మూడు ముక్కలాటగా శ్రావణి జీవితం!

ABN , First Publish Date - 2020-09-17T08:35:20+05:30 IST

టీవీ సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఆర్‌ఎక్స్‌ 100’ నిర్మాత అశోక్‌ రెడ్డిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. గత సోమవారమే పోలీసుల ముందు

మూడు ముక్కలాటగా శ్రావణి జీవితం!

ఆమె ఆత్మహత్య కేసులో మూడో నిందితుడు అశోక్‌ రెడ్డి అరెస్టు..

ఏ1 దేవరాజు రెడ్డి.. ఏ2 సాయిరెడ్డి.. ఏ3 అశోక్‌ రెడ్డి



హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 16 (ఆంధజ్యోతి): టీవీ సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఆర్‌ఎక్స్‌ 100’ నిర్మాత అశోక్‌ రెడ్డిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. గత సోమవారమే పోలీసుల ముందు విచారణకు వస్తానని చెప్పిన అశోక్‌రెడ్డి ఆరోజు రాలేదు. పైగా సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి బుధవారం అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. శ్రావణి ఆత్మహత్యకు ముందు చివరికాల్‌లో మాట్లాడిన వ్యక్తి దేవరాజ్‌. ఆ కాల్‌లో పెళ్లి ప్రస్తావన తెచ్చిన శ్రావణి.. తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినా అతడు పట్టించుకోనందున దేవరాజ్‌ను ప్రధాన నిందితుడి (ఏ1)గా రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అదే విధంగా శ్రావణిని రకరకాలుగా హింసించాడనే కారణంతో సాయికృష్ణా రెడ్డిని రెండో నిందితుడిగా పేర్కొన్నారు.


సినిమాల్లో చాన్సు ఇప్పిస్తానని శ్రావణిని మభ్యపెట్టి,  మోసం చేసినందున సినీ నిర్మాత అశోక్‌ రెడ్డిని మూడో నిందితుడిగా చేర్చారు. కాగా.. సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ శ్రావణికి ఆశ చూపిన అశోక్‌రెడ్డి ఆమెతో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారని తెలిసింది. గత ఎనిమిది నెలలుగా ఆమె దేవరాజ్‌కు దగ్గర కావటాన్ని అశోక్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయాడని.. సాయికృష్ణ ద్వారా ఆమెపై ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు ప్రయత్నించాడని సమాచారం. ఈ నెల 7న అమీర్‌పేటలోని ఓ హోటల్‌ వద్ద శ్రావణి, దేవరాజ్‌ల మధ్య జరిగిన గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అశోక్‌రెడ్డితో పాటు మిగతా అందరూ కలసి శ్రావణిని శారీరకంగా హింసించినట్లు తెలిసింది. ఆత్మహత్యకు ముందురోజు జరిగిన పరిణామాల్లో అశోక్‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు.


ఇదీ క్రమం..

శ్రావణి 2012లో హైదరాబాద్‌కు వచ్చి టీవీ ఆర్టిస్ట్‌గా పని చేసింది. 2015లో ఆమెకు సాయికృష్ణారెడ్డితో, అతడి ద్వారా 2017లో నిర్మాత అశోక్‌రెడ్డితో పరిచయమైంది. 2019లో దేవరాజు టిక్‌టాక్‌ ద్వారా పరిచయమయ్యాడు. అతణ్ని పెళ్లి చేసుకుందామని శ్రావణి భావించింది. ఆమె దేవరాజుకు దగ్గరవడాన్ని గమనించిన సాయి.. ఆ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు చెప్పాడు. దీంతో గొడవలు మొదలయ్యాయి. శ్రావణి తల్లిదండ్రులు కూడా ఆమెను ఇబ్బంది పెట్టారు. సాయితో కలిసి ఆమెను కొట్టారు. మరోవైపు.. దేవరాజు కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్రావణిని మోసం చేశాడు. ‘‘పరోక్షంగా, ప్రత్యక్షంగా శ్రావణి ఆత్మహత్యకు ముగ్గురూ కారకులే. ఇలా అందరూ కలిసి వేధించడం వల్లే శ్రావణికి మనస్తాపానికి గురైంది’’ అని డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు.

Updated Date - 2020-09-17T08:35:20+05:30 IST