‘సూది’ హత్యలకు ఒకే ఆస్పత్రి నుంచి మత్తుమందు!

ABN , First Publish Date - 2022-09-23T08:02:14+05:30 IST

‘సూది’ హత్యలకు ఒకే ఆస్పత్రి నుంచి మత్తుమందు!

‘సూది’ హత్యలకు ఒకే ఆస్పత్రి నుంచి మత్తుమందు!

హంతకులిద్దరికీ సరఫరా చేసింది ఒక్కరే!..

ఆస్పత్రుల నిర్లక్ష్యంవల్లే బయటకు మత్తుమందు

ప్రైవేట్‌ ఆస్పత్రులపై కొరవడిన నిఘా


ఖమ్మం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ల సమయంలో వినియోగించే మత్తుమందులు ఇప్పుడు హత్యాయుధాలుగా మారుతున్నాయి. ఆస్పత్రి యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉండడంతో కిందిస్థాయి సిబ్బంది వాటిని బయట అమ్మేసుకుంటున్నారు. ఫలితంగానే ఖమ్మం జిల్లాలో రెండు సూది హత్యలు జరిగాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనల్లో నిందితులకు ఒకే ఆస్పత్రి నుంచి మత్తు మందులు బయటకు వచ్చాయని తెలుస్తోం ది. ఇటీవల చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్‌ సాహెబ్‌ను బండి వెంకన్న అనే ఆర్‌ఎంపీ వైద్యుడు మత్తు ఇంజక్షన్‌ చేసి హతమార్చాడు. రెండు నెలల క్రితమే మత్తుమందు కోసం ఖమ్మంలోని శశి ఆస్పత్రిలో పనిచేస్తున్న పోరళ్ల సాంబశివరావును బండి వెంకన్న సంప్రదించాడు. సాంబశివరావు ఆరాధ్య ఆస్పత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బందెల యశ్వంత్‌ ద్వారా రెండు మత్తు ఇంజక్షన్లను తెప్పించి వెంకన్నకు ఇచ్చాడు. మరొక ఘటనలో భిక్షం అనే వ్యక్తి తన భార్య నవీనను ప్రసవం కోసం మరో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడే ఎవరికీ తెలియకుండా భార్యకు మత్తు మందు ఇంజెక్షన్‌ ఇచ్చి హత్యచేశాడు. భిక్షం ఆరాధ్య ఆస్పత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడు కూడా యశ్వంత్‌ దగ్గరనుంచే మత్తు ఇంజెక్షన్లు తీసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆపరేషన్‌ చేసే ముందు వినియోగించే మత్తు మందుల విషయంలో నిఘా లేదని ఈ రెండు ఘటనలతో స్పష్టమవుతోంది. వాస్తవానికి మత్తు మందులు డీలర్లనుంచి కొనుగోలు చేసే ఆస్పత్రి యాజమాన్యాలు రిజిస్టర్‌ ద్వారా  ఆ వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. కానీ ఆస్పత్రి యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.


పోలీసులు ముందే వెల్లడించి ఉంటే...

జూలై 31 తెల్లవారుజామున నవీన మరణించింది. వైద్యం చేయకపోవడంవల్లే తన భార్య చనిపోయిందని భిక్షం నాటకమాడాడు. కేసు పెడతానంటూ ఆస్పత్రి యాజమాన్యాన్ని బెదిరించి రూ.4 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. కొన్ని రోజులకు ఆస్పత్రి యాజమాన్యానికి అనుమానం వచ్చి సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు భిక్షంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. కానీ పదిరోజుల క్రితం అతడిని అరెస్టు చేసిన విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. అప్పుడే ఆ విషయం వెలుగులోకి వచ్చి ఉంటే జమాల్‌సాహెబ్‌ హత్యకు పథకం పన్నుతున్న ఇమాంబీ, ఇతర నిందితులు వెనకడుగు వేసేవారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2022-09-23T08:02:14+05:30 IST