జూనియర్లకు పదోన్నతులు!

ABN , First Publish Date - 2020-08-12T09:29:52+05:30 IST

జూనియర్లకు పదోన్నతులు!

జూనియర్లకు పదోన్నతులు!

ఎక్సైజ్‌ శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రమోషన్లలో నిబంధనలకు పాతర


హైదరాబాద్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌ శాఖ పదోన్నతుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు కల్పించడంలో నిబంధనలకు పాతర వేస్తున్నారు. ఎప్పటినుంచో అమల్లో ఉన్న వయసు రీత్యా సీనియారిటీ నిబంధనను కాదని, కొత్తగా మెరిట్‌ నిబంధనతో పదోన్నతులు కల్పిస్తున్నారు. దీంతో జూనియర్లకు పదోన్నతులు లభిస్తున్నాయని, 24 ఏళ్లుగా పని చేస్తున్నా... తమకు జమేదార్‌(హెడ్‌ కానిస్టేబుల్‌) పోస్టు లభించడం లేదని సీనియర్‌ కానిస్టేబుళ్లు వాపోతున్నారు. వివిధ బెటాలియన్ల కోసం 1995లో ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ పోలీస్‌ కమిషన్‌ 3000 మంది వరకు కానిస్టేబుళ్లను ఎంపిక చేసింది. వీరిలో 2151 మంది కానిస్టేబుళ్లు 1996లో డిప్యుటేషన్‌పై ఎక్సైజ్‌ శాఖకు వచ్చారు. వీరిని తిరిగి పోలీసు శాఖ తీసుకోలేదు. డిప్యుటేషన్‌పై ఉన్నందున.. ఎక్సైజ్‌ శాఖలో ఎలాంటి ప్రమోషన్లూ లభించలేదు. దాంతో వీరు కోర్టు మెట్లెక్కడంతో ఎక్సైజ్‌ శాఖ.. కానిస్టేబుళ్లందరినీ తనలో విలీనం(మెర్జ్‌) చేసుకుంటూ 2007 ఆగస్టు 17న జీవో నంబర్‌ 1103ను జారీ చేసింది. అయితే... ఎక్సైజ్‌ శాఖలో అప్పటికే ఉన్న డిపార్ట్‌మెంటల్‌ కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతులు కల్పించాకే తాము ప్రమోషన్లు తీసుకుంటామన్న షరతుపై విలీనమయ్యారు. ఆ మేరకు జిల్లాల్లో సీనియారిటీ ఆధారంగా ఎక్సైజ్‌ శాఖలోని కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించారు. బెటాలియన్ల నుంచి వచ్చిన కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించే ప్రక్రి య ఎనిమిదేళ్ల నుంచి కొనసాగుతోంది. జిల్లా యూ నిట్‌గా వయసు సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 50మంది కానిస్టేబుళ్లు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు పొందారు. అయితే.. ఇటీవల కొంతమంది కానిస్టేబుళ్ల సంఘం నేతలు జోక్యం చేసుకుని వయసు రీత్యా సీనియారిటీ నిబంధనను పక్కన పెట్టించారు. మెరిట్‌ ప్రాతిపదికన ప్రమోషన్‌ ఇచ్చే నిబంధనను అమల్లోకి తెప్పించారు. ఎక్సైజ్‌ కమిషనరేట్‌లో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న ఓ సహకార శాఖ అధికారిణి, కానిస్టేబుళ్ల సంఘం నేతలు కలిసి ఈ నిబంధనను అమల్లోకి తెచ్చారనే ఆరోపణలున్నాయి. కానిస్టేబుళ్ల ఎంపిక సందర్భంగా చేపట్టిన ఈవెంట్‌(హై జంప్‌, లాంగ్‌ జంప్‌) వంటి పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చినవారికి పదోన్నతులు ఇచ్చేలా నిబంధనను మార్పించారు. 


మెరిట్‌ ప్రాతిపదిక కారాదు..!

నిజానికి మెరిట్‌ను అపాయింట్ల కోసం మాత్రమే వినియోగించాలని, పదోన్నతుల్లో వయసు సీనియారిటీనే ప్రాతిపదికగా తీసుకోవాలనే నిబంధన ఎక్సైజ్‌లో ఉంది. అప్పట్లో రాత పరీక్ష లేనందున.. మెరిట్‌ అనేది ప్రాతిపదిక కానేకాదని కానిస్టేబుళ్లు చెబుతున్నారు. ఈ మెరిట్‌ నిబంధనను ముందుకు తేవడంతో సీనియర్లకు పదోన్నతులు లభించడం లేదు. జూనియర్‌ కానిస్టేబుళ్లు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు పొం దుతున్నారు. ఈ అధికారం జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లకు ఉండడంతో వారు ఎప్పటికప్పుడు ప్రమోష న్లు కల్పిస్తున్నారు. తమకు పదవీ విరమణ వయసు దగ్గర పడుతున్నా ప్రమోషన్‌ రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న కానిస్టేబుళ్లు.. న్యాయం చేయాలంటూ  ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ను కలిసి కోరారు.

Updated Date - 2020-08-12T09:29:52+05:30 IST