‘రాయలసీమ’ను ఎలాగైనా ఆపాల్సిందే!
ABN , First Publish Date - 2021-07-07T07:53:21+05:30 IST
కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని (ఆర్‌ఎల్‌ఐఎస్) అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారు. జలాల వినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరి.. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉందని ఆక్షేపించారు.
ఏపీ వైఖరితో తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు దెబ్బ
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు రాజీలేని పోరు
‘పర్యావరణ కమిటీ’ అనుమతులిస్తే సుప్రీంకోర్టులో సవాలు
పార్లమెంట్‌లోనూ వాదనలు.. 2015 ఒప్పందానికి కాలం చెల్లింది
నేటి ‘పర్యావరణ కమిటీ’ సమావేశం నేపథ్యంలో కేసీఆర్ సమీక్ష
ప్రగతి భవన్‌లో దాదాపు 6 గంటలపాటు సుదీర్ఘ సమావేశం
పాలమూరు-రంగారెడ్డిపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తికి ఆదేశం
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని (ఆర్‌ఎల్‌ఐఎస్) అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారు. జలాల వినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరి.. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉందని ఆక్షేపించారు. ఆర్‌ఎల్‌ఐఎ్‌సకు అనుమతులు ఇవ్వాలా.. వద్దా? అనే అంశంపై చర్చించేందుకు బుధవారం కేంద్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. నీటి కేటాయింపులు లేకుండా ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతినిస్తే సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను నిర్దేశించారు. కృష్ణా జలాలపై ఏపీ వైఖరిని అడ్డుకోవడానికి రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా తెలంగాణ ఎంపీలు తమ వాణిని వినిపించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని వేదికల మీదా రాజీ లేకుండా పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశారు. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న సాగునీటి వివక్షపై లోతుగా చర్చించారు.
‘ప్రకాశం’ పొంగితేనే మిగులు జలాలు
శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల లోపు నీటిమట్టం ఉంటే పోతిరె డ్డిపాడు నుంచి నీటిని తరలించడానికి అవకాశం ఉండదని, అందుకోసమే శ్రీశైలంలో నిల్వలు పెంచడానికి వీలుగా జలవిద్యుదుత్పత్తిని నిలిపివేయించే కుట్రలను ఏపీ చేస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. శ్రీశైలంలో వరద జలాలను తరలించడానికే ఈ ప్రాజెక్టును కడుతున్నామని ఏపీ చెబుతుండటాన్ని ఆయన తప్పుపట్టారు. శ్రీశైలంలో 215 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీలు, పులిచింతలలో 45 టీఎంసీల నీటి నిల్వ ఉండి... దిగువన ప్రకాశం బ్యారేజీ పొంగుతున్నప్పుడే కృష్ణాలో మిగులు జలాలు ఉన్నట్లు లెక్క అని చెప్పారు.
శ్రీశైలంలో 885 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే వరద జలాలు ఉంటాయని, అలాకాకుండా 797 అడుగుల నీటిమట్టతోనే రాయలసీమను ప్రతిపాదించడంలోనే కుట్ర ఉందని పేర్కొన్నారు. దీంతో నాగార్జునసాగర్ ఆయకట్టు ఎండిపోతుందని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో బచావత్ ట్రైబ్యునల్‌కు అనుగుణంగా 2015లో రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలిక ఒప్పందానికి కాలం చెల్లిందని, దీన్నుంచి బయటికి వచ్చేశామని పేర్కొన్నారు. 811 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణ వాటాను 405.5 టీఎంసీలను కచ్చితంగా వాడుకోవాలని స్పష్టం చేశారు.
రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా...
కృష్ణా జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను రాబట్టుకోవడంతో సహా, తెలంగాణ లిఫ్టులను నడిపించుకునేందుకు జలవిద్యుదుత్పత్తిని కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్స్, న్యాయస్థానాలు సహా అన్నిచోట్ల వాణి వినిపించాలని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను నిర్ధారించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో కేంద్రంపై ఒత్తిడి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందడానికి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం ఖరారు చేశారు. స్వయం పాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితిల్లోనూ రానివ్వకూడదని ఈ సమావేశంలో తీర్మానించారు. కాగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ అనుమతి తీసుకోవడానికి వీలుగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని కేసీఆర్ ఆదేశించారు.
ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలో ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ముందుజాగ్రత్త చర్యగా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిచేసి, పర్యావరణ మంత్రిత్వశాఖకు చెందిన నిపుణుల కమిటీ అనుమతి తీసుకోవాలని నిర్దేశించారు. సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఈఎన్సీ మురళీధర్ రావు, సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఈఏసీ సిఫారసు చేస్తుంది
దాని ఆధారంగానే నిర్ణయం: జావడేకర్
న్యూఢిల్లీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేసే విషయంపై పర్యావరణ నిపుణుల కమిటీ (ఈఏసీ)నే తగిన సిఫారసు చేస్తుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు. పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రాసిన లేఖ గురించి మంగళవారం ఢిల్లీలో జావడేకర్ వద్ద విలేకరులు ప్రస్తావించగా... ‘‘చాలా మంది ముఖ్యమంత్రులు లేఖలు రాస్తుంటారు. కానీ పర్యావరణ అనుమతుల మంజూరీకి ఒక ప్రక్రియ ఉంటుంది. దాన్ని అనుసరించే నిర్ణయాలు జరుగుతాయి’’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాజెక్టుకు అనుమతుల ప్రతిపాదనలు ఈఏసీ పరిశీలనలో ఉన్నాయని, ఆ కమిటీ చేసే సిఫారసు ఆధారంగా తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే, తెలంగాణలో పోడు భూముల సమస్యను విలేకరులు ప్రస్తావించగా... ఈ అంశం తన దృష్టికి వచ్చిందని, దాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.