ఆ రాష్ట్రంలో లులు గ్రూపు అధినేత, NRI యూసఫ్ అలీ భారీ పెట్టుబడులు.. ఏకంగా 5వేల మందికి ఉపాధి..

ABN , First Publish Date - 2021-12-12T14:37:25+05:30 IST

యూఏఈకి చెందిన రిటైల్ దిగ్గజం లులు గ్రూపు గుజరాత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది.

ఆ రాష్ట్రంలో లులు గ్రూపు అధినేత, NRI యూసఫ్ అలీ భారీ పెట్టుబడులు.. ఏకంగా 5వేల మందికి ఉపాధి..

దుబాయ్: యూఏఈకి చెందిన రిటైల్ దిగ్గజం లులు గ్రూపు గుజరాత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఏకంగా రూ.2వేల కోట్లతో మాడ్రన్ షాపింగ్ మాల్ తెరిచేందుకు రెడీ అవుతుంది. దీని ద్వారా సుమారు 5వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ మేరకు శనివారం ఆ సంస్థ ప్రతినిధులు కీలక ప్రకటన చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దుబాయ్‌లో ఎన్నారై వ్యాపారవేత్త, లులు గ్రూప్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ యూసఫ్ అలీను కలిసిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 2022 జనవరిలో జరగనున్న 'వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌'పై ప్రచారంలో భాగంగా ప్రస్తుతం సీఎం నాయకత్వంలో గుజరాత్ ప్రతినిధుల బృందంలో యూఏఈలో పర్యటిస్తుంది. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్ర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌‌కు గట్టి పునాది వేయాలని గుజరాత్ భావిస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా లులు గ్రూపుతో ఈ భారీ ఒప్పందం కుదిరింది. 


ఈ ప్రాజెక్ట్‌ మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్(ఎఓయూ)పై గుజరాత్ ప్రభుత్వం తరపున అడిషనల్ చీఫ్ సెక్రటరీ డా. రాజీవ్ కుమార్ గుప్తా, యూసుఫ్ అలీ సంతకం చేశారు. ఎంఓయూ ప్రకారం లులు గ్రూప్ అహ్మదాబాద్, గాంధీనగర్ మధ్య ప్రపంచ స్థాయి షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా 5వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2022 మొదటి త్రైమాసికంలో నిర్మాణాన్ని ప్రారంభించి 30 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఒక షాపింగ్ మాల్‌తో పాటు లులు గ్రూప్ వరుసగా బరోడా, సూరత్‌లలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనుంది.


“గుజరాత్‌లో పెట్టుబడులు పెడతానని అలీ చేసిన వాగ్దానాన్ని స్వాగతిస్తున్నాను. భూమి, ఏదైనా ఇతర సహాయం అందించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. తద్వారా వారు పని ప్రారంభించవచ్చు." అని సీఎం పటేల్ అన్నారు. ‘‘నా హృదయంలో గుజరాత్‌కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. మా నాన్నకు అహ్మదాబాద్‌లో కుటుంబ వ్యాపారం ఉన్నందున నేను బిజినెస్ బెసిక్స్ ఇక్కడే నేర్చుకున్నాను. కాబట్టి గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ శక్తివంతమైన రాష్ట్రంలో మనం మరింత విస్తరించగలమని ఆశిస్తున్నాను” అని యూసుఫ్ అలీ అన్నారు.


ఇదిలాఉంటే.. ప్రస్తుతం లులు గ్రూప్ మిడిల్ ఈస్ట్ దేశాలతో పాటు ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, భారత్‌లో 220కు పైగా హైపర్‌మార్కెట్స్, షాపింగ్ మాల్స్ నడుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా లులు గ్రూప్ సంస్థకు 57వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇక గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) దేశాల్లోని రిటైల్ మార్కెట్‌లో 32శాతం షేర్ కలిగి ఉంది. ఇప్పటికే భారత్‌లోని కేరళ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో లులు మెగా మాల్స్‌ను లాంచ్ చేసింది. యూపీ రాజధాని లక్నోలో ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానుంది. తాజాగా గుజరాత్‌లో మరో మాడ్రన్ షాపింగ్ మాల్‌ను నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకుంది.  

Updated Date - 2021-12-12T14:37:25+05:30 IST