తెలంగాణలో సబ్బండ వర్గాల మదిని తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే. ఇది మన ప్రభుత్వమేనా? అనే ప్రశ్న తమకు తామే వేసుకుంటూ ప్రజలు మదనపడుతున్న సందర్భాలు కోకొల్లలు. దశాబ్దాల పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో కేవలం ఆరు సంవత్సరాలలోనే ప్రజల్లో ఇంత వైరాగ్యం రావడానికి అనేక కారణాలే ఉన్నాయి. ఉద్యమ నాయకత్వమే పాలకవర్గంగా ఉండి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సహించలేకపోతున్నారు. మాట్లాడుకోలేనంత మౌనం ప్రజల చుట్టూ పహారా కాస్తుండడాన్ని గమనిస్తున్నారు. ప్రశ్నలేదు, ప్రతిపక్షం లేదు. దానిని బతకనివ్వడం లేదు. ఇది ఒక్కటి చాలు ప్రజాస్వామిక ప్రభుత్వం తప్పిదాలేమిటో తెలపడానికి. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి, ఆర్టీసీ సమ్మె, అసెంబ్లీ భవనాలు, కరోనా పరిస్థితులు, ప్రజారోగ్యం, ప్రాజెక్టులు, ప్రైవేట్ యూనివర్సిటీ విద్య వంటి ఎన్నో విషయాలలో ప్రజలకు చేదు అనుభవాలే మిగులుతున్నాయి.
భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని పుండు మీద కారం జల్లినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. సామాన్యులు, పేదలు కట్టుకున్న ఇళ్లు అక్రమం అని ప్రభుత్వం అనుకుంటే నామమాత్రపు చార్జీలతో క్రమబద్ధీకరించాలి కానీ, దాన్నొక ప్రధాన ఆదాయ మార్గంగా పరిగణించడం తగదు. ప్రైవేట్ టీచర్ల జీవనభృతికి ఉద్యోగభద్రతకు హామీ కల్పించే చర్యలు తీసుకోవాలి. ఉద్యమ సమయంలో కలిసి పని చేసిన వ్యక్తులు, శక్తులతో సలహామండలి ఏర్పాటు చేసి రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటును కోరాలి. అనవసర రాజకీయ ఘర్షణలకు తావు లేకుండా ప్రభుత్వం పనితీరు ఉండాలి. ప్రజల ఆలోచనలను గుర్తించక పథకాలతో మభ్యపెడుతూ పక్కాగా పాలిస్తున్నామని అనుకోవడం వల్ల ప్రయెజనం ఉండదు. నిత్యం ఒంటెత్తుపోకడలు పోతుంటే మున్ముందు తగిలే ఎదురుదెబ్బలకు ప్రభుత్వం సిద్ధం కావల్సిందే.
– జోగు అంజయ్య, జనగామ