్జీ రంగంలో విద్యుత్‌ ఉత్పత్తి కోసం చేసుకున్న పాత ఒప్పందాలే. 


అధికారులు అందించిన పత్రాలను అనుసరించి.. 

గ్రీన్‌కో పవర్‌ : గ్రీన్‌కో గ్రూపు ఆధ్వర్యంలో 1000 మెగావాట్ల పంపు నిల్వ, 5 వేల మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు, మరో 2 వేల మెగా వాట్ల గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పవన విద్యుత్తు ప్రాజెక్టుల స్థాపనకు గ్రీన్‌కో సంస్థ రూ. 37 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 వేల ఉద్యోగాలు లభిస్తాయి. 

అయితే...వాస్తవానికి గ్రీన్‌కో సంస్థ గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకుని కర్నూలు జిల్లాలో పనులు మొదలుపెట్టింది. 

అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌: రాష్ట్రంలో 3,700 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టు, 10 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల స్థాపనకు ఈ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ. 60 వేల కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ ప్రాజెక్టుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల ఉద్యోగాలు లభిస్తాయి.

అయితే...గ్రీన్‌ ఎనర్జీపై ఈ కంపెనీతో గతంలోనే ఒప్పందం ఖరారయింది. పైగా అదానీ కంపెనీ ఇప్పటికే మన రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

అరబిందో రియాలిటీ: అరబిందో రియాలిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 2 వేల మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టు, 4 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులను కాకినాడ సెజ్‌లో స్థాపించడానికి ఒప్పందం కుదిరింది. 28 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు వల్ల 8 వేల ఉద్యోగాలు లభిస్తాయి. 

అయితే.. గ్రీన్‌ ఎనర్జీపై ఈ కంపెనీతో గతంలోనే ఒప్పందం ఖరారయింది. అంతేకాదు, అరబిందో కంపెనీ ఇప్పటికే మన రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

ఏస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: మచిలీపట్నంలో డీకార్బనైజ్డ్‌ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటు చేసేందుకు ఏస్‌ సంస్థ ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.  ఈ జోన్‌పై 1000 కోట్లు పెట్టుబడి పెడతారు. 10 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 

అయితే.. ఏస్‌ అర్బన్‌ డెవలెపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కూడా మన రాష్ట్రానికి చెందిన సంస్థే. 


సమాచారం ఇవ్వడానికి నెల రోజులు 

సీఎం దావోస్‌ పర్యటనకు సంబంధించిన సమాచారం కోసం గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఆర్‌టీఐ కింద సచివాలయంలోని సాధారణ పరిపాలనశాఖలో జూన్‌ 1న దరఖాస్తు చేశారు.ఆ దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వ సహాయ కార్యదర్శి జూన్‌ 6న ఇండస్ట్రీస్‌ అండ్‌ కామర్స్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ సెక్రటరీకి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ అధికారులకు పంపించారు. ఆర్థికాభివృద్ధి సంస్థ అధికారులు సరిగ్గా నెల తర్వాత, ఈ నెల 6వ తేదీన సమాచారం అందజేశారు. చాలా ప్రశ్నలకు తెలీదు.. సమాచారం లేదు అని పేర్కొనడం గమనార్హం. 

Updated Date - 2022-07-08T07:54:36+05:30 IST