Abn logo
May 4 2021 @ 03:59AM

విలక్షణ విశాఖ నేత

సాధారణంగా ఎవరైనా, ప్రత్యేకించి రాజకీయాలలో ఉన్న నేతలు తమ బలహీనతలు ఎదుటివారికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తమ బలం, బలగం బయటకు ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. కానీ తన బలగాన్ని, బలాన్ని ఎదుటివారికి తెలియకుండా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, అనూహ్యమైన రాజకీయ విజయాలు సాధించిన విలక్షణ నేత, విశాఖ మాజీమేయర్‌, పార్లమెంటు పూర్వసభ్యులు సబ్బం హరి. 


విద్యార్థి దశనుండీ, తానెక్కడున్నా, ఒక ప్రత్యేకమైన జీవనశైలితో తన స్నేహితులను, శ్రేయోభిలాషులను ఆకర్షించే కేంద్రబిందువుగానే పెరిగారు. ఒకనాటి విశాఖజిల్లా శివారు గ్రామమైన చిట్టివలసలో జన్మించారు. విద్యార్థి దశ నుండి విశాఖపట్నంలోనే పెరిగారు. మిసెస్‌. ఎ.వి.ఎన్‌. కళాశాల విద్యార్థిగా వుండగా 1973లో జరిగిన ‘జై ఆంధ్ర’ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 


సమగ్ర ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ బాగా బలంగా ఉన్న రోజులు. 1985 మార్చిలో శాసనసభ మధ్యంతర ఎన్నికలు. అప్పటికి సబ్బం హరి విశాఖనగరం కంచరపాలెంలో వ్యాపారం చేస్తుండేవారు. అక్కడ ఏ సామాజిక వర్గం బలంగా ఉండేదో ఆ సామాజిక వర్గానికి చెందిన (యాదవ) రాజాన రమణికి తెలుగుదేశం పార్టీ, ఆనాటి విశాఖ-–2వ నియోజకవర్గానికి అభ్యర్థినిగా పోటీకి నిలిపింది. అసలే తెలుగుదేశం ప్రభంజనం.. తానున్న చోటున అదే సామాజిక వర్గం భారీగా ఉంది.. కాంగ్రెస్‌ పార్టీకి బ్యానర్లు కట్టే దిక్కులేని పరిస్థితి. ఆ ఎన్నికలలో ఆ నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన టి. సూర్యనారాయణ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ పోటీకి నిలిపింది. వారం రోజుల పాటు విస్తృతంగా కంచరపాలెంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచార సరలిని చూసి తీవ్రంగా స్పందించిన సబ్బం హరి, తన వ్యాపార సంస్థ ముందే ఇందిరాగాంధీ భారీ కటౌట్‌ను పెట్టి, కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార శిబిరం ప్రారంభించారు. దాంతో కలకలం... సంచలనం. ఏమిటితని ధైర్యం? అని నగర, జిల్లా కాంగ్రెస్‌ అగ్రనేతలందరూ అవాక్కయ్యారు. అంతే... అప్పటికి ఉత్తరాంద్రలో కాంగ్రెస్‌ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ద్రోణంరాజు సత్యనారాయణ దృష్టిని ఆకర్షించారు. ఆ ఎన్నికలు ముగిసిన వెంటనే, విశాఖ నగర కాంగ్రెస్‌ కమిటీలో కార్యదర్శిగా, ఆ తర్వాత విశాఖ నగర యువజన కాంగ్రెస్‌ అద్యక్షునిగా నియమితులైనారు. అక్కడి నుంచి సబ్బం హరి రాజకీయ ప్రస్థానం ఇంటా, బయటా బలమైన శక్తులతో పోరాడుతూనే మొదలైంది. 


తనను రాజకీయాలలో ప్రోత్సమించిన ద్రోణంరాజు సత్యన్నారాయణతోను, ఆ తర్వాత 1989 వరకు తనకు ఆప్తులుగా ఉన్న టి. సూర్రెడ్డి, గుడివాడ గురునాథరావు వర్గాలతోనూ విభేదాలేర్పడ్డాయి. దాంతో తానే తన శక్తి యుక్తులతో ఒక వర్గాన్నేర్పరచుకున్నారు. మాజీ మంత్రి సుంకరి ఆళ్వార్‌దాస్‌తో ఏర్పడిన సాన్నిహిత్యంతో, ఆయనకు ఎన్నో ఏళ్ళుగా అండగా నిలిచిన మత్స్యకార వర్గాలతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ, ఆనాటికే విశాఖ పట్టణ, నగర కాంగ్రెస్‌ అధ్యక్షునిగా పనిచేసిన సీనియర్‌ కాంగ్రెస్‌వాది అల్లిపిల్లి అప్పారావును అంతరంగికునిగా చేసుకొని కాంగ్రెస్‌ రాజకీయాలలో బలమైన శక్తిగా ఏర్పడ్డారు. అలాగే మరో మాజీమంత్రి భాట్టం శ్రీరామమూర్తి, వారాడ నారాయణమూర్తి వంటి సీనియర్‌ నేతల సలహాలు తీసుకుంటుండేవారు. 


