ఆరూ.. కారుకే!

ABN , First Publish Date - 2021-12-15T08:06:58+05:30 IST

శాసన మండలి ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. మొత్తం 12 స్థానాలకు గాను.. ఆరు సీట్లను ఇప్పటికే ఏకగ్రీవంగా చేజిక్కించుకోగా..

ఆరూ.. కారుకే!

  • ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం 
  • కాంగ్రెస్‌ బరిలో నిలిచిన చోట క్రాస్‌ ఓటింగ్‌ 
  • అధికార పార్టీలో స్పష్టంగా కనిపించిన అసంతృప్తి
  • కాంగ్రెస్‌, స్వతంత్రుల ఖాతాల్లోకి క్రాస్‌ ఓట్లు
  • స్థానిక సంస్థలకు నిధులివ్వకపోవడమే కారణం?
  • పోటీ చేసిన 2 చోట్లా ఉనికిని చాటుకున్న కాంగ్రెస్‌
  • క్రాస్‌ ఓటింగ్‌తో పార్టీ ఓట్ల కంటే ఎక్కువ లబ్ధి
  • మెదక్‌లో సవాల్‌ను నెగ్గించుకున్న జగ్గారెడ్డి
  • ఖమ్మంలో కాంగ్రెస్‌కు అదనంగా 142 ఓట్లు
  • రెండున్నర రెట్లు అధికంగా సాధించిన రాయల
  • పెద్దల సభకు బోణీ కొట్టిన ఎల్‌.రమణ
  • ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు పాగా.. ‘దండే’ విజయం
  • ఎన్నికలు స్వేచ్ఛగా జరిగి ఉంటే గెలుపు మాదే: భట్టి
  • అయినా అధికార పార్టీకి ‘లోకల్‌’ చురక
  • భారీగా క్రాస్‌ ఓటింగ్‌.. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం
  • ఈ పోరుతో.. విస్పష్టంగా కనిపించిన అసంతృప్తి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): శాసన మండలి ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. మొత్తం 12 స్థానాలకు గాను.. ఆరు సీట్లను ఇప్పటికే ఏకగ్రీవంగా చేజిక్కించుకోగా.. ఎన్నికలు జరిగిన మరో ఆరు సిటింగ్‌ స్థానాలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. అయితే.. పోలింగ్‌ జరిగిన స్థానాల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ నమోదైంది. టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు యథేచ్ఛగా కాంగ్రె్‌సకు.. స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేశారు. టీఆర్‌ఎస్‌ మూడేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో కనిపించగా.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకత తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విస్పష్టమైంది. ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థికి ఆ పార్టీ ‘స్థానిక’ ప్రజాప్రతినిధుల సంఖ్య కంటే రెండున్నర రెట్లు అధికంగా ఓట్లు రావడం గమనార్హం. ఆ ఓట్లన్నీ టీఆర్‌ఎస్‌కు మైనస్‌ అయినవే..! స్థానిక సంస్థలకు నిధులను విడుదల చేయకపోవడం వంటి అంశాలు క్రాస్‌ ఓటింగ్‌కు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. నిజానికి ఇలాంటి ఎన్నికల్లో అధికార పక్షం తమవారిని హైజాక్‌ చేయకుండా ఉండేందుకు విపక్షాలు క్యాంపు రాజకీయాలకు తెరతీస్తాయి. ఇక్కడ మాత్రం.. అధికార పార్టీయే ఆ దిశలో అడుగులు వేయడం గమనార్హం..!


మెజారిటీతో ఏకపక్షమే..

ఆరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ ఉండడంతో ఎన్నికలు అనివార్యమే అయినా.. మెజారిటీతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. కరీంనగర్‌ జిల్లాలోని రెండు స్థానాల్లో.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు టి.భానుప్రసాద్‌రావు, ఎల్‌.రమణ.. తొలి ప్రాధాన్య ఓట్లతోనే ఘన విజయం సాధించారు. భానుప్రసాద్‌ హ్యాట్రిక్‌ కొట్టగా.. ఎల్‌.రమణ మండలికి బోణీ కొట్టారు. ఖమ్మం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. గులాబీ అభ్యర్థి తాతా మధుసూదన్‌ విజయం సాధించినా.. కాంగ్రెస్‌ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు 242 ఓట్లు వచ్చాయి. నిజానికి ఇక్కడ కాంగ్రెస్‌ బలం 98 ఓట్లు మాత్రమే..! ఆ పార్టీ సాధించిన మిగతా ఓట్లలో సింహభాగం టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవి కావడం గమనార్హం. స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయకపోవడంతో.. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తమ వ్యతిరేకతను ఓటురూపంలో చూపినట్లు స్పష్టమవుతోంది. ఖమ్మంలో విజయంపై మంత్రి పువ్వాడ అజయ్‌ మాట్లాడుతూ.. ఇదే ఊపుతో 2023లోనూ టీఆర్‌ఎస్‌ విజయబావుటా ఎగురవేస్తుందన్నారు. 


కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగి ఉంటే.. కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించేవారన్నారు. ఈ ఎన్నికతో టీఆర్‌ఎస్‌ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికార పార్టీకి బుద్ధి చెప్పినట్లేనన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న ఏకైక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే, యాదాద్రి జిల్లా జడ్పీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ కుడుదుల నగేశ్‌ స్వతంత్ర అభ్యర్థిగా 226 ఓట్లను సాధించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా.. విజయం టీఆర్‌ఎ్‌సనే వరించిందన్నారు. అటు ఆదిలాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండే విఠల్‌ 667 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి పెందూరు పుష్పారాణి కేవలం 75 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎ్‌సకు ఇతర పార్టీల నేతలు మద్దతు తెలపడంతోనే భారీ మెజారిటీ వచ్చిందన్నారు. మెదక్‌ జిల్లాలోనూ అధికార టీఆర్‌ఎ్‌సకు ఆ పార్టీ ‘స్థానిక’ ప్రజా ప్రతినిధులు క్రాస్‌ ఓటింగ్‌తో షాక్‌ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి యాదవరెడ్డి 524 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డి 238 ఓట్లు సాధించారు.


నామినేటెడ్‌ పదవులపై టీఆర్‌ఎస్‌ నేతల ఆశలు

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌.. ఫలితాలతో మంగళవారం సాయంత్రం ముగిసింది. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై టీఆర్‌ఎస్‌ నేతల్లో ఆశలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడిన నేతలు.. నామినేటెడ్‌ పోస్టులైనా దక్కుతాయన్న ధీమాతో ఉన్నారు.


రెండేళ్లలో ఎంత మార్పు?

అధికార పార్టీకి ప్రజల్లో, స్థానిక లీడర్లలో ఉన్న ఆదరణలో రెండేళ్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నిజానికి రెండేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం ఏకపక్షంగా సాగింది. అంతేకాదు.. ఇతర పార్టీల నుంచి విజయం సాధించిన ప్రజాప్రతినిధులు కూడా పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ధీమాతోనే అధికార పార్టీ శాసన మండలి స్థానిక సంస్థల కోటాను సులభంగా తమ ఖాతాలో వేసుకోవచ్చని భావించింది. పైగా.. అన్నీ సిటింగ్‌ స్థానాలే. కానీ, అనూహ్యంగా ఆరు స్థానాలే ఏకగ్రీవాలయ్యాయి. మరో ఆరు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. మంగళవారం నాటి ఫలితాలతో ఆ పార్టీపై అసంతృప్తి స్పష్టమైంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ ‘స్థానిక’ బలం కేవలం 98 ఓట్లే.. కానీ, ఆ పార్టీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు 242 ఓట్లు వచ్చాయి. కరీంనగర్‌, ఆదిలాబాద్‌లలోనూ స్వతంత్ర అభ్యర్థులకు టీఆర్‌ఎస్‌ ఓట్లు పడ్డాయి. అధికార పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరతీసి.. ఇతర పార్టీల ఓటర్లను ఆకట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ మాత్రం పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విపక్ష కాంగ్రెస్‌ తన ఉనికిని చాటుకుంది. మెదక్‌లో జగ్గారెడ్డి ఏకంగా సవాలే చేశారు. తమకున్న బలం 231 ఓట్లు కాగా.. అందులో ఒక్క ఓటు తగ్గినా టీపీసీసీ పదవికి రాజీనామా చేస్తానని ప్రతినబూనారు. ఆ పార్టీ అభ్యర్థికి ఏడు ఓట్లు అదనంగా వచ్చాయి.

Updated Date - 2021-12-15T08:06:58+05:30 IST