ఆఫీసులో దీక్ష చేస్తే అరెస్టు చేశారా?

ABN , First Publish Date - 2022-01-09T09:08:00+05:30 IST

ఆఫీసులో దీక్ష చేస్తే అరెస్టు చేశారా?

ఆఫీసులో దీక్ష చేస్తే అరెస్టు చేశారా?

బండి సంజయ్‌కి ప్రధాని మోదీ ఫోన్‌ 

హైదరాబాద్‌, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ‘సంజయ్‌..! కైసే హై? ఆప్‌ కే ఊపర్‌ బార్‌ బార్‌ ఐసా క్యోం హో రహా హై..!(మీపై ఎందుకు పదే పదే దాడులు జరుగుతున్నాయ్‌?)’ అని ప్రధాని మోదీ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఫోన్‌ చేసి ఆరా తీశారు. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రధాని కార్యాలయం నుంచి సంజయ్‌కి ఫోన్‌ వచ్చింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. సంజయ్‌తో సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడారు. ఇటీవల కరీంనగర్‌లో ఆయన అరెస్టుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. జీవో 317తో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని, గుండెపోటుతో ఇద్దరు మరణించారని, ఈ జీవోను సవరించాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని సంజయ్‌ ప్రధానికి వివరించారు. వారికి సంఘీభావంగా తాను ఈ నెల 2న జాగరణ దీక్ష చేపడితే పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేసి జైలు కు పంపించారని చెప్పారు. ఎక్కడ?అని ప్రధాని ప్రశ్నించగా..తన కార్యాలయంలో అని సంజయ్‌ వివరించారు. ఎంపీ ఆఫీసులో దీక్ష చేస్తే అరెస్టు చేశారా? అని మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనకు జైలుకు వెళ్లడం కొత్తకాదని, ఇప్పటికి 8 సార్లు వెళ్లానని సంజయ్‌ వివరించారు. మీ పోరాటం బాగుంది.. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించండి.. అని మోదీ.. సంజయ్‌కి సూచించారు.

Updated Date - 2022-01-09T09:08:00+05:30 IST