1992 ఏప్రిల్‌ నెలలో సబ్బం హరి తన సామాజిక వర్గమైన వెలమ సామాజిక వర్గానికి అన్ని రంగాలలోనూ, ముఖ్యంగా రాజకీయాలలో జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ ‘వెలమనాడు’ పేరిట చేసిన ఉద్యమం ఆయనకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చింది. ఆ ఉద్యమ ఫలితంగా ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం డాక్టర్‌ పెద్దింటి జగన్మోహనరావుకు (వెలమ) మంత్రి పదవినివ్వడంతో, ఆయన పేరుప్రతిష్టలు మరింత పెరిగాయి. 1985 నుంచీ 1990 వరకు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డితోను మంచి సన్నిహిత సబంధాలున్నా, స్థానిక వర్గ రాజకీయాల వలన సరైన అవకాశాలు రాలేదు. 


1994 శాసనసభ ఎన్నికలలో విజయనగరం జిల్లా ‘ఉత్తరాపల్లి’ నియోజకవర్గం నుంచి పోటీకి ప్రయత్నించినా, చివరి నిమిషంలో చేజారిపోయింది. 1995 మార్చిలో జరిగిన విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయరుగా సంచలన విజయాన్ని సాధించారు. కాంగ్రెస్‌లో ప్రత్యర్థి వర్గంలోను, అటు రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీతోనూ ఏకకాలంలో పోరాడుతూ, నగరాభివృద్ధికి ఏ ఆటంకం లేకుండా పాటుపడ్డారు. 


ఈనాటి విశాఖనగరంలోని ప్రతిష్టాత్మకమైన శివాజీ పార్కు, స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం, ఆర్‌.కె.బీచ్‌ రోడ్డులో జాతీయ నేతల కాంస్య విగ్రహాల ఏర్పాటు, సకాలంలో రామమూర్తి పంతులు పేట ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి, కొండ ప్రాంతాల ప్రజల మంచినీటి కొరత తీర్చడం, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, రాత్రిపూట పారిశుద్ధ్య పనులు వంటి అనేక శాశ్వత కార్యక్రమాలు చేపట్టారు. 1999 శాసనసభ ఎన్నికల్లో ‘ఉత్తరాపల్లి’కి టిక్కెట్‌ ఖరారు అయినా, పట్టుబట్టి ‘గెలిచినా, ఓడినా నేను నగరాన్ని వీడేది లేదు’ అని పోరాడి విశాఖ–1 అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో టి.సుబ్బరామిరెడ్డి విజయానికి శక్తివంచన లేకుండా కృషిచేయడంతో, ఇద్దరికీ మంచి అనుబంధం ఏర్పడింది. 2004 శాసనసభ ఎన్నికల్లో విశాఖ–2 నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి కారణంగా ఆనాటి విశాఖ లోక్‌సభ అభ్యర్థి నేదురుమల్లి జనార్దనరెడ్డితో విభేదాలేర్పడ్డాయి. 2009లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి అరుదైన విజయం సాధించారు. 


ఆ తర్వాత జరిగిన పరిణామాలలో సమైక్యాంద్ర ఉద్యమనేతగాను, కాంగ్రెస్‌ను వీడి, పార్టీ పెట్టుకున్న వై.యస్‌.జగన్‌కు అండగా నిలిచిన నేతగా అన్నేళ్ళుగా తాను ఆరాధించిన కాంగ్రెస్‌ పార్టీకి దూరమయ్యారు. చివరికి 2014 జమిలి ఎన్నికలకు ముందు వై.యస్‌. జగన్‌తో వచ్చిన విభేదాలతో ఆ పార్టీకి దూరమయ్యారు. 2019 జమిలి ఎన్నికలలో తాను పుట్టి పెరిగిన ‘భీమిలి’ నియోజకవర్గం నుంచి ‘దేశం’ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించగల అరుదైన ఆత్మవిశ్వాసం సబ్బం హరిది. ఏ పదవిలో ఉన్నా, లేకున్నా వేలాది మంది తమ వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో సబ్బం హరి చేసిన సహకారం మరువలేనిది. ఆ సహకారం పొందిన వారికీ, ఆయనకూ మాత్రమే దాని గురించి తెలుసు. రాజకీయాలపట్ల, సామాజిక పరిణామాల పట్ల ఆయన అవగాహన అపారం. ముక్కుసూటితనం, తిరుగులేని ఆత్మవిశ్వాసం, చొరవ. ‘మనకు మనమే శక్తి. ప్రతివారు తమ శక్తియుక్తులపైనే ఆధారపడి నాయకత్వాలు వహించాలి తప్ప, ఎక్కడో హైదరాబాద్‌లోనో, అమరావతిలోనో, ఢిల్లీలోనో మాకొక నాయకుడి అండదండలున్నాయనుకున్న నేతలు ఎవరూ శాశ్వతంగా రాజకీయాలు చేయలేరు’ అని తరచూ అంటుండేవారు. తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేయడం ద్వారా ఆయన సాధించిన విజయాలు అసంఖ్యాకం. 


ప్రత్యర్థులు, గిట్టనివారు సబ్బంహరి గురించి ఏమి మాట్లాడినా, ఏం చెప్పినా ఆయనొక సంచలనం. వేలదిమంది అభిమానులు, ఆత్మీయులు ఉన్నా మరణంలోనూ... శత్రువులు కూడా అయ్యయ్యో అని ఆవేదన చెందుతూ నివాళులర్పించడమే... సబ్బంహరి. 

బి.వి. అప్పారావు

Advertisement
Advertisement
Advertisement