అగ్రరాజ్యం.. ఆగమాగం.. అమెరికాలో కరోనా కల్లోలం.....

ABN , First Publish Date - 2020-03-31T22:48:26+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలకు పాకింది. చైనాలో పరిస్థితి అదుపులోకి వచ్చినా..

అగ్రరాజ్యం.. ఆగమాగం.. అమెరికాలో కరోనా కల్లోలం.....

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలకు పాకింది. చైనాలో పరిస్థితి అదుపులోకి వచ్చినా.. అమెరికా, ఇటలీలలో మాత్రం కరోనా విళయతాండవం ఆడుతోంది. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాను కరోన వైరస్ కుదిపేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు 1,64,359 కేసులు నమోదు కాగా.. మరణించిన వారి సంఖ్య 3 వేలు దాటింది. అసలు అమెరికాలో ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి? ఇంకెంత కాలం అమెరికాలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది? అగ్రరాజ్యంలో నివసిస్తున్న ప్రవాసులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు? ఆర్థిక మాంద్య ప్రభావం ప్రవాసులపై చూపనుందా?  


ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే..

చైనాలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు డిసెంబర్ నెలలో నమోదైనట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా సోకే ప్రమాదం కూడా ఉందని  శాస్త్రవేత్తలు, నిపుణులు ముందుగానే హెచ్చరించారు. అయినప్పటికి ట్రంప్ ప్రభుత్వం మేల్కోలేదనే చెప్పాలి. విదేశాల నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడిన వారిలో ఎక్కువ మంది చైనీయులే ఉన్నారు. కరోనా మహమ్మారి చైనాను కుదిపేయడం మొదలు పెట్టినా అమెరికా ప్రభుత్వం మాత్రం కళ్లు తెరవలేదు. సరిగ్గా ఇదే సమయంలో చైనా నుంచి అమెరికాకు వేల మంది వచ్చేశారు. న్యూయార్క్‌లో ఎక్కువ శాతం కేసులు నమోదు కావడానికి కూడా ఇదే కారణమని చెప్పుకోవచ్చు. న్యూయార్క్‌లో కేవలం చైనీయులు మాత్రమే నివసించే ప్రాంతాలు అనేకం. ఇదిలా ఉంటే.. ఆసుపత్రులు అసలు పరీక్షలే నిర్వహించడం లేదంటూ అమెరికా ప్రజలు చెబుతున్నారు. వారం రోజుల నుంచి కరోనా లక్షణాలు ఉన్నా.. తనకు కనీసం పరీక్ష నిర్వహించలేదని న్యూజెర్సీకి చెందిన ఓ మహిళ వాపోయింది. న్యూయార్క్ తరువాత అమెరికాలో అత్యధిక కేసులు న్యూజెర్సీలో నమోదయ్యాయి. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో.. న్యూజెర్సీలో ఇప్పటికీ కరోనా సోకిన వారు ఆసుపత్రుల చుట్టూనో, రోడ్లమీదనో తిరుగుతూనే ఉన్నారు. 


అమెరికా సాధారణ స్థితికి వచ్చేది ఎప్పుడు?

రానున్న 30 రోజులు ఎంతో కీలకమైనవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ప్రకటించారు. ప్రజలు సోషల్ డిస్టాన్సింగ్ పాటించాలని ట్రంప్ సూచించారు. అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు పది లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. పరిస్థితి రోజురోజుకూ క్లిష్టంగా మారుతుండటంతో నిత్యం లక్ష మందికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. ఎలా చూసుకున్నా అమెరికా సాధారణ స్థితికి చేరుకోడానికి కనీసం రెండు నుంచి మూడు నెలలు పట్టేలా కనిపిస్తోంది. ఏప్రిల్ నెలలోనే పరిస్థితులు చక్కదిద్దుకోపోతే అమెరికా ఆగమాగం అవడం ఖాయంలా కనిపిస్తోంది. షట్ డౌన్ విధిస్తే అమెరికా ఆర్థిక రంగం దెబ్బతింటుందన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఆ దశగా చర్యలు తీసుకోవడం లేదని తెలియని విషయమే. అయితే పరిస్థితులు చేయి దాటితే మాత్రం అమెరికా షట్‌డౌన్ కావడం.. ఆ ప్రభావం ఆర్థిక రంగం మీద పడటం ఖాయంలా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో అమెరికా ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతినే పరిస్థితులున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక మాంద్యం ఎదురైతే అమెరికాలో లక్షల మంది ఉద్యోగాలు పోవడం తథ్యమని చెబుతున్నారు. ముఖ్యంగా విదేశీయుల ఉద్యోగులపైనే ఈ ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అమెరికాలో హెచ్1బీ వీసాపై సింహ భాగం భారతీయులే పనిచేస్తుండటంతో ఆర్థిక మాంద్యం ప్రభావం భారతీయులపైనే పడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


