Abn logo
Oct 17 2020 @ 03:53AM

తిరుమల వెంకన్న సొమ్ము జగనన్నకు...

Kaakateeya

అబ్బాయ్‌ సేవలో బాబాయ్‌... వెంకన్న సొమ్ము జగనన్న సర్కార్‌కు

రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో శ్రీవారి సొమ్ము?

టీటీడీ పాలక మండలి అడ్డగోలు తీర్మానం

ఇప్పటిదాకా షెడ్యూల్డు బ్యాంకుల్లోనే డిపాజిట్లు

ట్రస్టులు నడిపేందుకు ఎక్కువ వడ్డీ కావాలట!

కేంద్ర సెక్యూరిటీల్లో పెట్టొచ్చన్న ఫైనాన్స్‌ కమిటీ

‘రాష్ట్ర సెక్యూరిటీ’ని అదనంగా చేర్చిన బోర్డు

డిసెంబరులో భారీగా ఎఫ్‌డీల మెచ్యూరిటీ

అవన్నీ ఖజానాకు తరలించే అవకాశం

ఐదేళ్ల నుంచి 40 ఏళ్ల వరకు పెట్టుబడి

కాలావధి ముగిశాకే వడ్డీ సొమ్ము చెల్లింపు

ఆగస్టు 28న తీర్మానం... అంతులేని గోప్యత!

స్వామి సొమ్ముకు భద్రతపై సందేహాలు
అనుకున్నంతా అవుతోంది! ఏడుకొండల వాడి సొమ్ముపై సర్కారు వారి కన్ను పడింది. టీటీడీ చైర్మన్‌గా ఉన్న బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి... అబ్బాయ్‌ వైఎస్‌ జగన్‌ సర్కారు సేవలో తరించేందుకు రంగం సిద్ధం చేశారు. టీటీడీ చరిత్రలోనే మొదటిసారిగా శ్రీవారి సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టాలని నిర్ణయించారు. తద్వారా స్వామి నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు దారులు తీశారు. ఇక... వెంకన్న సొమ్ము సర్కారు వారి చేతిలోనే! గోవిందా... గోవింద!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)


ఏడు కొండల వాడా, వెంకటరమణా గోవిందా గోవింద! ఆపద మొక్కుల వాడా, వడ్డీకాసుల వాడా గోవిందా గోవింద! ఈ గోవింద నామాల్లో ‘వడ్డీ కాసులు’ సర్కారు వారిని బాగా ఆకట్టుకున్నట్లున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే సేవా ట్రస్టులకు చెల్లించే విరాళాలను ‘వడ్డీ కోసం’ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని టీటీడీ పెద్దలు నిర్ణయించారు. దినదిన గండం అన్నట్లుగా ఎప్పటికప్పుడు అప్పులు చేస్తూ బండిలాగుతున్న సర్కారు వారికి తమదైన ‘సాయం’ చేయాలని తీర్మానించారు. ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలోనే దీనిపై తీర్మానం చేశారు. డిసెంబరులో ఈ ప్రణాళికను అమలు చేయడమే తరువాయి! ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. ఎలాగూ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తారు కదా, అదేదో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెడితే తప్పేమిటని వాదించవచ్చు! కానీ... ఇందులోనే చాలా మతలబు ఉంది.
చెప్పిందొకటి... చేసిందొకటి!


టీటీడీకి ప్రత్యేకంగా ఒక ఆర్థిక కమిటీ ఉంటుంది. అందులో ఆర్థిక నిపుణులు, అధికారులు ఉంటారు. దేవుడి సొమ్ములు ఎక్కడ, ఎలా డిపాజిట్‌ చేస్తే ఎక్కువ లాభం వస్తుందో ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటిదాకా టీటీడీ నిధులను షెడ్యూల్డు బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్‌ చేస్తున్నారు. అదికూడా, ఎక్కువ వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకులను ఎంచుకుంటారు. ఇదీ ఇప్పటిదాకా ఉన్న పద్ధతి. తమిళనాడులోని ప్రముఖ ఆలయాలన్నీ దాదాపు ఇదే విధానాన్ని పాటిస్తున్నాయి. కొన్ని గుళ్లు అధిక వడ్డీ కోసం ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నాయి. అయితే, టీటీడీ మొట్టమొదటిసారిగా ‘ప్రభుత్వ సెక్యూరిటీ’లలో డిపాజిట్‌ చేయాలని నిర్ణయించుకుంది. ‘‘జాతీయ బ్యాంకులేవీ ఎక్కువ వడ్డీ ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. ప్రస్తుతం అత్యధికంగా 5.5 శాతం వడ్డీ మాత్రమే వస్తోంది. అదే, కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెడితే, గరిష్ఠంగా 7 శాతం వడ్డీ వస్తుంది’’ అని టీటీడీ అకౌంట్స్‌ విభాగం ఒక నోట్‌ సిద్ధం చేసింది.


