టీటీడీలో ‘కడప’ స్థానికత.. ఎన్నడూ లేని పద్ధతికి శ్రీకారం!

ABN , First Publish Date - 2020-07-04T15:33:02+05:30 IST

ఉద్యోగాల భర్తీలో స్థానికులకు 75 శాతం పోస్టులు కేటా యించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి టీటీడీ వక్ర భాష్యం చెబుతోంది. కడప జిల్లాలో దేవస్థానం నిర్వహణలో వున్న ఆలయాల్లో 47 పోస్టుల భర్తీకి టీటీడీ ప్రత్యేకనోటిఫికేషన్‌ జారీచేసింది.

టీటీడీలో ‘కడప’ స్థానికత.. ఎన్నడూ లేని పద్ధతికి శ్రీకారం!

వివాదాస్పదమవుతున్న నోటిఫికేషన్‌ 

అనుబంధ ఆలయాల్లోని 47 పోస్టుల్లో 

75 శాతం కడప జిల్లావాసులకే కేటాయింపు 


తిరుపతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల భర్తీలో స్థానికులకు 75 శాతం పోస్టులు కేటా యించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి టీటీడీ వక్ర భాష్యం చెబుతోంది. కడప జిల్లాలో దేవస్థానం నిర్వహణలో వున్న ఆలయాల్లో 47 పోస్టుల భర్తీకి టీటీడీ ప్రత్యేకనోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో 75శాతంపోస్టులు కడప జిల్లావాసులకే కేటాయిస్తున్నట్టు పేర్కొనడం వివాదాస్పదమవుతోంది.


టీటీడీలో 15 వేలకు పైగా రెగ్యులర్‌ పోస్టులుండగా ప్రస్తుతం 8 వేల వరకూ పోస్టులు ఖాళీగా వున్నాయి. సుమారు 6700 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఆర్థిక భారం పెంచుకోకూడదని అంతర్గతంగా తీసుకున్న నిర్ణయంతో టీటీడీ గత చాలా ఏళ్ళుగా రెగ్యులర్‌ పోస్టులు భర్తీ చేయడం లేదు.అవసరాన్ని బట్టి కాంట్రాక్టు లేదా ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తూ వస్తోంది. వారి జీతభత్యాలకు తక్కువ వ్యయం కావడం, పెన్షన్‌, గ్రాట్యుటీ వంటి అదనపు భారాలు వుండవన్న ఉద్దేశం దీని వెనుక వుంది. సెక్యూరిటీ గార్డులు, అటెండర్లు, శానిటరీ వర్కర్లు, గార్డెనర్లు, వివిధ రకాల కౌంటర్లలో పనిచేసే అట్టడుగు స్థాయి ఉద్యోగాలను చాలావరకూ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. దేవస్థానానికి దేశవ్యాప్తంగా అనుబంధ ఆలయాలు, కళ్యాణ మండపాలు, సమాచార కేంద్రాలున్నాయి. వాటిల్లో పనిచేసే అట్టడుగు స్థాయి ఉద్యోగులను స్థానిక ఏజెన్సీల ద్వారా ఆయా ప్రాంతానికి చెందిన వారినే తాత్కాలిక ప్రాతిదికన నియమి స్తున్నారు. పైస్థాయి ఉద్యోగులను టీటీడీ తిరు పతినుంచే బదిలీలపై పంపుతోంది. ప్రత్యేకాంధ్ర ఉద్యమ సమయంలో కుదిరిన ఒప్పందం మేరకు 6 పాయింట్‌ ఫార్ములాకు అనుగుణంగా ఎల్‌డీసీ స్థాయి వరకూ ఉద్యోగాల భర్తీకి రాయలసీమ జోన్‌ స్థాయిలో, ఎల్‌డీసీ కంటే పైస్థాయి ఉద్యో గాల భర్తీకి రాష్ట్ర స్థాయిలోనూ నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగేది. టీటీడీలో ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న పద్ధతి. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాల భర్తీలో స్థాని కులకు 75 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయిం చింది. ఆసందర్భంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి టీటీడీలో కూడా ఇదే విధానం పాటించాలనికోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. దానికి ప్రభుత్వం అంగీకరించింది కూడా.అయితే ప్రభుత్వ నిర్ణయానికి టీటీడీ వక్రభాష్యం నిర్వ చిస్తోంది. ఈ ఏడాది టీటీడీ జారీ చేసిన తొలి నోటిఫికేషన్‌ కడప జిల్లాలోని టీటీడీ ఆలయాలకు సంబంధించింది. అక్కడి ఆలయాల్లో 47గార్డెనర్‌ పోస్టులు భర్తీ చేయడానికి జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌లో 75 శాతం పోస్టులు కడప జిల్లాకే కేటాయిస్తున్నట్టు పేర్కొంది. మిగిలిన 25 శాతం పోస్టులకు రాష్ట్రంలోని ఇతర జిల్లాల వారు దర ఖాస్తు చేసుకోవచ్చునంది. ఈ అంశమే ఇపుడు వివాదాస్పదంగా మారింది. తిరుమల శ్రీవారి ఆలయం, దానికి సంబంధించిన పాలనా వ్యవస్థ, ప్రధాన కార్యాలయం అన్నీ చిత్తూరు జిల్లాలో వున్నాయి. దేవస్థానంలో ఎల్‌డీసీ స్థాయి వరకూ ఏ ఉద్యోగం రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేయా లన్నా ప్రభుత్వ నిర్ణయంప్రకారం స్థానికత అనేది చిత్తూరు జిల్లాకు వర్తిస్తుంది. ఈ జిల్లాకు చెందిన వారికే 75శాతం ఉద్యోగాలు కేటాయించాలి. మిగిలిన పాతిక వంతు పోస్టులకు ఇతర జిల్లాల వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దేవస్థా నానికి సంబంధించి దేశంలో వున్న అనుబంధ ఆలయాలు, కళ్యాణ మండపాలు, సమాచార కేంద్రాల్లోని పోస్టులు భర్తీ చేయాలన్నా ఇదే విధానం పాటించాల్సి వుంది. కానీ కడప జిల్లా లోని టీటీడీ అనుబంధ ఆలయాల్లో గార్డెనర్‌ పోస్టుల భర్తీకి అనుసరిస్తున్న విధానం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.దీన్ని ఒకసారి అను మతిస్తే ఇక భవిష్యత్తులో టీటీడీకి సంబంధించి ఏ జిల్లాలో అనుబంధ సంస్థలున్నా ఆయాచోట్ల స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తూ నోటి ఫికేషన్లు జారీ చేయాల్సి వస్తుంది. అలాంట ప్పుడు ఇతర రాష్ట్రాల్లో వున్న దేవస్థానం ఆస్తు లకు సంబంధించిన ఉద్యోగులను ఎలా నియ మిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉదాహర ణకు తమిళనాడులోని కన్యాకుమారిలో టీటీడీకి చెందిన ఆలయంలో ఉద్యోగులను భర్తీ చేయ డానికి ఆ జిల్లావారినే 75 శాతం మందిని నియ మిస్తారా అన్నది ప్రశ్న. ఒకవేళ రాజకీయ ఒత్తి ళ్ళతో పాలకవర్గం ఇలాంటి నిర్ణయం తీసుకున్నా దేవస్థానం పాలనా బాధ్యతలు చూస్తున్న అఖిల భారత సర్వీసులకు చెందిన సీనియర్‌ అధికారులు ఏం చేస్తున్నారని కూడా ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. టీటీడీ తాజా నోటిఫికేషన్‌ను హైకోర్టులో సవాల్‌ చేసేందుకు పలు సంఘాలు సన్నద్ధమవుతున్నాయి.శనివారం నుంచీ ఆందోళనలకూ శ్రీకారం చుడుతున్నాయి.


