కు.ని ఆపరేషన్ల ఘటనలో 2 రోజుల్లో చర్యలు

ABN , First Publish Date - 2022-09-23T08:43:43+05:30 IST

కు.ని ఆపరేషన్ల ఘటనలో 2 రోజుల్లో చర్యలు

కు.ని ఆపరేషన్ల ఘటనలో 2 రోజుల్లో చర్యలు

తుది దశకు ఎంఎన్‌జే ఆస్పత్రి నూతన భవనం: మంత్రి హరీశ్‌ 


మంగళ్‌హాట్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు బాలింతలు చనిపోయిన ఘటనలో నివేదిక అందిందని, బాధ్యులపై రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో మరో 300 పడకల ఏర్పాటు కోసం నిర్మిస్తున్న భవనం తుది దశకు చేరుకుందని, వచ్చే నెల 15న ప్రారంభిస్తామని పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రిలో వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వెంటనే 100 మంది వైద్యులు, స్టాఫ్‌ నర్సులను నియమించుకోవాలని, అందుకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డైరెక్టర్‌ను ఆదేశించామని వెల్లడించారు. అమెరికాలో ఉన్న ప్రముఖ ఆంకాలజిస్ట్‌ అద్దంకి శరత్‌ తమ ట్రస్ట్‌ ఎస్‌ఎంఆర్‌ఐ ద్వారా ఎంఎన్‌జే నూతన భవనంలో పారిశుధ్యం, సెక్యూరిటీ, హౌస్‌ కీపింగ్‌ పనుల నిర్వహణకు సిబ్బందిని నియమించి.. మూడేళ్ల పాటు ఉచితంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ సైతం సహకారాన్ని అందిస్తామని చెప్పారన్నారు.

Updated Date - 2022-09-23T08:43:43+05:30 IST