ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీఆర్ఎస్

ABN , First Publish Date - 2021-12-14T15:40:50+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. పోటీ చేసిన అన్ని చోట్లా ఘన విజయం సాధించింది. నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్‌లలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీఆర్ఎస్

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. పోటీ చేసిన అన్ని చోట్లా ఘన విజయం సాధించింది. నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్‌లలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా.. అన్ని చోట్లా టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. ప్రాంతాల వారీగా ఆయా పార్టీలకు పోలైన ఓట్లపై ఓ లుక్కేద్దాం.


నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. నల్లగొండలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 1233 ఓట్లు పోలవగా... 1183ఓట్లు చెల్లాయి. చెల్లని ఓట్లు 50. గెలుపు కోటా 593 కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు వచ్చాయి. 


ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు విజయం సాధించారు. తొలుత భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ ప్రచారం జరగడంతో టీఆర్ఎస్ ఒకింత ఆందోళనకు గురైంది. అయితే విజయం మాత్రం టీఆర్ఎస్‌నే వరించింది. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకి 480 ఓట్లు రాగా.. రాయల నాగేశ్వరరావుకి 242, కొండపల్లి శ్రీనివాసరావుకి 4, కోండ్రు సుధారాణికి ఒక్కటి కూడా పడలేదు. 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు. 


కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ హవా కొనసాగింది. జిల్లా ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే టీఆర్ఎస్ అభ్యర్థులు ఎల్ రమణ, భాను ప్రసాదరావు విజయం సాధించారు. భాను ప్రసాదరావుకు 500 ఓట్లు రాగా, ఎల్ రమణకు 450 ఓట్లు వచ్చాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్‌కు 232 ఓట్లు వచ్చాయి. 


మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి 524 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. మొత్తం 1010 ఓట్లు పోలవగా టీఆర్ఎస్ అభ్యర్థికి 762 ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 06 ఓట్లు రాగా...చెల్లనివి 12 ఓట్లు పోలయ్యాయి. 


ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ స్థానం టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండే విఠల్ ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణికి 72 ఓట్లు వచ్చాయి.




Updated Date - 2021-12-14T15:40:50+05:30 IST