Abn logo
May 29 2020 @ 03:03AM

ఏడాది పాలన అరాచకం

  • అమ్మకానికి టీటీడీ భూములా: అయ్యన్న
  • డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ దాకా వైసీపీకి జీ హుజూర్‌: అబ్దుల్‌ అజీజ్‌
  • ధైర్యంగా ఎదుర్కొందాం: బొండా ఉమ


అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘ఒక నేరస్తుడు, అసమర్థుడి పాలన ఎలా ఉంటుందో గత ఏడాదిగా చూస్తున్నాం.. జైల్లో 16 నెలలు చిప్పకూడు తిన్న వ్యక్తి న్యాయవ్యవస్థను విమర్శిస్తున్నారు’ అని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ’అక్రమ కేసులు, ఆస్తుల విధ్వంసం, పోలీసు వ్యవస్థ దుర్వినియోగం’పై గురువారం మహానాడులో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. ‘జగన్‌ ఏడాది పాలనలో అరాచకం, హింస, విధ్వంసాలు చెలరేగిపోయాయి. వేధింపులు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు హద్దు అదుపులేకుండా పోయాయి. ప్రాణాలకు రక్షణ కరువై ప్రజలు భయంతో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఎక్కడ చూసినా అవినీతి, దోపిడీలే. ఇంకా దారుణం ఏంటంటే.. తిరుమల తిరుపతి శ్రీవారి భూములు కూడా అమ్ముకునే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. చెన్నైలో టీటీడీకి సినీనటి కాంచన ఇచ్చిన రూ. 150 కోట్ల విలువైన భూమిని తన బినామీలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. హిందూ సంప్రదాయాన్ని కాపాడాల్సిన స్వామీజీలు ఎందుకు మౌనం వహిస్తున్నారు.


తిరుమల జోలికి వస్తే తగిన గుణపాఠం తప్పదని చరిత్ర పాఠం చెప్పింది. చివరకు ప్రసాదం బజార్లలో అమ్మే దుస్థితి తీసుకొచ్చారు.’ అని దుయ్యబట్టారు. ఈ తీర్మానాన్ని నెల్లూరు నేత అబ్దుల్‌ అజీజ్‌ సమర్థించారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ దాకా వైసీపీకి జీ హుజూర్‌ అంటున్నారని.. ఇదేనా లా అండ్‌ ఆర్డర్‌ అంటే అని ఆయన ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, ఐఏఎస్‌ అధికారికి కులం ఆపాదించేవాడు పాలకుడిగా తగడన్నారు. ముస్లిం మైనార్టీ చైర్మన్‌ గా ఉన్నారని మండలి రద్దుకు కుట్రలు చేశారని ఆక్షేపించారు. ప్రభుత్వ వ్యవస్థలను సీఎం జగన్‌ నిర్వీర్యం చేస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఏడాది పాలనలో అన్నీ వైఫల్యాలేన్నారు. ‘జగన్‌ది కక్షపూరిత ప్రభుత్వం. టీడీపీ నేతలపై దాడులకు తెగబడ్డారు. నాపై 6 తప్పుడు కేసులు పెట్టారు. వేధింపులతో కోడెల శివప్రసాద్‌ను పొట్టన పెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలు పోటీ చేయకుండా బెదిరించారు. తెనాలిలో నామినేషన్‌ వేసిన అభ్యర్థి ఇంట్లో మద్యం పెట్టి ఎదురుకేసు బనాయించారు. సీఎం సలహాదారు ఒకరు తాడేపల్లిలో సెటిల్‌మెంట్లకు వ్యూహ రచన చేస్తున్నాడు’ అని దుయ్యబట్టారు.

Advertisement
Advertisement
Advertisement