Advertisement
Advertisement
Abn logo
Advertisement

రికార్డుల్లో తుక్కు.. అదే ఆటో రోడ్లపైకెక్కు..!

  • రవాణా అధికారులు, దళారుల కుమ్మక్కు
  • కాలం చెల్లిన ఆటోలు.. రికార్డుల్లోనే ‘స్ర్కాప్‌’
  • వాటిని తక్కువ ధరకే డ్రైవర్లకు అమ్మేస్తారు
  • అదే ఆటో స్థానంలో కొత్త ఆటోలకూ పర్మిట్‌!
  • చోద్యం చూస్తున్న రవాణా యంత్రాంగం

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాలం చెల్లిన ఆటో రిక్షాలను తుక్కు కింద మార్చే విధానం రవాణా శాఖ అధికారులకు కాసులు కురిపిస్తోంది. ఆటోలు నడుపుకొని స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగ యువతకు చుక్కలు చూపుతోంది. కొత్త ఆటోల రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధపు ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు, సిబ్బంది రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. దీనిపై రవాణా శాఖలోని విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. 2002లో అప్పటి ప్రభుత్వం గ్రేటర్‌ పరిధిలో కొత్త ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే అవకాశం ఉంటుందని భావించి అప్పట్లో 68500 ఆటోలకు పరిమితం చేసింది. అనంతరం స్వయం ఉపాధి కోసం యువతను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా మరో 20 వేల ఆటోలకు అనుమతి ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకించి ఆటోలపై నిషేఽధాన్ని తాత్కాలికంగా తొలగించి 95,100కు పరిమితం చేసింది. 15 ఏళ్ల కాలపరిమితి దాటిన ఆటోను తుక్కు(స్ర్కాప్‌) కింద తొలగిస్తే దాని పర్మిట్‌ను కొత్తగా కొనుగోలు చేసిన ఆటోకు బదిలీ చేసుకునేందుకు రవాణా శాఖ అనుమతిస్తుంది. ఎంవీఐ సమక్షంలో కాలం చెల్లిన ఆటోను స్ర్కాప్‌ చేస్తే ఈ పర్మిట్‌ లభిస్తుంది. గ్రేటర్‌లో ఆటో స్ర్కాప్‌ను ధ్రువీకరించేందుకు మెహిదీపట్నం, బండ్లగూడ, నాగోల్‌ ఆర్టీఏ కార్యాలయాల్లోని ఎంవీఐలకు అధికారం అప్పగించారు. ఇక్కడే అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దళారులతో కుమ్మక్కై ఆటోను స్ర్కాప్‌ చేయకుండానే చేసినట్టు చూపి.. ఆ ఆటోను తిరిగి డ్రైవర్లకు విక్రయించి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. చాలా మంది డ్రైవర్లు తక్కువ ధరకు ఆటో లభిస్తుందనే ఆశతో కొనుగోలు చేసి మోసపోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కొత్త ఆటో ధర సుమారు రూ.3.40 లక్షలకు పైగా ఉంది. స్ర్కాప్‌ చేసినట్టు చూపే ఆటోలు సగం ధరకే వస్తున్నాయన్న ఆశతో కొనుగోలు చేస్తున్న అమాయకులు.. రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లినప్పుడు అసలు విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు. మెహిదీపట్నం, బండ్లగూడ, నాగోల్‌ రవాణా కార్యాలయాల్లో నెలకు 50-60 ఆటోరిక్షాలను స్ర్కాప్‌ చేస్తున్నట్టు తెలిసింది. స్ర్కాప్‌ అయిన ఆటోల్లో అత్యధిక శాతం పాతనగరంలో తిరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆటో డ్రైవర్‌ బకాయిలు పూర్తి స్థాయిలో తీర్చకపోతే సంబంధిత ఫైనాన్సర్‌ దళారులతో కుమ్మక్కై ఆ ఆటోను స్ర్కాప్‌ చేసినట్టుగా తప్పుడు రికార్డులు రాయించి, దాని స్థానంలో కొత్త ఆటోను కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. ఇదిలా ఉండగా.. ఆటో రిక్షా స్ర్కాప్‌ విధివిధానాలపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని రవాణా అధికారులు చెప్పడం గమనార్హం.

Advertisement
Advertisement