బత్తాయి కొనుగోళ్లపై చేతులెత్తేసిన సర్కారు!

ABN , First Publish Date - 2020-04-10T07:16:35+05:30 IST

నల్లగొండ, పాలమూరు బత్తాయిలను గ్రేటర్‌ హైదరాబాద్‌కు సరఫరా చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు బ్రేక్‌ పడింది. రైతుల నుంచి బత్తాయి ప్రొక్యూర్‌మెంట్‌...

బత్తాయి కొనుగోళ్లపై చేతులెత్తేసిన సర్కారు!

హైదరాబాద్‌కు సరఫరా చేసే ఆలోచనకు బ్రేక్‌

కేంద్రం పరిధిలోని అంశమన్న మంత్రి సింగిరెడ్డి

ధర తక్కువైనా రైతులు ఓర్చుకోవాలని సలహా


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): నల్లగొండ, పాలమూరు బత్తాయిలను గ్రేటర్‌ హైదరాబాద్‌కు సరఫరా చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు బ్రేక్‌ పడింది. రైతుల నుంచి బత్తాయి ప్రొక్యూర్‌మెంట్‌ చేసి హైదరాబాద్‌లో విక్రయించడం అసాధ్యమని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. రాష్ట్రంలో పండించిన బత్తాయిని ఎగుమతి చేయనీయొద్దని, హైదరాబాద్‌ వాసుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇక్కడే విక్రయించాలన్న సీఎం కేసీఆర్‌ ప్రకటనతో రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం పక్షం రోజులుగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో బత్తాయి రైతుల ఇబ్బందులపై ‘అయ్యో.. బత్తాయి!’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ఓ కథనాన్ని గురువారం ప్రచురించింది. ఈ నేపథ్యంలో మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో బత్తాయి వినియోగం తక్కువ. ఉత్తరాది రాష్ట్రాలకు ఇక్కడి నుంచి ప్రతి సీజన్‌లో బత్తాయి ఎగుమతి అవుతుంది. ఈసారి ఇక్కడే  వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆదేశాల మేరకు ఆ దిశగా ఆలోచించాం. కానీ, ప్రస్తుతం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చాం’’అని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇది ఢిల్లీ, ఉత్తరాది మార్కెట్‌పై ఆధారపడిన అంశమని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వమే తేల్చాలని చెప్పారు. ఈ సారి రేటు తక్కువైనా రైతులు ఓర్చుకోవాలనీ సలహా ఇచ్చారు. టన్నుకు రూ.40-50 వేల ధర పలికే ఈ సీజన్‌లో రూ.10వేలకు పడిపోవటం, కొనుగోలు చేస్తామని చెప్పి రాష్ట్రం వెనుకడుగు వేయడంతో బత్తాయి రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెల 22 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా ఢిల్లీ, కోల్‌కతా, కర్నూలుకు చెందిన వ్యాపారులు నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల రైతులను ఫోన్లలో సంప్రదించారు. ఎగుమతులకు అనుమతి లేదని రైతులు చెప్పటంతో మిన్నకుండిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలకు ఎక్కడి వరకైనా వెళ్లేందుకు పర్మిట్లు ఇస్తామని మంత్రి వారం ప్రకటించారు.

Updated Date - 2020-04-10T07:16:35+05:30 IST