ఎన్నారై డెస్క్: అగ్నిప్రమాదాల్లో సాధారణంగా పెద్ద ఎత్తున ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవిస్తుంటుంది. కానీ..అమెరికాలో ఇటీవల జరిగిన ఓ అగ్నిప్రమాదంలో(Fire accident) అదృష్టవశాత్తూ అటువంటిదేమీ జరగకపోగా.. కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుత దృశ్యాలు సాక్షాత్కారమయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యూజెర్సీ(New jersey) రాష్ట్రం సోమర్సెట్ కౌంటీలోని (Somerset County)అంతర్ రాష్ట్ర రహదారిపై(Interstate freeway) ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 4500 కేజీల టపాసులను ట్రక్‌లో(Tractor-trailor) తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ట్రక్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రహదారి పక్కనే పార్క్ చేసి దిగిపోయాడు. అయితే.. చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రక్‌లోని టపాసులు, తారాజువ్వలు ఒక్కసారిగా పేలి.. ఆకాశాన్నంతా రంగు రంగుల కాంతులతో నింపేశాయి. రాత్రి సమయంలో ఇది జరగడంతో.. ఆ ప్రాంతమంతా వెలుగుజిలుగులతో నిండిపోయింది. మరోవైపు.. కొందరు డ్రైవర్లు ఈ అద్భుత దృశ్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని జరుపుకోబోతున్న అమెరికన్లు.. ఇండిపెండెన్స్ డే కాస్తంత ముందుగానే వచ్చేసిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి