యాదాద్రీశుడికి రెండు కిలోల బంగారం

ABN , First Publish Date - 2021-11-27T09:01:25+05:30 IST

యాదాద్రి లక్ష్మీనృసింహుడి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే జనార్దన్‌ రెడ్డి రెండు కిలోల ముడి బంగారాన్ని విరాళంగా అందజేశారు.

యాదాద్రీశుడికి రెండు కిలోల బంగారం

  • నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే జనార్దన్‌ రెడ్డి అందజేత
  • 22 ఏళ్ల క్రితం నాటి మొక్కు తీరింది: ఎమ్మెల్యే
  • కాటేజీ నిర్మాణానికి తమ సంస్థ ‘జేసీ బ్రదర్స్‌’ తరఫున 
  • రూ.2 కోట్ల విరాళం ఇస్తామని ప్రకటన 

యాదాద్రి టౌన్‌/హైదరాబాద్‌ సిటీ, నవంబరు 26: యాదాద్రి లక్ష్మీనృసింహుడి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే జనార్దన్‌ రెడ్డి రెండు కిలోల ముడి బంగారాన్ని విరాళంగా అందజేశారు. కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. 20 ముడి బంగారు బిస్కెట్లను (ఒక్కొక్కటి 100 గ్రాములు) పసుపు, కుంకుమ, పూలతో అలంకరించిన పళ్లెంలో తీసుకొచ్చారు. బాలాలయ సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తుల పాదాల చెంత బంగారాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం బంగారు బిస్కెట్లను ఆలయ ఈవో గీతారెడ్డికి తన సతీమణి జమునా రాణితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ప్రధానాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ సంకల్పంతో నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందని ఆన్నారు. 22 ఏళ్ల కిత్రం తాను యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించానని, అప్పుడే స్వామికి తన వంతుగా మొక్కులు చెల్లించాలని సంకల్పం తీసుకున్నానని తెలిపారు. అలాగే కాటేజీ నిర్మాణానికి తమ సంస్థ జేసీ బ్రదర్స్‌ తరఫున రూ.2 కోట్ల విరాళాన్ని అందిస్తామని ఆయన ప్రకటించారు. కాగా హైదరాబాద్‌కు చెందిన భక్తుడు పి.మధుబాబు విమాన గోపురం బంగారు తాపడం కోసం రూ.1.72 లక్షల విరాళం చెక్కును ఈవో గీతారెడ్డికి దేవస్థాన ప్రధాన కార్యాలయంలో అందజేశారు.

Updated Date - 2021-11-27T09:01:25+05:30 IST