Abn logo
Nov 30 2020 @ 04:52AM

పుష్కర ఘాట్లకు పోటెత్తిన భక్తులు

గద్వాల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినంతో పాటు కార్తిక పౌర్ణిమ కావడంతో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. హైదరాబాద్‌, అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీకాకుళం, రాజమండ్రి, కర్నూలు జిల్లాల నుంచి ఎక్కువ మంది భక్తులు వచ్చారు. బెంగుళూరుతో పాటు కర్ణాటకకు చెందిన పలు జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి పుష్కరస్నానాలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని నాలుగు పుష్కరఘాట్లలో ఆదివారం 60 వేల మందికి పైగా మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.


చాలా మంది పుష్కర స్నానాలతో పాటు పిండ ప్రదానాలు చేశారు. అలంపూర్‌ పుష్కరఘాట్‌ వద్ద నదిలో మునగడానికి అవసరమైనంత నీరు లేకపోవడంతో చాలా మంది భక్తులు నీటిని వాటర్‌ బాటిళ్లు, మగ్గులతో తీసుకుని తలపై పోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగతా పుష్కరఘాట్లలో నదిలో స్నానం చేసేందుకు అవసరమైన నీరు ఉంది. మిగిలిన రెండు రోజుల్లో మరింత మంది భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement