TRSపై ముప్పేటదాడికి సిద్ధమవుతున్న కమలనాథులు

ABN , First Publish Date - 2022-07-08T00:27:27+05:30 IST

టీఆర్‌ఎస్‌ (TRS)పై ముప్పేటదాడికి కమలనాథులు సిద్ధమవుతున్నారు. 'సాలుదొర.. సెలవుదొర' క్యాంపెయిన్ మరింత ఉధృతం చేయనున్నారు.

TRSపై ముప్పేటదాడికి సిద్ధమవుతున్న కమలనాథులు

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ (TRS)పై ముప్పేటదాడికి కమలనాథులు సిద్ధమవుతున్నారు. 'సాలుదొర.. సెలవుదొర' క్యాంపెయిన్ మరింత ఉధృతం చేయనున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై బీజేపీ ప్రత్యేక కమిటీ వేసింది. తెలంగాణ (Telangana) ప్రభుత్వ ఖర్చుల వివరాలు ఇవ్వాలంటూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 'సాలుదొర.. సెలవుదొర' డిస్‌ప్లే బోర్డుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ (BJP)కి వ్యతిరేకంగా 'బైబై మోదీ' పేరుతో టీఆర్‌ఎస్ ప్రచారం చేసింది. టీఆర్‌ఎస్‌కు కౌంటర్‌గా 'సాలుదొర.. సెలవుదొర' పేరుతో.. హోర్డింగ్‌లు, సోషల్‌మీడియాలో ప్రచారం చేయాలని కమలనాథులు నిర్ణయం తీసుకున్నారు. 


అధికార పార్టీపై సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) అస్త్రం సంధించాలని బీజేపీ నిర్ణయించింది. గత ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతోపాటు వివిధ సందర్భాల్లో కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలు పురోగతిపై ఆర్టీఐ కింద వివరాలు ఇవ్వాలని కోరుతూ ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల ద్వారా దరఖాస్తులు పెట్టించాలని నిర్ణయం తీసుకుంది. హామీ ల అమలుపై ఆధారాలతో సహా కేసీఆర్‌ను నిలదీసేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల యువ మోర్చా నేతలు, పార్టీ రాష్ట్ర నాయకులు దరఖాస్తులు దాఖలు చేయనున్నారు. కాగా, ఇప్పటికే పలు అంశాలపై సమాచారం ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌ (Bandi Sanjay) 80కిపైగా దరఖాస్తులు సమర్పించారు.  


తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ప్రకటించిన బీజేపీ జాతీయ నాయకత్వం.. ఇందుకోసం నేరుగా రంగంలోకి దిగుతోంది. ఢిల్లీ డైరెక్షన్‌లో రాష్ట్రంలో కార్యాచరణ అమలు చేసేలా ప్రణాళిక రచిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా అనుసరించిన ఫార్ములాతోపాటు మరికొన్ని వ్యూహాత్మక కార్యక్రమాలను రాష్ట్ర పార్టీకి నిర్దేశించింది. ఇందులో భాగంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రక్రియనూ వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తన వ్యూహాత్మక కార్యాచరణలో భాగంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలు చేసిన ఫార్ములాను కూడా తెరపైకి తేవాలని కలయనాథులు భావిస్తున్నారు. ఇకపై అధికార టీఆర్‌ఎస్‌ విమర్శలపై ఎప్పటికప్పుడు స్పందించడం, కీలక సామాజికవర్గాలకు మరింత చేరువ కావడం, అవసరమైన నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ -ఎంఐఎం మైత్రిని సూక్ష్మస్థాయిలో ఎండగట్టడం తదితర చర్యలను చేపట్టబోతున్నారు. 


రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను 14 నియోజకవర్గాలను బీజేపీ జాతీయ నాయకత్వం నాలు గు క్లస్టర్లు (ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌)గా  గుర్తించింది. ఆయా నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులను ఇన్‌చార్జులుగా నియమించింది. వీరు ఆయా నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్నారు.

Updated Date - 2022-07-08T00:27:27+05:30 IST