ఇదేం పెత్తనం?

ABN , First Publish Date - 2022-01-21T07:54:42+05:30 IST

ఇదేం పెత్తనం?

ఇదేం పెత్తనం?

అడిగిన ఐఏఎస్‌లను పంపాల్సిందే అంటే ఎలా?

కేంద్రం వైఖరి సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం

రాష్ట్రాల హక్కులను కాల రాయడమే

భగ్గుమన్న 9 ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు

ఐఏఎస్‌ల కొరతతో ఇబ్బంది పడుతున్నాం

ప్రతిపాదనను రద్దు చేసుకోవాలి: తెలంగాణ

ఐఏఎస్‌ అధికారుల్లో భిన్నాభిప్రాయాలు

ఐఏఎస్‌లను పంపితే రాష్ట్రానికే లాభం

అంగీకారం లేకుండా తీసుకెళ్లడమే తప్పు: జేపీ

కేంద్ర ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం: వినోద్‌


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఏడున్నరేళ్ల క్రితం నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో ఎన్‌డీఏ అధికారానికి వచ్చినప్పటి నుంచి క్రమక్రమంగా రాష్ట్రాల అధికారాల్లోకి కేంద్రం చొరబడుతోందనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. మొదట ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ సహా పలు వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల పోటీ పరీక్షలను ఏకీకృతం చేశారు. జనన మరణాల నమోదు కార్యక్రమాన్ని కేంద్రం పరిధిలోకి తెచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల పరిరక్షణ పేరుతో డ్యాముల భద్రతను తమ చేతుల్లోకి తీసుకున్నారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధి వరకే పరిమితమైన బీఎ్‌సఎఫ్‌ అధికారాలను 50 కిలోమీటర్లకు విస్తరించారు. రాష్ట్రాల పరిధిలోని అంశమైన వ్యవసాయంపై ఎడా పెడా చట్టాలు చేసి, తర్వాత రైతుల ఆందోళనలతో వెనక్కి తగ్గారు. రాష్ట్రాల మెడలు వంచి కేంద్రం ప్రాబల్యం పెరిగే విధంగా విద్య, విద్యుత్‌ సంస్కరణలను అమల్లోకి తెస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓడరేవులపై రాష్ట్రాల అధికారాలను కుదిస్తూ బిల్లును సిద్ధం చేశారు. వీటన్నింటితో గుర్రుగా ఉన్న రాష్ట్రాలకు మింగుడు పడని మరో నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల్లో తమకు ఇష్టం వచ్చిన వారిని ఒక్క కలం పోటుతో రాష్ట్రం నుంచి ఢిల్లీకి రప్పించుకొనే విధంగా 1954 నాటి ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్యాడర్‌ రూల్స్‌ను మార్చాలని నిర్ణయించింది. దాంతో కేంద్రం కోరిన అధికారిని రాష్ట్రం తన అవసరాలను పక్కనబెట్టి డిప్యుటేషన్‌ మీద పంపించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. కేడర్‌ రూల్స్‌ మార్పులపై గత ఏడాది మూడు సార్లు ప్రతిపాదనలు పంపితే కేవలం ఆరు రాష్ట్రాలే స్పందించాయి. ప్రతిపాదనలను వ్యతిరేకించాయి. మిగతా రాష్ట్రాలు చప్పుడు చేయలేదు. దాంతో కేంద్ర సిబ్బంది శాఖ జనవరి 12న మరోసారి రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. జనవరి 25 వరకు గడువు ఇచ్చింది.ఈసారి కూడా రాష్ట్రాలు స్పందించకపోతే మరోసారి రిమైండర్‌ పంపించి, ఆ తర్వాత ఏకంగా కొత్త నిబంధనలను నోటిఫై చేస్తామని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.


