విద్యుత్తు సంస్కరణలతో రైతులకు నష్టం

ABN , First Publish Date - 2022-09-23T09:23:22+05:30 IST

విద్యుత్తు సంస్కరణలతో రైతులకు నష్టం

విద్యుత్తు సంస్కరణలతో రైతులకు నష్టం

కరెంట్‌ కంపెనీలను కార్పొరేట్‌ పరం చేసే కుట్ర

మోదీ చేతగానితనం వల్లే ద్రవ్యోల్బణం పెరిగింది

రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది: కేటీఆర్‌


సిరిసిల్ల, సెప్టెంబరు 22 (ఆంరఽధజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కుట్రలు ఫలించి విద్యుత్‌ సంస్కరణలు అమల్లోకి వస్తే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రైతులు ఎక్కువగా నష్టపోతారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గల్లీగల్లీకో విద్యుత్‌ కంపెనీ పుట్టుకొస్తే.. పెట్రోల్‌ ధరల మాదిరిగా రోజుకో తీరులో కరెంటు చార్జీలు ఉంటాయని పేర్కొన్నారు. రైతులను చావుదెబ్బ కొట్టి విద్యుత్‌ కంపెనీలను తన కార్పొరేట్‌ మిత్రులకు అప్పగించేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని ఆరోపించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో లక్షల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉండగా, టన్ను రూ.35వేలు ఖర్చు పెట్టి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని చెబుతున్నారని అన్నారు. మోదీ కార్పొరేట్‌ మిత్రులు బొగ్గు వ్యాపారంలోకి దిగడమే ఇందుకు కారణమని ఆరోపించారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి విద్యుత్‌ ఊపిరిగా ఉందని, ఇక్కడ 26 లక్షల పంపుసెట్లు ఉన్నాయని గుర్తు చేశారు. దొడ్డిదారిన తీసుకువస్తున్న నోటిఫికేషన్ల వల్ల వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లడమే కాక రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు దివాలా తీస్తాయని అన్నారు. సిరిసిల్ల వంటి విద్యుత్‌ ఆధారిత కుటీర పరిశ్రమలపై అధారపడ్డ నేత కార్మికులకు అందిస్తున్న 50శాతం సబ్సిడీ, రజకులు, నాయీబ్రాహ్మణులకు అందించే సబ్సిడీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. యాసంగి వడ్లు కొనమంటే నాలుగేళ్లకు సరిపడే నిల్వలు ఉన్నాయని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు సిగ్గు లేకుండా దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందంటూ బియ్యం, నూకల ఎగుమతులను నిషేధించిందన్నారు. తాజాగా ధాన్యం సేకరణను కూడా ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం బలంగా జరుగుతోందన్నారు. మోదీ చేతగానితనం వల్లే గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి ద్రవ్యోల్బణం చేరిందని, రూపాయి విలువ పాతాళానికి పడిపోయిందని విమర్శించారు. ప్రపంచ ఆహార సూచీలోబంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ కంటే హీనంగా 101 స్థానంలో భారత్‌ ఉండడం బాధాకరమని అన్నారు. కార్పొరేట్‌ మిత్రులకు 12లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీకి.. 1.45లక్షల కోట్లతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు మనస్సు రావడం లేదని దుయ్యబట్టారు. పేదలను దంచి పెద్దలకు పంచే విధంగా జరుగుతున్న కుట్రలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కాగా, సిరిసిల్ల నేతన్నలు తయారు చేసిన కోటి చీరలను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులకు అందించడం గర్వకారణమని కేటీఆర్‌ అన్నారు. గతంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడేదని గుర్తు చేశారు. బతుకమ్మ చీరలే కాకుండా స్కూల్‌ యూనిఫాంలు, ఇతర ఆర్డర్లు అందించడంతో సిరిసిల్ల కార్మికులకు ప్రతి నెలా రూ.16-20వేల వరకు వేతనాలు అందుతున్నాయన్నారు.


మందు పంచలేదు.. పైసలివ్వలేదు

సిరిసిల్లలో నాలుగు ఎన్నికల్లో కొట్లాడానని, ఎన్నడూ మందు పంచలేదని, పైసలు ఇవ్వలేదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అడ్డమైన ఖర్చులు పెట్టడం కంటే పేదలకు మంచి పనులు చేయడంలో రాజకీయ నాయకులు పోటీపడాలని సూచించారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు గి్‌ఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద ట్యాబ్‌లను అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తన వంతుగా విద్యార్థులకు సహాయం చేస్తున్నానని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా సాయం అందించాలని కోరారు.  


తెలంగాణ బీజేపీ జోకర్లకు దమ్ము లేదు 

హైదరాబాద్‌: కేంద్రం చర్యలతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతున్నా.. ఇక్కడి బీజేపీ జోకర్లకు నిలదీసే దమ్ము లేదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌కు మంజూరైన ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌, డబ్ల్యూహెచ్‌వో సెంటర్‌ ఇప్పటికే గుజరాత్‌కు తరలించారని ఆరోపించారు. గుజరాతీ చిత్రం కారణంగా తెలుగు చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆస్కార్‌కు వెళ్లే అవకాశం దక్కలేదని మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌ చేసిన ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందించారు. ఇక్కడి బీజేపీ జోకర్లు గుజరాతీల చెప్పులు మోసేందుకు సిద్ధంగా ఉంటారే గానీ.. తెలంగాణ హక్కుల కోసం ప్రశ్నించే ధైర్యం లేదని విమర్శించారు.

Updated Date - 2022-09-23T09:23:22+05:30 IST