ఈనెల 4వ తేదీ నుంచి టెట్ పై టి-సాట్ స్పెషల్ లైవ్ లెసన్స్

ABN , First Publish Date - 2022-04-03T22:59:05+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ (టీచర్స్ ఎల్జిబిలిటీ టెస్ట్) కోసం పోటీ పడే అభ్యర్థులకు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసాయి.

ఈనెల 4వ తేదీ నుంచి టెట్ పై టి-సాట్ స్పెషల్ లైవ్ లెసన్స్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ (టీచర్స్ ఎల్జిబిలిటీ టెస్ట్) కోసం పోటీ పడే అభ్యర్థులకు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసాయి. ఏప్రిల్ 4వ తేదీ సోమవారం నుండి జూన్ ఐదవ తేదీ వరకు రెండు నెలలు 60 రోజుల పాటు పాఠ్యాంశాలు ప్రసారం కానున్నాయి. టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈవో రాంపుపురం శైలేష్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ప్రసారాలకు సంబంధించిన వివరాలు వెల్ల్లడించారు. సోమవారం నాల్గవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు అరగంట పాటు మొదటి పేపర్, ఎనిమిదిన్నర నుండి తొమ్మిది గంటల వరకు మరో అరగంట పాటు రెండవ పేపర్ కు సంబంధించిన పాఠ్యాంశాలు టి-సాట్ విద్య ఛానల్ లో ప్రసారాలు ప్రారంభమై జూన్ 5వ తేదీన ముగుస్తాయన్నారు. సోమవారం నుండి వారం రోజుల పాటు ఉదయం 10 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నాం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు టెట్ మొదటి, రెండవ ప్రశ్న పత్రాలకు సంబంధించిన పాఠ్యాంశాలపై ప్రత్యేక ప్రత్యక్ష (స్పెషల్ లైవ్ లెసన్స్) ప్రసారాలుంటాయని శైలేష్ రెడ్డి వివరించారు.


 ఏప్రిల్ నాల్గవ తేదీ సోమవారం నుండి శనివారం వరకు ఆరు రోజుల పాటు 12 పేపర్లపై  ప్రత్యేక అనుభవం కలిగిన ఉపన్యాకులచే  అవగాహన పాఠ్యాంశ ప్రసారాలుంటాయని సీఈవో స్పష్టం చేశారు. తెలుగు, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మెథడాలజీ, సోషల్ స్టడీస్ కంటెంట్, మ్యాథ్స్, సైన్స్, ఈవీఎస్, బయాలజీ, ఛైల్డ్ ఉడ్ డెవలప్ మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టులపై పాఠ్యాంశాలు బోధిస్తారన్నారు. ఆరు రోజుల స్పెషల్ లైవ్ తో పాటు (రెండు నెలలు) 60 రోజులు, 120 పాఠ్యాంశ భాగాలు ప్రసారమౌతాయన్నారు. 


మాక్ టెస్ట్ లు, క్విజ్ పోటీలు

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులతో కలిపి సుమారు 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసిందని, ఆ ఉద్యోగాల సాధనలో తెలంగాణ యువతకు చేయూత నిచ్చేందుకు టి-సాట్ నెట్వర్క్ తన వంతు సహకారం అందిస్తుందని సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. పోటీ పరీక్షల అవగాహన తరగుతులతో పాటు మాక్ టెస్ట్, (క్విజ్) ఇంట్రెస్టింగ్ జనరల్ నాలెడ్జ్ పేరుతో ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసి టి-సాట్ వెబ్ సైట్, ఛానళ్లు, యూట్యూబ్ ద్వార అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. టి-సాట్ మాక్ టెస్ట్ లో భాగస్వాములవడం వలన ప్రభుత్వం నిర్వహించబోయే తుది పరీక్షనెదుర్కోవడం సులభమౌతుందని, ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని శైలేష్ రెడ్డి సూచించారు.

Updated Date - 2022-04-03T22:59:05+05:30 IST