నాలుగు మార్పులు

కేడర్‌ రూల్స్‌లో కేంద్రం నాలుగు మార్పులు  ప్రతిపాదించింది. 1) ప్రస్తుతం ఒక అధికారిని కేంద్రానికి తీసుకోవాలంటే రాష్ట్రం నిరభ్యంతరపత్రం ఇవ్వాలి. తాజా మార్పుల ప్రకారం గడువులోగా నిరభ్యంతర పత్రం ఇవ్వకపోతే ఇచ్చినట్లుగానే భావించి, కేంద్ర సర్వీసులకు తీసుకుపోతారు. 2) ఒక రాష్ట్రం ఎంతమందిని డెప్యుటేషన్‌ మీద ఢిల్లీకి పంపాలో కేంద్రం చెబుతుంది. అందుకు అర్హులైన అధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. పాత నిబంధన ప్రకారం ఒక రాష్ట్రం నుంచి 40శాతం మందికి మించి కేంద్రానికి డెప్యుటేషన్‌ మీద వెళ్లకూడదనే నిబంధన మాత్రమే ఉంది. 3) డెప్యుటేషన్‌ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయం వస్తే కేంద్రం మాటే చెల్లుబాటవుతుంది. రాష్ట్రాలు ఆమోదం తెలపడం తప్ప ఏమీ చేయడానికి ఉండదు. 4) ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం అడిగితే రాష్ట్రం గడువులోగా ఆ అధికారిని పంపాల్సిందే.


సమాఖ్య స్ఫూర్తికి గండి

కేంద్రం ప్రతిపాదనలను బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న తొమ్మిది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొత్త నిబంధనలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. కేరళ న్యాయమంత్రి పి.రాజీవె కూడా కార్యనిర్వాహక అధికారం కేంద్రం దగ్గర కేంద్రీకృతం కావడాన్ని తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. బిహార్‌లో బీజేపీ మిత్రపక్షం జేడీయూ ప్రభుత్వం కూడా కేంద్రం ప్రతిపాదనలను అంగీకరించడం లేదని తెలిసింది. జార్ఖండ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలు కూడా కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ జవాబులు సిద్ధం చేస్తున్నాయి. మమత ఇప్పటికే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ విషయం మాట్లాడారని, పార్లమెంట్‌లో గందరగోళం సృష్టించడానికి సిద్ధం కావాలని చెప్పారని తెలుస్తోంది. కేంద్రం తాజా ప్రతిపాదనలను అంగీకరించే విషయంలో రాష్ట్రాలకు రెండు అభ్యంతరాలు ఉన్నాయి. 1)సమర్థులైన అధికారులను కేంద్రం తీసుకెళితే రాష్ట్రంలో పాలన కుంటుపడుతుంది. 2)రాజకీయంగా తమకు చేదోడు వాదోడుగా ఉండే అధికారులను కేంద్రం ఏదో వంకతో ఢిల్లీకి తీసుకెళితే పాలనపై రాష్ట్ర రాజకీయ నాయకత్వానికి పట్టుదప్పుతుంది. కేంద్రం ప్రతిపాదనల వెనుక రాజకీయ కోణం ఉందని రాష్ట్రాలు భయపడుతున్నాయి. ఈ భయాలను నివృత్తి చేసేవరకు ప్రతిష్ఠంభన తప్పదని భావిస్తున్నారు. 


ఇవ్వకుండా లాక్కుంటారా?

తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రం ప్రతిపాదనలను వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిసింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సల కొరత తీవ్రంగా ఉందని, ఇలాంటి సందర్భాల్లో మరింత మంది అధికారులను కేటాయించాల్సింది పోయి... ఉన్న అధికారులను లాక్కుంటామనడం సమంజసం కాదని రాష్ట్ర ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్ర  ప్రతిపాదన ‘సహకారాత్మక సమాఖ్య’ (కో-ఆపరేటివ్‌ ఫెడరలిజం) విధానానికే విరుద్ధమని, రాష్ట్రాల హక్కులను కాలరాసినట్లవుతుందని అభిప్రాయ పడిందని సమాచారం. కేంద్రం ప్రతిపాదనల గురించి ఇటీవలే సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని సీఎం ఆదేశించడంతో సీఎస్‌ లేఖ పంపించారని సమాచారం. సెంట్రల్‌ డెప్యుటేషన్‌కు సరిపడా రాష్ట్రాల కేడర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను అందుబాటులో ఉంచడమే కేంద్రం చెబుతున్న లక్ష్యం. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పని చేయడానికి ఐఏఎ్‌సల కొరత తీవ్రంగా ఉందని, వివిధ రాష్ట్రాల నుంచి డెప్యుటేషన్‌ మీద పంపాలని కోరుతున్నా రాష్ట్రాల నుంచి స్పందన లేదని అంటోంది. కేంద్ర ప్రతిపాదన సహకారాత్మక సమాఖ్య విధానానికి వ్యతిరేకమంటూ రాష్ట్ర ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు సరిపడా ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలను కేటాయించలేదని, ఇప్పుడు ఉన్న అధికారులను లాక్కుంటే పాలన కుంటుపడుతుందని ఆవేదన వెలిబుచ్చింది. నిజానికి కొత్త రాష్ట్రానికి ఎక్కువ మంది అధికారులను కేటాయించాల్సి ఉందని గుర్తు చేసింది. ఇప్పటికే జీఎస్టీని అమలు చేసి కేంద్రం రాష్ట్రాలకు ఉన్న పన్ను విధింపు హక్కులను లాక్కుందని, తాజాగా గోదావరి, కృష్ణా జలాలపై హక్కులను కూడా లాగేసుకుని బోర్డులకు అప్పగించిందని ప్రస్తావించినట్లు సమాచారం. తాజా నిర్ణయంతో రాష్ట్రాల్లో ఐఏఎస్‌, ఐపీఎ్‌సల కొరత తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఆలోచనను విరమించుకోవాలని కోరినట్లు సమాచారం. 


