CM KCR: కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీకి టీఆర్ఎస్‌ ప్రతినిధులు

ABN , First Publish Date - 2022-10-02T23:30:47+05:30 IST

డిసెంబర్ 9న ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ (CM KCR) భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

CM KCR: కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీకి టీఆర్ఎస్‌ ప్రతినిధులు

హైదరాబాద్: డిసెంబర్ 9న ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ (CM KCR) భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 6న కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ (Registration) కోసం ఢిల్లీకి టీఆర్ఎస్‌ (TRS) ప్రతినిధులు వెళ్లనున్నారు. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కేసీఆర్‌ సమావేశమైనారు. భేటీలో తాజా రాజకీయాలు, కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. దసరా రోజు మధ్యాహ్నం 1:19 గంటలకు కొత్త పార్టీ ప్రకటించనున్నారు. నూతన పార్టీ ప్రారంభం, దాని ఆవశ్యకత గురించే కాకుండా.. పార్టీ ప్రకటన తర్వాత అమలుచేయాల్సిన కార్యాచరణపైనా చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశాలు, జెండా, అజెండాలపై ఈ సమావేశంలో చర్చించారు. అంతేకాకుండా పార్టీ పేరు విషయంలోనూ కొంత అభిప్రాయ సేకరించినట్లు సమాచారం.


మరోవైపు భారత రాష్ట్ర సమితి (BRS) పేరు ప్రధానంగా వినిపిస్తున్నా.. భారత వికాస సమితి అనే పేరును కూడా పరిశీలిస్తున్నారు. వీటితోపాటు మరో రెండు పేర్లమీదా ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్‌ మనసులో ఒక పేరును ప్రాథమికంగా నిర్ణయించినా.. అభిప్రాయ సేకరణ జరుగుతూనే ఉంది. నూతన జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రులతో సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న సీఎం కేసీఆర్‌... దానికి సంబంధించిన ఏర్పాట్లపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. పార్టీ ప్రకటన తర్వాత రాష్ట్రంలో జరగాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు తదితరాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2022-10-02T23:30:47+05:30 IST