అమెరికాలో ఉన్న పిల్లలు.. భయం గుప్పిట్లో తల్లిదండ్రులు 

అమెరికాలో తమ పిల్లలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అని భారత్‌లోని తల్లిదండ్రులు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. విదేశాల్లో తమ పిల్లలు ఎలా ఉన్నారో? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో? ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో? ఎలా ఉంటున్నారో? కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో? లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత ఇళ్ళలోనే స్వీయనిర్బంధంలో ఉంటున్నారో లేదో, ఆర్ధికంగా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారో? అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానికంగానే తాము ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు అక్కడ ఎలా ఉందోనని కలవరపడుతున్నారు. విదేశాల్లో ఉన్న తమ పిల్లలకు ప్రతీ రోజు ఉదయం సాయంత్రం ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. వారి గురించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. తాజా పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అక్కడ ఉండలేని పరిస్థితి ఎదురైతే స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం కూడా లేకపోవడం తల్లిదండ్రులను మరింత కుంగదీస్తోంది. మానసికంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. 


అమెరికాలో ఎన్నారైల పరిస్థితి ఎలా ఉంది?

కరోనా నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్టు ప్రవాసులు చెబుతున్నారు. నిత్యావసర వస్తువుల కోసం తప్ప తాము ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని అంటున్నారు. అయితే  అమెరికా వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల కొరత ఎక్కువగా ఉందన్నారు. మరోపక్క అమెరికా పరిస్థితి గురించి తెలిసి భారత్‌లో ఉన్న తమ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారన్నారు. రోజుకు కనీసం రెండు నుంచి మూడు సార్లు ఇంటికి ఫోన్ చేసి తాము సురక్షితంగానే ఉన్నామని చెప్పాల్సి వస్తోందన్నారు. వీకెండ్ వస్తే సినిమాలకు, ట్రిప్‌లు వెళ్లే తాము ప్రస్తుతం ఇళ్లలకే పరిమితం కావాల్సి వచ్చిందని ప్రవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌కు వెళ్లడానికి కూడా అవకాశం లేకపోవడంతో అమెరికాలోనే సురక్షితంగా ఉంటూ వస్తున్నామన్నారు. కరోనా కారణంగా తోటి భారతీయులందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటున్నట్టు కూడా చెప్పారు. అమెరికాలో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులకు తోటి భారతీయులు సహాయం చేస్తున్నారని చెబుతున్నారు. అదే విధంగా భారత్‌కు చెందిన వివిధ సంఘాలు భారతీయుల కష్టాలను తీర్చుతున్నాయన్నారు.


హెచ్1బీ వీసాదారుల గుండెల్లో గుబులు

రానున్న రోజుల్లో అమెరికాలో లక్షల ఉద్యోగాలు పోతాయని అనేక మీడియా సంస్థలు వార్తలు రాసుకొస్తున్నాయి. ముఖ్యంగా విదేశీయులపైనే ఈ ప్రభావం ఉంటుందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఒకపక్క కరోనా అంశం తమను భయపెడుతోంటే.. మరోపక్క తమ ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అసలే హెచ్1బీ వీసాలపై కఠిన ఆంక్షలు పెట్టడం అమెరికన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీలపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు. మరి కొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు ఉండటంతో.. హెచ్1బీ వీసాదారులపై ట్రంప్ గురి పెడతారేమోనని ప్రవాసులు భయపడుతున్నారు. 

Updated Date - 2020-03-31T22:48:26+05:30 IST