భిన్నాభిప్రాయాలు

కేంద్రం ప్రతిపాదనలపై ఐఏఎ్‌సలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. సరికాదని కొంత మంది అంటున్నారు. ఇప్పటికే కేంద్రం తనకు కావాల్సిన ఐఏఎ్‌సలను ఏరికోరి తీసుకుంటోందని, ప్రతిభావంతులైన అధికారులంతా కేంద్ర సర్వీసుల్లోకి వెళితే రాష్ట్రాల్లో పరిపాలన ఇబ్బందికరంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక, రెవెన్యూ, విద్య, వైద్యం, పురపాలక, పట్టణాభివృద్ధి వంటి కీలక శాఖలకు అనుభవజ్ఞులు, ప్రతిభ గల ఐఏఎ్‌సల అవసరం ఉందని ఓ రిటైర్డు అధికారి వ్యాఖ్యానించారు. రాష్ట్రాల సమ్మతి అక్కరలేకుండా కేంద్రం తనకు నచ్చినంతమంది ఐఏఎ్‌సలను తీసుంటాననడం సరి కాదని, ఇది అధికారుల మనోభావాలను దెబ్బతీస్తుందని చెప్పారు. మరోవైపు భిన్నమైన వాదన వినిపిస్తోంది. రాష్ట్రకేడర్‌ అధికారి ఢిల్లీకి వెళితే సొంత రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. కేంద్రంలోని వివిధ శాఖల్లో తమ ఐఏఎ్‌సలు ఉంటే వారిద్వారా నిధుల విడుదల తేలికవుతుందని చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఐఏఎస్‌లు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడానికి ఇష్టపడరని, ఉత్తరాది అధికారులు ఎక్కువగా వెళుతుంటారని గుర్తుచేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఐఏఎ్‌సలకు ఢిల్లీలో కన్నా మెరుగైన సౌకర్యాలు ఉండటంతో వాళ్లు కేంద్రానికి వెళ్లడానికి ఇష్టపడరని వివరిస్తున్నారు. ఫలానా అధికారి తమకు కావాల్సిందేనని కేంద్రం లాగేసుకుంటే ఆ అధికారి ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక అధికారిని కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం తో పాటు సదరు అధికారి సమ్మతి తీసుకోవాలి. అధికారి సిద్ధపడకపోతే తీసుకోవడం కుదరదు. ఇప్పుడు దాన్ని మార్చేస్తున్నారు. ఎవరి సమ్మతీ అక్కర్లేదని చెప్పడం రాజ్యాంగవిరుద్ధమని అధికారులు అంటున్నారు.


250 మంది కావాలి

రాష్ట్రంలో ఐఏఎ్‌సల కొరత తీవ్రంగా ఉంది. ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు 208 ఐఏఎస్‌ పోస్టులను కేటాయించారు. దాన్ని 250కి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ప్రధాని మోదీ దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఐపీఎస్‌ పోస్టులను కూడా 139 నుంచి 195కు పెంచాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర సర్వీసులో 160 మంది ఐఏఎస్‌ అధికారులు పని చేస్తున్నారు. అందులో 10 మంది డెప్యుటేషన్‌పై కేంద్రం సర్వీసుల్లోఉన్నారు. నికరంగా మిగిలింది 150 మందే.


