తండ్రి.. ఇద్దరు కుమారుల హత్య!

ABN , First Publish Date - 2022-01-21T08:20:06+05:30 IST

తండ్రి.. ఇద్దరు కుమారుల హత్య!

తండ్రి.. ఇద్దరు కుమారుల హత్య!

మంత్రాలు, క్షుద్రపూజల నెపంతో గొడ్డలితో దాడి

జగిత్యాల జిల్లా  కేంద్రంలో ఘోరం


జగిత్యాల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అదో కుటుంబం! ఇంటి తరఫున తండ్రి, ఆయన ముగ్గురు కుమారులు.. కుల సంఘం సమావేశానికి హాజరయ్యారు! అక్కడ వారిపై కర్రలు, గొడ్డలితో కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో తండ్రి, ఇద్దరు కుమారులు మృతిచెందారు. మంత్రాలు, క్షుద్రపూజలు  చేస్తున్నారనే అనుమానంతోనే వారు ఈ దారుణ హత్యలకు పాల్పడినట్లు భావిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం ఈ ఘోరం జరిగింది. పట్టణంలోని తారకరామానగర్‌లో ఉంటున్న జగన్నాథం నాగేశ్వర్‌రావు (65)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు రాంబాబు (35), రమేశ్‌ (32), రా జేశ్‌ కుమారులు, ఓ కూతురు. చిన్న భార్యకు కుమారుడు విజయ్‌ ఉన్నాడు. వీరంతా సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రపరిచే పనులు, వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. నాగేశ్వర్‌రావు, ఆయన కుమారులకు మంత్రాలు వస్తాయని కులసంఘ సభ్యులు కొన్నిరోజులుగా ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలనీలో కొందరు స్వల్ప అనారోగ్యాలకు గురికావడం, ఆర్థికంగా నష్టాల పాలవడం వంటి సంఘటనలు జరిగాయి. నాగేశ్వర్‌రావు మంత్రాలు చేయడం వల్లనే ఇవి చోటు చేసుకున్నాయని కులసంఘాల సభ్యులు అనుమానం పెంచుకున్నారు. ఇటీవల నాగేశ్వర్‌రావు కుటుంబ సభ్యులు కాలనీ సమీపంలో క్షుద్రపూజలు చేస్తున్న సమయంలో కాలనీవాసులు వెళ్లి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆరు నెలలకొకసారి జరుపుకునే కులసంఘ సర్వసభ్య సమావేశం గురువారం  జరిగింది. ఈ సమావేశానికి నాగేశ్వర్‌రావు, రాంబాబు, రమేశ్‌, రాజేశ్‌తో పాటు 30 మంది కుల సంఘం సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వర్‌రావుకు కుల సంఘ సభ్యులకు మధ్య మంత్రాల విషయంలో వాదనలు జరిగాయి. ఇరువర్గాల మద్య మాటామాటా పెరిగి తోపులాట జరిగింది. కొందరు సభ్యులు కర్రలు, గొడ్డలితో నాగేశ్వర్‌రావు, ఆయన కుమారులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో నాగేశ్వర్‌రావు, రాంబాబు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలైన రమేశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. నాగేశ్వర్‌రావు మరో కుమారుడు రాజేశ్‌ తప్పించుకొని పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-01-21T08:20:06+05:30 IST