TS News: పార్టీ మారడం చారిత్రక అవసరం: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-07-24T19:35:14+05:30 IST

టీఆర్ఎస్‌ (TRS)ను ఓడించే సత్తా బీజేపీ (BJP)కి మాత్రమే ఉందని, పార్టీ మారడం చారిత్రక అవసరమని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

TS News: పార్టీ మారడం చారిత్రక అవసరం: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్: టీఆర్ఎస్‌ (TRS)ను ఓడించే సత్తా బీజేపీ (BJP)కి మాత్రమే ఉందని, పార్టీ మారడం చారిత్రక అవసరమని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (MLA Rajagopal Reddy) స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి వెళ్తానని ప్రకటించారు. ఇప్పుడు సమయం వచ్చింది అనుకుంటున్నానని పేర్కొన్నారు. కేంద్రమంత్రి అమిత్‌షా (Union Minister Amit Shah)తో రాజకీయాలపై మాట్లాడలేదని, తెలంగాణలోని పరిస్థితులపై అమిత్‌షాతో చర్చించానని తెలిపారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రం జీతాలు ఇవ్వలేని స్థితికి వచ్చిందని చెప్పారు. హుజురాబాద్ (Huzurabad) ఉపఎన్నికతో పోయిన ప్రతిష్టను.. మునుగోడు ఉపఎన్నికతో తిరిగి తెచ్చుకోవాలని సీఎం కేసీఆర్ (CM KCR) యోచిస్తున్నారని తెలిపారు. తనపై కేసీఆరే దుష్ప్రచారం చేయిస్తున్నారని, మునుగోడుకు ఉపఎన్నిక రావాలని తాను కోరుకోవడం లేదన్నారు. కేసీఆర్‌ను ఎదురుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైందని తప్పుబట్టారు. కొత్తగా వచ్చిన వాళ్ల కింద పనిచేయాలంటే ఇబ్బందేనని, జైలుకెళ్లి వచ్చిన వాళ్లు కూడా నీతులు చెప్తే ఎలా? అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.


రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని మూడేళ్ల క్రితమే తిరుపతిలో రాజగోపాల్‌రెడ్డి సంచలన కామెంట్‌ చేశారు. నాటి నుంచి ఆయన ఢిల్లీ బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారు. ఉప ఎన్నికకు వెళ్లాలని బీజేపీ నేతలు రాజగోపాల్‌పై ఒత్తిడి తెస్తున్నా ఆయన దాట వేస్తున్నారు. సాధారణ ఎన్నికలు సమీపించే నాటికి కాంగ్రెస్‌ పుంజుకుంటే ఓకే అని, లేదంటే బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయమన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిస్తే తనకు వ్యక్తిగతంగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఆర్థిక, మానసిక ఇబ్బందులు, తీరా గెలిచినా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే కనీసం కల్యాణలక్ష్మి చెక్కుకూడా పంచలేడు. అంతదానికి రాజీనామా, ఉపఎన్నిక ఎందుకన్న ఆలోచనలో రాజగోపాల్‌రెడ్డి ఇంతకాలం ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు తప్ప ఇతర ఏ సందర్భంలోనూ కాంగ్రెస్‌ నేతలతో రాజగోపాల్‌ కలిసి రాలేదు. అయితే తాజాగా అమిత్‌షా ఒత్తిడి నేపథ్యంలో ఆయన పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి ఆగస్టులో తమ నాయకుడు ఒక ప్రకటన చేస్తారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్తరాఖండ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంస్థ.. కాంట్రాక్టులు చేస్తుందనీ, వాటి పనుల నిమిత్తమే రాజగోపాల్‌రెడ్డి తరచూ బీజేపీ పెద్దలను కలుస్తుంటారనీ కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం ఉంది. ఆ క్రమంలోనే బీజేపీకి దగ్గరయ్యారనీ చెబుతుంటారు.


మునుగోడు ఉప ఎన్నికల జరిగితే ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. శాసనసభ ఎన్నికల ముందు వచ్చే ఈ ఉప ఎన్నికలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చావో.. రేవో లాంటివనీ ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కీలక పదవిని క్లెయిమ్‌ చేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపైనే ఈ ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత పెట్టాలన్న ప్రతిపాదన అధిష్ఠానం ముందు పెడతామని పార్టీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. రాజగోపాల్‌రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సొంత సోదరుడు కావడంతో సహజంగానే కోమటిరెడ్డిపైన రాజకీయంగా ఈ మేరకు ఒత్తిడీ పెరుగుతుందని చెబుతున్నారు.

Updated Date - 2022-07-24T19:35:14+05:30 IST