టీఆర్‌ఎస్‌కు ‘నవంబరు’ గండం!

ABN , First Publish Date - 2021-11-03T10:09:35+05:30 IST

అధికార టీఆర్‌ఎస్‌కు ‘నవంబరు’ నెల కలిసిరావడం లేదా? టీడీపీ ఆగస్టు సంక్షోభాలను ఎదుర్కొన్నట్లే..

టీఆర్‌ఎస్‌కు ‘నవంబరు’ గండం!

  • గత ఏడాది దుబ్బాక, ప్రస్తుతం హుజూరాబాద్‌లో అధికార పార్టీకి ఓటములు
  • బీజేపీకి కలిసివచ్చిన నవంబరు నెల
  • ప్రతి ఉప ఎన్నికలోనూ డీలా పడ్డ కాంగ్రెస్‌


హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): అధికార టీఆర్‌ఎస్‌కు ‘నవంబరు’ నెల కలిసిరావడం లేదా? టీడీపీ ఆగస్టు సంక్షోభాలను ఎదుర్కొన్నట్లే.. టీఆర్‌ఎస్‌ నవంబరు నెలలో ఉప ఎన్నికల గండాన్ని ఎదుర్కొంటోందా? ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇదే ప్రచారం జరుగుతోంది. గత ఏడాది దుబ్బాక ఉప ఎన్నిక, తాజాగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓటమి నేపథ్యంలో ఈ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రెండింట్లోనూ అధికార టీఆర్‌ఎస్‌ తమ సిటింగ్‌ సీట్లను కోల్పోగా, బీజేపీ కైవసం చేసుకుంది. ఈ రూపంలో నవంబరు నెల ఉప ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు చేదు అనుభవాలను మిగిల్చితే.. బీజేపీకి మాత్రం తీపి జ్ఞాపకాలను మిగిల్చా యి.


అయితే, ఈ ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఒకవేళ సెంటిమెంట్‌గానే భావించాల్సి వస్తే.. ఫలితాలు వెలువడ్డ రోజును కాకుండా పోలింగ్‌ జరిగిన రోజును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ నవంబరు 3న జరగగా, హుజూరాబాద్‌ పోలింగ్‌ అక్టోబరు 30న జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉప ఎన్నికలు కాంగ్రెస్‌కు కలిసిరావనే సెంటిమెంటు బలపడుతోంది. తెలంగాణ ఏర్పడ్డాక పాలేరు, నారాయణఖేడ్‌, హుజూర్‌నగర్‌, దుబ్బాక, నాగార్జున సాగర్‌, హుజూరాబాద్‌ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే అన్నింట్లోనూ కాంగ్రెస్‌కు ఓటమే ఎదురైంది. సిటింగ్‌ స్థానాలైన పాలేరు, నారాయణఖేడ్‌, హుజూర్‌నగర్‌నూ కోల్పోయింది. 


అసెంబ్లీలో బలపడుతున్న బీజేపీ

2018 ఎన్నికల్లో 19 శాసనసభ స్థానాలను గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన కాంగ్రెస్‌ బలం.. అనంతర పరిణామాలతో తగ్గుతూ వస్తుండగా, బీజేపీ తన సభ్యులను పెంచుకుంటూ వస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నిక కావడంతో అప్పటిదాకా ఆయన ప్రాతినిథ్యం వహించిన హుజూర్‌నగర్‌ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో కాంగ్రెస్‌ బలం 18కి పడిపోయింది. తర్వాత కాంగ్రెస్‌ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు చీలిపోయి టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం కావడంతో ఆ సంఖ్య ఆరుగురికి పడిపోయింది. ఆ తర్వాత జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో సిట్టింగ్‌ స్థానాన్నీ కోల్పోయింది. కాగా.. బీజేపీ తరఫున 2018 ఎన్నికల్లో రాజాసింగ్‌ ఒక్కరే గెలిచినా.. గత ఏడాది దుబ్బాకలో రఘునందన్‌రావు, తాజాగా హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ గెలవడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 3కు పెరిగింది.

Updated Date - 2021-11-03T10:09:35+05:30 IST