ఫీజు కోసం తప్పుడు నివేదికలు

ABN , First Publish Date - 2022-09-23T07:56:49+05:30 IST

ఫీజు కోసం తప్పుడు నివేదికలు

ఫీజు కోసం తప్పుడు నివేదికలు

కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు సమర్పించినట్టు గుర్తించిన టీఏఎ్‌ఫఆర్‌సీ

తక్కువ ఆదాయం, ఎక్కువ వ్యయం చూపినట్టుగా గుర్తింపు 

ఫీజులు తగ్గించాలని అధికారుల సూచన 

ససేమిరా అంటున్న కాలేజీల యాజమాన్యాలు!


హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఫీజులను పెం చుకోవడానికి  కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు తప్పుడు ఆడిట్‌ నివేదికలను సమర్పించినట్టు తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎ్‌ఫఆర్‌సీ) గుర్తించింది. వచ్చే ఆదాయాన్ని తక్కువగా, వ్యయాన్నిఎక్కువగా చూపినట్టు తెలుస్తోంది. ఆడిట్‌ నివేదికల్లో లోపాలను గుర్తించిన టీఏఎ్‌ఫఆర్‌సీ అధికారులు.. ఆ మేరకు ఫీజులను తగ్గించుకోవాలంటూ ఆయా కాలేజీలకు సూ చిస్తున్నాయి. అయితే ఇందుకు కాలేజీలు మాత్రం అంగీకరించడంలేదని సమాచారం. దీంతో తామే ఫీజులను ఖరారు చేయాలన్న నిర్ణయానికి అధికారులు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వృత్తి విద్యా ఫీజులను వచ్చే మూడేళ్ల (2022-23, 2023-24, 2024-25) కోసం ఈ ఏడాది కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందుకోసం టీఏఎ్‌ఫఆర్‌సీ ఇంతకుముందే పలుమార్లు సమావేశాలను నిర్వహించి కాలేజీలతో సంప్రదింపులు జరిపిం ది. కాలేజీల ఫీజు ప్రతిపాదనలను పరిశీలించి ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా ఫీజులను ఖరారు చేసే అంశంపై కసరత్తు పూర్తి చేసింది. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో కనీస ఫీజు రూ.35 వేల నుంచి రూ.45 వేలకు, గరిష్ఠ ఫీజు రూ.1.34 లక్షల నుంచి రూ. 1.73 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదించారు. కానీ ఆ తర్వాత టీఏఎ్‌ఫఆర్‌సీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆగస్టు 1న ఈ ఏడాది ఫీజులను పెంచకూడదని నిర్ణయించింది. దీంతో పలు ఇంజనీరింగ్‌ కాలేజీలు కోర్టును ఆశ్రయించి ఫీజు ల పెంపు ప్రతిపాదనలను అమ లు చేయడానికి వీలుగా అనుమతి పొందాయి. దీంతో ఆడిట్‌ నివేదికలను మళ్లీ పరిశీలించాలని టీఏఎ్‌ఫఆర్‌సీ నిర్ణయించింది.శుక్రవారంతో ఇవి ముగిసే అవకాశం ఉంది. ఫీజులను పెం చుకోవాలన్న ఉద్దేశంలో కొన్ని కాలేజీలు తప్పుడు లెక్కలను సమర్పించినట్టు అధికారుల దృష్టికివచ్చింది. ఆదాయాన్ని తగ్గిం చి, వ్యయాన్ని ఎక్కువగా చూపినట్టు గుర్తించారు. వీటిని సరిచేయాలని, ఫీజులనూ తగ్గించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధిత కాలేజీలు అంగీకరించడంలేదని తెలుస్తోంది.గతంలో ఉన్న ఫీజుల కంటే కొంత ఎక్కువగా.. మొన్న ప్రతిపాదించిన ఫీజుల కంటే కొంత తక్కువగా ఫీజులను ఖరారు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. అంటే కోర్టు ద్వారా అనుమతి పొందిన ఫీజుల కంటే కొంత మేర తగ్గిం చే అవకాశం ఉంది. కాగా, ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం ఇప్పటి కే మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజులు కూడా చెల్లించారు. పెంచిన ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకపోవడం వల్ల ఆన్‌లైన్‌లో పా త ఫీజులనే చెల్లించారు. అయితే విద్యార్థులు కాలేజీల్లో చేరే నా టికి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోతే పెంచిన ఫీజులను  చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 28 నుంచి రెండో దశ కౌన్సెలింగ్‌  మొదలుకానుంది. 


అప్పుడే సరిగ్గా పరిశీలించి ఉంటే.. 

ఇంజనీరింగ్‌ ఫీజులను ఖరారు చేయాల్సి ఉండడంతో టీఏఎ్‌ఫఆర్‌సీ ఐదు నెలల క్రితం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫీజుల ఖరారుపై వరుసగా సమావేశాలు నిర్వహించింది. కాలేజీల అడిట్‌ నివేదికల పరిశీలన, సంప్రదింపుల ప్రక్రియలు పూర్తయ్యాక ఏ కాలేజీ ఫీజు ఎంత పెంచాలనే వి షయంలో స్పష్టత ఇచ్చారు. ఆయా కాలేజీల యజమాన్యాలతో అంగీకార పత్రాలపై సంతకాలూ చేశారు.


హఠాత్తుగా ఆగస్టు 1న టీఏఎ్‌ఫఆర్‌సీ ఈ ఏడాది ఫీజులను పెంచకూడదని నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సమర్పించింది. ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


సాధారణంగా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకావడానికి ముందే ఫీజుల ఖరారుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో టీఏఎ్‌ఫఆర్‌సీ, ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. అందుకే ఈ అంశం కోర్టుల వరకు వెళ్లిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఆగస్టు 21న ప్రారంభమైంది. ఈ నెల 6నవిద్యార్థులకు ఇంజనీరింగ్‌ సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు కాలేజీల్లో చేరే గడువు ఈ నెల 13తో ముగిసింది. ఇప్పటికీ ఫీజు అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఫీజుల ఖరారుపై తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది.


 ఫీజులు పెంచుకోవడానికి కోర్టు ద్వారా అనుమతి పొందిన కాలేజీలు వాటిని అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఆడిట్‌ నివేదికల పరిశీలన కోసం టీఏఎ్‌ఫఆర్‌సీ అధికారులు కాలేజీల్లో మరోసారి సమావేశాలను నిర్వహిస్తుండటం గమనార్హం. గతంలో కాలేజీలు సమర్పించిన ఆడిట్‌ నివేదికలనే మరోసారి పరిశీలిస్తున్నారు. ఈ నివేదికల్లో తప్పులున్నాయని, దాంతో ఫీజులను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియను మొదటిసారే సరిగ్గా నిర్వహించి ఉంటే ఇప్పుడీ సమస్య ఉత్పన్నమయ్యేది కాద న్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2022-09-23T07:56:49+05:30 IST