Abn logo
Oct 13 2021 @ 02:41AM

ఆర్థిక ఇబ్బందులతో ‘రియల్‌’ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య

పనుల తాలూకు బిల్లులు ఇవ్వకపోవడంతో మనోవేదన 

కార్పొరేటర్‌ సహా 9 మంది కారణమని సూసైడ్‌ నోట్‌ 


సరూర్‌నగర్‌, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో అభివృద్ధి పనులు నిర్వహించే (రియల్‌ కాంట్రాక్టర్‌) వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బడంగ్‌పేట్‌ గాంధీనగర్‌కు చెందిన డి.సైదులు (45). బడంగ్‌పేట్‌లోని ఓ వెంచర్‌లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడాడు. తన ఆత్మహత్యకు కర్మన్‌ఘాట్‌ బీజేపీ కార్పొరేటర్‌ వంగ మధుసూధన్‌రెడ్డి, ఆయన వ్యాపార భాగస్వామి రవీందర్‌రెడ్డి, బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్‌ సహా తొమ్మిదిమంది కారణమని సూసైడ్‌ నోట్‌ రాశాడు. మీర్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. బడంగ్‌పేట్‌ గాంధీనగర్‌కు చెందిన డి.సైదులు.. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనుల కాంట్రాక్టులు చేస్తుంటాడు. ఈ క్రమంలో నాదర్‌గుల్‌, బడంగ్‌పేట్‌లలో మధుసూధన్‌రెడ్డి, శ్రీరాములుయాదవ్‌, రవీందర్‌రెడ్డికి చెందిన వెంచర్లతో పాటు గుర్రంగూడలోని సురేందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డికి చెందిన వెంచర్లు, దేవరకొండలోని మహేందర్‌సేట్‌, శ్రీశైలంయాదవ్‌కు చెందిన వెంచర్లలోనూ  కాంట్రాక్ట్‌ పనులు చేస్తున్నారు. కొంత కాలంగా తాను చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేస్తుండటంతో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఆయా పనుల కోసం దుర్గేశ్‌ అనే ఫైనాన్షియర్‌ వద్ద డబ్బు తెచ్చి ఖర్చు చేశాడు.  తన డబ్బు చెల్లించాలంటూ ఆయన ఒత్తిడి చేస్తున్నాడు. ఇటు రియల్‌ వ్యాపారులు డబ్బు ఇవ్వకపోవడం, అటు ఫైనాన్షియర్‌ ఒత్తిడి ఎక్కువ కావడంతో సైదులు  మానసిక వేదనకు గురయ్యాడు. మంగళవారం సాయంత్రం బడంగ్‌పేట్‌లోని వంగ, అందెలకు చెందిన వెంచర్‌లోనే పురుగుల మందు తాగాడు. మీర్‌పేట్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.