TTA ఆధ్వర్యంలో అమెరికాలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం

ABN , First Publish Date - 2022-05-26T18:41:39+05:30 IST

తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో మే 27వ తేదీ నుండి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవ సంబరాలు నిర్వహించడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ గనగొని శ్రీనివాస్, అధ్యక్షుడు పటోళ్ల మోహన్ రెడ్డి తెలిపారు.

TTA ఆధ్వర్యంలో అమెరికాలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం

అమెరికాకు తరలివస్తున్న తెలంగాణ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కళాకారులు

న్యూజెర్సీలో టీటీఏ ఆధ్వర్యంలో మూడు రోజుల  ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

న్యూజెర్సీ నుండి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి కిలారు ముద్దుకృష్ణ: తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో మే 27వ తేదీ నుండి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవ సంబరాలు నిర్వహించడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు కాన్ఫరెన్స్ కమిటీ  కన్వీనర్ గనగొని శ్రీనివాస్, అధ్యక్షుడు పటోళ్ల మోహన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మూడు రోజుల పాటు జరిగే సంబరాల విశేషాలను వివరించారు. న్యూజెర్సీ కన్వెన్షన్ సెంటర్లో 27వ తేదీ రాత్రి బ్యాంక్ వెట్ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు అవార్డులు అందజేస్తామని చెప్పారు. అనంతరం సీనియర్ దర్శకుడు కోటి బృందం ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ ఉంటుందని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరాల వివరాలను పరిశీలిస్తే..


*28వ తేదీ ఉదయం తెలంగాణ వైభవాన్ని సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా స్వాగత నృత్యం గీతం ఉంటుందని తెలిపారు. దీనిని జొన్నవిత్తుల, వడ్డేపల్లి కృష్ణ రూపొందించగా వందేమాతరం శ్రీనివాస్ ఆలపించారు. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మరఫీతో పాటు స్థానిక సెనేటర్, మేయర్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు అనంతరం సాయంత్రం ప్రముఖ సింగర్ సునీత బృందంచే సంగీత విభావరి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే రసమయి బాలకిషన్ బృందం ప్రదర్శన ఉంటుందని తెలిపారు. సినిమా నటీనటులు నిఖిల్ రీటా, వర్మ, అంజలి, జబర్దస్త్ బృందం ప్రదర్శనలు ఉంటాయని తెలియజేశారు.


* మూడవరోజు ఉదయం వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అమెరికాలో తొలిసారిగా ఈ కళ్యాణాన్ని తమ వేడుకల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాత్రి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మూడు రోజులపాటు ప్రముఖ యాంకర్స్ సుమా, రవిలు కార్యక్రమాలు నిర్వహిస్తారని శ్రీనివాస్ గనగొని మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, భాజపా నేతలు డి.అరవింద్, డీకే అరుణ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు.


* కాన్ఫరెన్స్‌కు అనుబంధంగా వాణిజ్యం, ఐటీ, మహిళ రాజకీయం, యువత మ్యాట్రిమోనీ తదితర సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ అటార్నీలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. టీటీఏ స్టార్ సింగర్‌ను ఉత్సవాల సందర్భంగా ప్రకటిస్తామని తెలిపారు. యువత కోసం క్రూజ్ పర్యటన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ వైభోగం సాంప్రదాయం చాటిచెప్పే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.



Updated Date - 2022-05-26T18:41:39+05:30 IST