దీనిపైనే టీటీడీ ఫైనాన్స్‌ కమిటీ ఆగస్టు 13వ తేదీన ఒక తీర్మానం చేసింది.  ‘‘అధిక వడ్డీ లభించేలా టీటీడీ నిధులను కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టాలి. ఈ ఏడాది డిసెంబరులో భారీ ఎత్తున డిపాజిట్ల కాల పరిమితి ముగుస్తోంది. అందువల్ల, అక్టోబరు లేదా నవంబరులో జరిగే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలి’’ అని సూచించింది. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే... కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో డిపాజిట్‌ చేయాలని సిఫారసు చేయాలని మాత్రమే ఫైనాన్స్‌ కమిటీ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల గురించి చెప్పనే చెప్పలేదు. 


బోర్డు ఏం చేసిందంటే...


అక్టోబరు లేదా నవంబరులో జరిగే పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని టీటీడీ ఫైనాన్స్‌ కమిటీ స్పష్టంగా చెప్పింది. కానీ, బోర్డు పెద్దలు ఆగలేకపోయారు. ఆగస్టు 28వ తేదీన జరిగిన సమావేశంలోనే దీనిపై తీర్మానం చేశారు. ఇక్కడే మరో మతలబు ఉంది. ‘కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల’ గురించి మాత్రమే ఫైనాన్స్‌ కమిటీ ప్రస్తావించింది. కానీ, పాలకమండలి పెద్దలు... ‘లేదా రాష్ట్ర సెక్యూరిటీలలో’ అని కొత్త పదాలు చేర్చారు. వెరసి... వెంకన్న సొమ్ములను జగనన్న సర్కారు ఖజానాలోకి పంపేందుకు రంగం సిద్ధం చేశారు. డిసెంబరులో భారీ ఎత్తున టీటీడీ ఎఫ్‌డీలు మెచ్యూర్‌ అవుతున్నాయి. అవన్నీ... రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లోకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. అప్పుడు... ఆలయ నిధులను ప్రభుత్వానికి మళ్లించిన ఘనత మొట్టమొదటిసారిగా ఏపీ సర్కారుకే దక్కుతుంది.


చూపిన కారణమే చిత్రం!


‘‘టీటీడీ అన్నదాన ట్రస్టు, బర్డ్‌ ట్రస్టు, గోసంరక్షణ ట్రస్టు... ఈ మూడు ట్రస్టుల రోజువారీ కార్యకలాపాలు వడ్డీ సొమ్ములతోనే నడుస్తున్నాయి. అందువల్ల, అధిక వడ్డీ కోసం సెక్యూరిటీలలో సొమ్ము డిపాజిట్‌ చేయాలి’’ అంటూ వింత కారణం చూపించారు. వెరసి...  ‘రోజు వారీ కార్యకలాపాలకు వడ్డీయే దిక్కు’ అని టీటీడీయే చెబుతోంది. అంటే... ప్రతినెలా లేదా మూడు నెలలకోసారో వడ్డీ డబ్బులు చేతికందితేనే మేలు! ఆ వెసులుబాటు బ్యాంకు డిపాజిట్లకే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల కనీస కాలావధి 5 సంవత్సరాలు. గరిష్ఠంగా 40 ఏళ్లు! సర్వసాధారణంగా సెక్యూరిటీలలో 15 సంవత్సరాలు డిపాజిట్‌ చేస్తారు. వీటిపై మధ్యలో వడ్డీ చెల్లించే వెసులుబాటు ఉండదు. పూర్తికాలపరిమితి ముగిసిన తర్వాత ఒకేసారి వడ్డీతో కలిపి డబ్బులు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో 15 - 20 సంవత్సరాలకు పెట్టుబడి పెట్టారనుకుంటే... అవి మెచ్యూరిటీ అయ్యేనాటికి రాజెవరో, మంత్రెవరో! ఇప్పటికైతే సర్కారు వారు వెంకన్న సొమ్మును ఎంచక్కా వాడుకోవచ్చు! మరో ముఖ్యమైన అంశమేమిటంటే... రాష్ట్ర ప్రభుత్వానికి 7 శాతం వడ్డీకి బహిరంగ మార్కెట్‌లోనూ అప్పు దొరుకుతుంది. అయినా సరే, వెంకన్న సొమ్ములపైనే కన్నేయడం ఎందుకు?


వడ్డీరేట్ల గోల్‌మాల్‌కు చాన్స్‌... 