బెంగాల్లో బీజం

గత ఏడాది బెంగాల్‌కు వరదలు వచ్చినపుడు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. వరద పరిస్థితిని సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ హాజరు కాలేదు. దాంతో ఆగ్రహించిన కేంద్రం ఆయన్ను మే 31న పదవీ విరమణ రోజున డిప్యుటేషన్‌ మీద ఢిల్లీకి వచ్చేయాలని ఆదేశించింది. ఆయన్ను పంపడానికి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఆయన కూడా ఉద్యోగానికి రాజీనామా చేశారు. నాటి వ్యవహారం మీద ఇప్పటికీ న్యాయ వివాదం నడుస్తోంది. బెంగాల్‌ అనుభవంతో కేంద్రం ఐఏఎ్‌సల డిప్యుటేషన్‌ నిబంధనలను మార్చింది. 


ఉన్న వారిని వాడుకుంటున్నామా?

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఐఏఎ్‌సల సేవలను సైతం సక్రమంగా వినియోగించుకోవడం లేదన్న ఆరోపణ ఉంది. కొంత మందికి పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెడుతున్నారు. కొంత మందికి అదనపు బాధ్యతలు అప్పగించి, మోయలేని భారం పెడుతున్నారు. సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ స్వయంగా రెవెన్యూ, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖల బాధ్యతలను చూడాల్సి వస్తోంది. ధరణి అంశాన్ని ఆయనే స్వయంగా పరిశీలిస్తున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు ప్రణాళిక శాఖ, స్టేట్‌ రీ-ఆర్గనైజేషన్‌ విభాగపు అదనపు బాధ్యతలున్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ కూడా సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా విద్యా శాఖ, పశు సంవర్థక శాఖ బాధ్యతలూ నిర్వహిస్తున్నారు. ఇలా  అదనపు బాధ్యతలు కట్టబెట్టే బదులు వెయిటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగులు ఇవ్వవచ్చు కదా అన్న అభిప్రాయాలున్నాయి. పైగా రిటైర్‌ అయిన అనిల్‌ కుమార్‌ను పౌర సరఫరాల శాఖ కార్యదర్శిగా కొనసాగిస్తున్నారు. వెయిటింగ్‌లో ఉన్న వాళ్లకు పోస్టులిచ్చే ప్రయత్నం చేయకుండా ఐఏఎ్‌సల కొరతను రాష్ట్రం ఎలా సమర్థించుకుంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 


కేంద్రానిది తప్పే

రాష్ట్రాల అనుమతి లేకుండా ఐఏఎ్‌సలను కేంద్ర డెప్యుటేషన్‌కు తీసుకోవాలనుకోవడం తప్పే. ఆ అధికారి ఒప్పుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతించాలి. కేంద్రమే ఏకపక్షంగా తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పు. రాష్ట్రాల నుంచి ఐఏఎస్‌లు కేంద్రానికి వెళ్లడం రాష్ట్రాలకే ప్రయోజనకరం. రాష్ట్రం నుంచి ఎంత మంది ఐఏఎ్‌సలు కేంద్రంలో ఉంటే అంత మేలు జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలు ఐఏఎస్‌లను పంపడానికి ఇష్టపడవు. ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ మందిని పంపిస్తున్నాయి. 

- జయ ప్రకాశ్‌ నారాయణ


విరమించుకోవాలి

రాష్ట్రాల సమ్మతి లేకుండా ఐఏఎ్‌సలను తీసుకుంటామనడం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్‌... ‘ఇండియా షల్‌ బి ఎ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అని చెబుతోంది. అంటే రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న దేశంలో రాష్ట్రాల హక్కులను పరిరక్షించాల్సి ఉంటుంది. కానీ... కేంద్రమే పెత్తనం చేసేలా రాష్ట్రాల నుంచి ఐఏఎ్‌సలను ఏకపక్షంగా తీసుకుంటామనడం సరికాదు. ఇలాంటి ఆలోచనను విరమించుకోవాలి.

- వినోద్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌

 

Updated Date - 2022-01-21T07:54:42+05:30 IST