అపాయింట్‌మెంట్‌, వేతనాలు కడపలోనే ఇస్తారా?

కడప జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయాల్లో గార్డెనర్‌ పోస్టులను 75 శాతం ఆ జిల్లాకే కేటాయించారు కనుక వారి ఉద్యోగ నియామకపు ఉత్తర్వులు, వేతనాల చెల్లింపుల్నీ కడప కేంద్రంగానే జరుగుతాయా? టీటీడీ కడప జిల్లాలోని అనుబంధ ఆలయాల నిర్వహణ కోసం విడిగా కడప జిల్లాలోనే పరిపాలనా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందా? దేవస్థానం, ప్రధాన పరిపాలనా కార్యాలయం తిరుపతిలో వున్నపుడు కడప జిల్లాకు విడిగా స్థానికత కల్పిస్తూ ఎలా నోటిఫికేషన్‌ జారీ చేస్తారు? దీనిపై శనివారం నుంచే ఆందోళనకు దిగుతున్నాం. హైకోర్టులో కూడా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తున్నాం.

- నవీన్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత


దేవస్థానం చరిత్రలో ఇలాంటి నోటిఫికేషన్‌ జారీ కాలేదు

టీటీడీ చరిత్రలో ఎప్పుడూ ఈ తరహా నోటిఫికేషన్‌ జారీ కాలేదు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినపుడు గతంలో అనుసరించిన విధానాలేమిటని రికార్డులు చూడాలి. చిత్తూరు జిల్లాలో నిరుద్యోగ యువతకు ఎస్వీ యూని వర్శిటీలో, టీటీడీలో మాత్రమే ఉద్యోగావకాశాలున్నాయి. ఇపుడు టీటీడీ ఉద్యో గాలకు కూడా స్థానికత పేరిట గండి కొడతారా? ఏ పోస్టుకైనా పనిచేసే ప్రదే శంతో నిమిత్తం లేకుండా టీటీడీ పోస్టులు భర్తీ చేయాలి. వారికి నియామకపు ఉత్తర్వులు జారీ చేయాలి. ఆ తర్వాతే వారిని ఎక్కడైనా నియమించాలి. ఈ పద్ధతిని పాటించాల్సిందిపోయి నోటిఫికేషనే ఫలానా జిల్లాలో పోస్టులకు అంటూ విడిగా నోటిఫికేషన్‌ ఎలా జారీ చేస్తారు? అనుభవజ్ఞులైన అధికారులు ఏం చేస్తున్నారో అంతుబట్టడంలేదు. టీటీడీ నిర్ణయాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం.

-మునిరెడ్డి, టీటీడీ ఉద్యోగ సంఘాల జాయింట్‌ కౌన్సిల్‌ మాజీ చైర్మన్‌ 

Updated Date - 2020-07-04T15:33:02+05:30 IST