బీజేపీ నేతలు గాడ్సే వారసులు

ABN , First Publish Date - 2022-02-03T07:55:57+05:30 IST

భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు నిజమైన వారసులం తామేనని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ నేతలు గాడ్సే వారసులని ఆయన

బీజేపీ నేతలు గాడ్సే వారసులు

  • మేము అంబేడ్కర్‌ వారసులం
  • దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమే 
  • సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యల్లో తప్పేం లేదు
  • టీఆర్‌ఎస్‌ నేతలు కడియం, బాల్క సుమన్‌విమర్శలు


హైదరాబాద్‌/జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు నిజమైన వారసులం తామేనని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ నేతలు గాడ్సే వారసులని ఆయన విమర్శించారు. బీజేపీ నేతల నుంచి నీతులు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగం ముమ్మాటికీ బైబిల్‌, ఖురాన్‌లాంటిదేనని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల పేదలకు న్యాయం జరగాలంటే కొత్త రాజ్యాంగం రచించుకోవాలని కేసీఆర్‌ పేర్కొనడంలో తప్పేమీలేదని కడియం శ్రీహరి చెప్పారు. అదానీ, అంబానీలకు, కార్పొరేట్‌ శక్తులకు కేంద్రం దోచిపెడుతుందన్నారు.


అసమానతలు రూపుమపడానికి కొత్త రాజ్యాంగం అవసరముందని గట్టిగా నమ్ముతున్నామని తెలిపారు. బీజేపీ నూరు శాతం దళిత, రైతు, మైనారిటీ, మహిళా వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దేశ ప్రగతి కోసం కేసీఆర్‌ కొత్త రాజ్యాంగంపై చర్చను లేవనెత్తారని బాల్క సుమన్‌ చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. బడ్జెట్‌తో రైతులకు, ఉద్యోగ, కార్మికులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఒక్క రోజులోనే రాజ్యాంగం మారిపోయినట్టు కాంగ్రెస్‌, బీజేపీ వ్యవహరిస్తున్నాయని, నిరసనలు, ఆందోళనలు చేపట్టడంలో అర్థం లేదన్నారు. కేసీఆర్‌పై బురద చల్లడమే కాంగ్రెస్‌, బీజేపీల పని అని ధ్వజమెత్తారు. వారి రాజకీయ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించింది కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు కాదా? అని ప్రశ్నించారు. కొత్త రాజ్యాంగంపై చర్చ బీజేపీకి ఇష్టం లేదని, రచ్చ చేయడమే ఆ పార్టీ నైజం అని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ విమర్శించారు. రాచరిక పాలనకు బీజేపీ యత్నిస్తోందని, దానిని అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ యత్నిస్తుందన్నారు.


రాజ్యాంగ పునఃపరిశీలనకు ఎన్డీఏ కమిటీ వేయలేదా?: వినోద్‌

రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను తప్పు పడుతున్న బీజేపీ నేతలకు... రాజ్యాంగ పునఃపరిశీలనకు ఎన్డీఏ ప్రభుత్వం 11 మందితో కమిటీ వేసిన విషయం తెలియదా అని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ మాటలను బీజేపీ నేతలు వక్రీకరించి, దళితులను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. అవసరాన్ని బట్టి రాజ్యాంగాన్ని సవరించుకోవాలంటూ అంబేడ్కర్‌ స్పష్టంగా చెప్పారన్నారు. బీజేపీ ఉత్తరాది పార్టీ అని, బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. గోదావరి నదితో కావేరిని ఎలా అనుసంధానం చేస్తారని, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు ఉన్నందువల్లే కేంద్ర బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులను కేటాయించారని, రేపు కర్ణాటకలో ఎన్నికలు వస్తే ఆ రాష్ట్రానికీ అధికంగానిధులిస్తారని అన్నారు. అలాంటప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ రాజ్యాంగాన్ని మార్చాలని కోరారని తెలిపారు.


ఫుట్‌పాత్‌ గాళ్లలా మాట్లాడుతున్నారు: జగదీశ్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫుల్‌పాత్‌ గాళ్లలా మాట్లాడుతున్నారంటూ  మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ‘వరంగల్‌ నగర అభివృద్ధి అధ్యయన యాత్ర’ పేరుతో నల్లగొండ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు, మునిసిపల్‌, నుడా అధికారులతో కలిసి బుధవారం జగదీశ్‌రెడ్డి వరంగల్‌ నగరంలో పర్యటించి, మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం మార్చాలన్న సీఎం కేసీఆర్‌ అభిప్రాయంలో తప్పేముందని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నో పరిస్థితులు మారాయని, ప్రజాస్వామ్యబద్ధంగా మార్పు అవసరమని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. దీనిపై బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి నోరు పారేసుకుంటున్నారని దుయ్యబట్టారు. 

Updated Date - 2022-02-03T07:55:57+05:30 IST