అన్ని ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తా: అన్వితా రెడ్డి

ABN , First Publish Date - 2022-05-26T11:34:11+05:30 IST

పంజాగుట్ట, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని అన్ని ఖండాల్లో ఉన్న ఎత్తెన పర్వతాలన్నింటినీ అధిరోహించడమే తన లక్ష్యమని పర్వతారోహకురాలు పడమటి

అన్ని ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను   అధిరోహిస్తా: అన్వితా రెడ్డి

పంజాగుట్ట, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని అన్ని ఖండాల్లో ఉన్న ఎత్తెన పర్వతాలన్నింటినీ అధిరోహించడమే తన లక్ష్యమని పర్వతారోహకురాలు పడమటి అన్వితా రెడ్డి తాజాగా వెల్లడించారు. భువనగిరి జిల్లా ఎర్రంబల్లి చెందిన అన్విత చదువులో ఎంబీఏ పూర్తి చేశారు. ఆమె తండ్రి మధుసూదన్‌ రైతు కాగా అమ్మ చంద్రకళ భువనగిరిలోని అంగన్‌వాడీలో పనిచేస్తున్నారు. ఇటీవల అన్విత ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి బుధవారం నగరానికి చేరుకున్న సందర్భంగా అన్వితా గ్రూప్‌ అధినేత అచ్యుత రావు, ఇతర సిబ్బంది ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎర్రమంజిల్‌లో  మీడియాతో  అన్విత మాట్లాడారు. ‘‘17ఏళ్ల నుంచే నాకు పర్వతారోహణపై ఆసక్తి కలిగింది. భువనగిరిలోని రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌లో బేసిక్‌, ఇంటర్మీడియట్‌, అడ్వాన్స్‌, ఇన్‌స్ట్రక్టర్‌ శిక్షణను పూర్తి చేసి, పర్వతారోహణ సంస్థల్లో ప్రాథమిక, అడ్వాన్స్‌ కోర్సులను పూర్తి చేశాను. అన్వితా గ్రూప్‌లో మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న నాకు మా సంస్థ యాజమాన్యం స్పాన్సర్‌గా నిలిచింది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు ఏప్రిల్‌ మొదటి వారంలో నేపాల్‌కు చేరుకున్నా. అక్కడనుంచి ఎవరెస్ట్‌ శిఖరారోహణను ప్రారంభించాను. 9 రోజుల తర్వాత గత నెల 17న 5300ఎత్తులో ఉన్న మాచ్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నాను. తర్వాత 7,100 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాను. ఈ నెల 12న బేస్‌ క్యాంప్‌ నుండి ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించి, 16న ఉదయం 9.30 గంటలకు శిఖరాన్ని (8848.86 మీటర్లు) చేరుకుని నా కల సాకారం చేసుకున్నాను. గత ఏడాది జనవరిలో ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన కిలిమంజారోను, డిసెంబరులో ఐరోపా ఖండంలోనే ఎత్తెన మౌంట్‌ ఎల్‌బ్ర్‌సను అధిరోహించాను. నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న అన్వితా గ్రూప్‌కు నా కృతజ్ఞతలు’’ అని అన్విత పేర్కొన్నారు. 


Updated Date - 2022-05-26T11:34:11+05:30 IST