టీటీడీ స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థ. కానీ, ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే నడుచుకుంటోందనే అనుమానాలు బలపడుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా... టీటీడీ పాలక మండలి ప్రభుత్వ అదుపాజ్ఞల్లోనే ఉంటోంది. కాబట్టి, వడ్డీ రేట్ల విషయంలో గోల్‌మాల్‌ జరగవచ్చునని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ‘ఏడు శాతం’ అంటున్నప్పటికీ... భవిష్యత్తులో దానిని ఐదుకో, ఆరుకో తగ్గించుకునే అవకాశాలను తోసిపుచ్చలేమని చెబుతున్నారు. ఆర్బీఐ ద్వారా జరిగే సెక్యూరిటీల వేలంలో... ఎవరు తక్కువ వడ్డీ కోరుకుంటారో, వారినే ప్రభుత్వం ఎంచుకుంటుంది. ప్రభుత్వానికి మేలు చేసేందుకు సిద్ధమైన టీటీడీ పెద్దలు... అందుకు అనుగుణంగానే వడ్డీరేటు కోట్‌ చేసే అవకాశముందని పేర్కొంటున్నారు.


జూన్‌లోనే మొదలు... 

టీటీడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మళ్లించే ప్రయత్నాలు గతంలో పలు సందర్భాల్లో జరిగాయి. అయితే, భక్తుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ఎప్పటికప్పుడు వెనక్కి తగ్గుతూ  వచ్చారు. చివరికి ఎన్టీఆర్‌ హయాంలోనూ ఇదే జరిగింది. అప్పట్లో... తిరుపతి నగరంపై భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, దానికి అయ్యే ఖర్చును టీటీడీ భరించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. చివరకు వ్యవహారం కోర్టుదాకా వెళ్లింది. దాంతో చేసేదేమీలేక అటు టీటీడీ, ఇటు ప్రభుత్వం రెండూ వెనక్కు తగ్గాయి. చివరికి... మునిసిపాలిటీ స్థలాన్ని టీటీడీకి ఇచ్చి, దీనికి ప్రతిఫలంగా వచ్చిన సొమ్ముతో డ్రైనేజీ పనులు చేపట్టేలా ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు అడపాదడపా టీటీడీ వైపు చూడటం, అదికాస్తా ఎదురుతన్నడం మామూలే! ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ‘ఎవరేమనుకుంటే మాకేం! మేం అనుకున్నది చేసేస్తాం’ అనే వైఖరే కనిపిస్తోంది. తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని జగన్‌ టీటీడీ చైర్మన్‌గా నియమించారు. టీటీడీ నిధులను దక్కించుకునేందుకు అప్పటినుంచే మార్గాలు అన్వేషించడం మొదలైంది. ఎంతోమంది సీఎంలు చేయని పని... ఇప్పుడు జగన్‌ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడికి తలొగ్గే టీటీడీ యంత్రాంగం ఈ తీర్మానం చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. టీటీడీ నిధులు  రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెళితే... భద్రత ఉండదన్న ఆందోళన అధికారవర్గాల్లో ఉంది. అందుకే... కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టొచ్చని మాత్రమే టీటీడీ ఫైనాన్స్‌ కమిటీ సిఫారసు చేసింది. కానీ, బాబాయి వైవీ సుబ్బారెడ్డి నాయకత్వంలోని పాలక మండలి... కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర సెక్యూరిటీల్లో పెట్టవచ్చని తీర్మానించడం గమనార్హం.


అన్నదాన ట్రస్టుకు నిధుల్లేవా?

ప్రభుత్వ సెక్యూరిటీల్లో నిధులు పెట్టుబడి పెట్టడానికి టీటీడీ పాలకమండలి చూపించిన కారణాలు టీటీడీనే అపహాస్యం పాలుచేసేలా ఉన్నాయి. ట్రస్టులు నడిపేందుకు నిధులు కావాలనే కారణం చూపడం మరీ చోద్యమని చెబుతున్నారు. టీటీడీ నిత్యాన్నదాన ట్రస్టుకు గత ఏడాది చివరి నాటికే రూ.1150 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఈ మొత్తంపై ఏటా రూ. 80 కోట్లకుపైగా వడ్డీ రూపంలో వస్తోంది. అన్నదానానికి సుమారు రూ.90 కోట్ల వరకు ఖర్చవుతోంది. అంటే, టీటీడీ భరిస్తున్నది రూ.10 కోట్లలోపే. ప్రస్తుతం ఈ ట్రస్టుకు ఏటా కనీసం రూ.100 కోట్లు విరాళాలు వస్తున్నాయి. చివరకు ప్రపంచం అంతా అతలాకుతులమైన కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ శ్రీవారి అన్నదాన ట్రస్టుకు రూ. 27 కోట్లు విరాళంగా అందాయి. అంటే, మరో రెండు మూడేళ్లలో డిపాజిట్లపై వడ్డీతోనే నిత్యాన్నదాన ట్రస్టు నడిచే అవకాశముంది. ఈ మాత్రం దానికి ప్రభుత్వానికి స్వామివారి నిధులు మళ్లించడం ఎందుకో ఆలయపాలకులకే తెలియాలి!


Advertisement
Advertisement
Advertisement