ఎన్టీఆర్‌, వైఎస్‌ సమాన స్థాయి నేతలా?

ABN , First Publish Date - 2022-09-23T08:33:20+05:30 IST

ఎన్టీఆర్‌, వైఎస్‌ సమాన స్థాయి నేతలా?

ఎన్టీఆర్‌, వైఎస్‌ సమాన స్థాయి నేతలా?

తప్పును తప్పని ఎత్తిచూపించలేరా?

కుటుంబ సభ్యుడి స్పందన ఇలాగేనా?

జాణతనమే తప్ప.. నిజాయితీ లేదు

జూ.ఎన్టీఆర్‌ ట్వీట్‌పై టీడీపీలో అసంతృప్తి

షర్మిల స్పందన బాగుందన్న నేతలు


అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై సినీ హీరో, నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్‌ ఎన్టీఆర్‌ చేసిన ట్వీట్‌ టీడీపీ వర్గాలకు అసంతృప్తి కలిగించింది. ఎన్టీఆర్‌, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాన స్థాయి నాయకులన్నట్లుగా జూనియర్‌ మాట్లాడటం దారుణంగా ఉందని.. ఆయన కంటే వైఎస్‌ కుమార్తె షర్మిల స్పందన మరింత మెరుగ్గా ఉందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వర్సిటీ పేరు మార్పుపై జూనియర్‌ ఎన్టీఆర్‌ గురువారం ట్వీట్‌ చేశారు. గవర్నర్‌ను కలిసే నిమిత్తం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు గురువారం రాజ్‌భవన్‌కు వచ్చినప్పుడు అక్కడ విరామ సమయంలో ఈ ట్వీట్‌ వారి మధ్య చర్చకు వచ్చింది. అక్కడున్న నాయకులంతా దానిని తప్పుబట్టారు. ‘తప్పును తప్పుగా ఎత్తిచూపగలిగితే చూపాలి. లేకపోతే ఊరుకోవాలి. ఎన్టీఆర్‌, వైఎ్‌సఆర్‌ ఇద్దరినీ పొగడుతూ ఇద్దరూ సమాన స్థాయి నాయకులన్నట్లుగా మాట్లాడడం ఏమిటి? ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుడిగా మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా? జాణతనం ప్రదర్శించినట్లుగా ఉంది తప్ప నిజాయితీ లేదు’ అని ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. వైఎస్‌ కుమార్తె అయి ఉండి కూడా షర్మిల మరింత మెరుగ్గా స్పందించారని, పేరు మార్పు తప్పని ఆమె కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారని, ఆ పాటి ధైర్యం కూడా జూనియర్‌ ప్రదర్శించలేకపోయారని మరో నేత అన్నారు. ఎన్టీఆర్‌ వారసుడిగా తనను తాను చూపించుకోవాలన్న తాపత్రయం తప్ప ఆ తెగువ జూనియర్‌లో లేదని మరో నాయకుడు అన్నారు. టీడీపీ అభిమానులు, కార్యకర్తల గ్రూపుల్లో కూడా ఈ ట్వీట్‌ తీవ్ర విమర్శలకు గురైంది. ఎన్టీఆర్‌కు ఒక మనుమడైన లోకేశ్‌ పోరాట పటిమ చూపిస్తుంటే మరో మనుమడు జూనియర్‌ పిరికితనం ప్రదర్శిస్తున్నారని ఒక అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ సోదరుడు నందమూరి కల్యాణ్‌రాం పేరు మార్పుపై ఒకింత ఘాటుగా స్పందించారు. ‘ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా పాతికేళ్లుగా ఉనికిలో ఉన్న ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం చాలా మంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు. ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది. తెలుగు రాష్ట్రాల్లో వైద్య అధ్యయనం మెరుగుదలకు ఎన్టీఆర్‌ చేసిన కృషిని స్మరించుకోవడానికి దీనికి ఆయన పేరు పెట్టారు’ అని పేర్కొన్నారు. 


పేరు మార్చి ఎన్టీఆర్‌ స్థాయిని తగ్గించలేరు: జూనియర్‌

డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం పేరును మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. గురువారం ఆయన తన ట్విటర్‌ ఖాతాలో... ‘‘ఎన్‌టీఆర్‌, వైఎ్‌సఆర్‌ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎ్‌సఆర్‌ స్థాయిని పెంచదు. ఎన్‌టీఆర్‌ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్‌టీఆర్‌ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేదు’’ అని ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2022-09-23T08:33:20+05:30 IST