Abn logo
Jan 13 2021 @ 09:15AM

రాజీనామాకు ట్రంప్‌ నో.. అభిశంసనపై నేడు దిగువసభలో ఓటింగ్‌

వాషింగ్టన్‌, జనవరి 12: పదవీకాలం ముగియడానికి ముందే వైదొలగడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంగళవారం టెక్సస్‌ బయల్దేరేముందు మీడియాతో మాట్లాడిన ఆయన - ‘నన్ను అభిశంసించాలన్న ప్రయత్నాలు నిజంగా కోపం తెప్పిస్తున్నాయి. ఇది దారుణం. డెమొక్రాట్లు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు’ అని అన్నారు.


కేపిటల్‌ భవనంపై దాడికి నైతిక బాధ్యత వహిస్తారా.. అన్న ప్రశ్నకు ‘ఆరోజున నేను ర్యాలీని ఉద్దేశించిన మాటలు పూర్తిగా సబబే’ అని బదులిచ్చారు. హింసను తానెన్నడూ ప్రోత్సహించబోనని చెప్పుకొచ్చారు. అటు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై కూడా ఆయన పెద్ద ఆందోళన వ్యక్తం చేయలేదు. కేపిటల్‌ భవనంపై తిరుగుబాటును స్వయంగా ప్రోత్సహించిన నేరంపై 211 మంది కాంగ్రెస్‌ సభ్యులు తెచ్చిన ఈ తీర్మానంపై దిగువ సభ బుధవారం ఓటింగ్‌ జరుపుతుంది. సభలో డెమొక్రాట్లకు మెజారిటీ ఉన్నందున అక్కడ ఆమోదం పొందడం పెద్ద కష్టమేమీ కాదు.


ఇక ఈ తీర్మానం సెనెట్‌ ఆమోదం పొందడంపైనే అనుమానాలున్నాయి. సెనెట్‌లో ఉభయ పక్షాలకూ చెరో 50 సీట్లున్నాయి. ఉపాఽధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారి్‌సతో కలుపుకుంటే డెమాక్రాట్ల బలం 51కు పెరుగుతుంది. మూడింట రెండొంతుల మంది సమర్థిస్తేనే తీర్మానం నెగ్గుతుంది. రిపబ్లికన్లలో ఎంతమంది అభిశంసనను సమర్థిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు బైడెన్‌ ప్రమాణస్వీకార తేదీ దగ్గరపడుతున్న కొద్దీ దేశమంతా ఉద్రిక్తత నెలకొంటోంది. ఈ పట్టాభిషేకాన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా సాయుధ నిరసన ప్రదర్శనలకు, దాడులకు సన్నాహాలు జరుగుతున్నాయని, ట్రంప్‌-అనుకూల అతివాద శక్తులు కుట్రపన్నుతున్నాయని ఎఫ్‌బీఐ వెల్లడించింది.


హింస తప్పదనీ, కనీసం 28 ప్రధాన రాష్ట్రాల్లో పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు జరిపారనీ న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. పరిస్థితి చేజారకుండా చూసేందుకు వాషింగ్టన్‌ డీసీ పరిధిలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించడం విశేషం. ఈనెల 24దాకా ఈ ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని వైట్‌హౌస్‌ తెలిపింది. కాగా- కేపిటల్‌ భవనం వెలుపల ప్రమాణస్వీకారం జరిపేందుకు తానేమీ భయపడడం లేదని  కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. అధ్యక్ష హోదాలో ట్రంప్‌ తాజాగా తీసుకున్న మరో నిర్ణయం... క్యూబాపై ఉగ్రవాద దేశమనే ముద్ర. ఈ నిర్ణయంతో బరాక్‌ ఒబామా హయాంలో క్యూబాపై ఎత్తేసిన టెర్రర్‌ ముద్రను ట్రంప్‌ పునరుద్ధరించినట్లయింది.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement