అనువాదకురాలు శాంత సుందరి మృతి

ABN , First Publish Date - 2020-11-12T08:01:18+05:30 IST

ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమార్తె, ప్రముఖ అనువాదకురాలు శాంతసుందరి రామవరపు(73) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న

అనువాదకురాలు శాంత సుందరి మృతి

హైదరాబాద్‌ సిటీ, నవంబరు11 (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమార్తె, ప్రముఖ అనువాదకురాలు శాంతసుందరి రామవరపు(73) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, బుధవారం రాత్రి 8:30 గంటలకు ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె ఆర్‌.శాంతసుందరిగా తెలుగు పాఠకలోకానికి సుపరిచితురాలు. ఆమె సహచరుడు డాక్టర్‌ గణేశ్వరరావు. వీరికి అరుణ, సత్య అమ్మాయిలు. ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు.


శాంతసుందరి తల్లి వరూధిని(96) నగర శివారులోని ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ప్రఖ్యాత హిందీ కవి హరివంశరాయ్‌ బచ్చన్‌ రచనల స్ఫూర్తితో హిందీ సాహిత్యంలోని కవిత్వం, కథలు, నవలలను తెలుగు పాఠకులకు శాంత సుందరి పరిచయం చేశారు. ‘కథాభారతి’, ‘ఇంట్లో ప్రేమ్‌చంద్‌’, ‘కథ కానికథ’తోపాటు ఆనందనీలకంఠన్‌ ‘అసుర’, ‘అజేయుడు’ కురువంశ ప్రాచీన గాథ, ‘రెక్కల ఏనుగులు’ బాలల కథలను తెలుగులోకి ఆమె అనువదించారు.


ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యువాల్‌ నోఆహ్‌ హరారీ ఆంగ్ల రచన మానవజాతి పరిణామ క్రమం సంక్షిప్త చరిత్ర ‘సేపియన్స్‌’నూ తెలుగులోకి తీసుకువచ్చారు. మరో ముఫ్ఫై వరకూ తెలుగు సాహిత్య గ్రంథాలను హిందీలోకి అనువదించారు. ఆచార్య ఎన్‌.గోపీ రచించిన ‘కాలాన్ని నిద్ర పోనివ్వను’ సంకలనాన్ని హిందీలో రాశారు. ఓల్గా రాసిన స్వేచ్ఛ నవలను హిందీలోకి అనువదించారు. శాంతసుందరి సుమారు 75 తెలుగు, హిందీ, ఆంగ్ల భాషానువాదాలు చేశారు.


‘ఇంట్లో ప్రేమ్‌చంద్‌’ అనువాదానికి 2015లో కేంద్రసాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. 2005లో ఢిల్లీలోని భారతీయ అనువాద పరిషత్‌ ప్రతిష్ఠాత్మకమైన ‘గార్గీ గుప్తాద్వివాగీశ్‌’ అవార్డుతో సత్కరించింది. శాంత సుందరి మృతి పట్ల ఆచార్య ఎన్‌ గోపీ సంతాపం ప్రకటించారు. ఆమె అంత్యక్రియలు గురువారం ఉదయం ఆరుగంటలకు ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నట్లు ఆమె పెద్దకూతురు అరుణ తెలిపారు.


 

Updated Date - 2020-11-12T08:01:18+05:30 IST