ఒకపక్క కేసులు భారీగా పెరుగుతోంటే.. ట్రంప్ దేని గురించి మాట్లాడారంటే..

ABN , First Publish Date - 2020-07-03T02:57:31+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా రోజుల తరువాత వైట్‌హౌస్ వేదికగా మీడియా

ఒకపక్క కేసులు భారీగా పెరుగుతోంటే.. ట్రంప్ దేని గురించి మాట్లాడారంటే..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా రోజుల తరువాత వైట్‌హౌస్ వేదికగా మీడియా సమావేశం నిర్వహించారు. అమెరికాలో బుధవారం 50 వేలకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఎన్నడూ ఈ రకంగా కేసులు నమోదు కాలేదు. దీంతో దేశాధ్యక్షుడు కూడా దీనిపైనే మాట్లాడతారని అందరూ అనుకున్నారు. కాని ట్రంప్ మాత్రం జూన్‌లో ఉద్యోగాల సంఖ్య భారీగా పెరిగిందంటూ చెప్పుకొచ్చారు. ఒక్క జూన్ నెలలోనే దాదాపు 50 లక్షల మంది ఉద్యోగాలు పొందినట్టు ఆయన చెప్పారు. దేశచరిత్రలో ఎప్పుడూ ఒక నెలలో ఇన్ని ఉద్యోగాలు రాలేదని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో ఊహించిన దాని కంటే ఎక్కువగా, వేగంగా ఉద్యోగావకాశాలు పెరుగుతూ వెళ్తున్నాయని ట్రంప్ ఇటీవలి కాలంలో అనేక సార్లు చెప్పారు. తాజాగా ఆయన మరోమారు ఉద్యోగాల గురించే తప్ప కరోనా కేసుల పెరుగుదల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కరోనా దానంతట అదే అదృశ్యమవుతుందని తాను ఆశిస్తున్నట్టు బుధవారం ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పుకొచ్చారు. కాగా.. తాజాగా నిర్వహించిన సమావేశం అనంతరం ఆయన మీడియాకు కూడా ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు.  కాగా.. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 27,80,152 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి మొత్తంగా 1,30,798 మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-07-03T02:57:31+05:30 IST